నవతెలంగాణ – అశ్వారావుపేట
సేంద్రీయ సాగు పై స్థానిక వ్యవసాయ కళాశాల విద్యార్దులకు “జీవ” కో ఆర్డినేటర్ వెంకటేశ్వరరావు,ఈఎస్ఆర్పీ శ్రీనివాసు అవగాహన కల్పించారు. బుదవారం మండలంలోని పండువారిగూడెం “జీవ ప్రాజెక్టు” కు చెందిన జీవ వనరుల కేంద్రంలో ప్రకృతి వ్యవసాయం,వివిధ రకాల కషాయాలు తయారీ, పంటలకు చీడపీడల నివారణకు తీసుకోవలసిన చర్యల పై అవగాహన బోధించారు.నాబార్డు సహకారంతో వాసన్ ఎన్జీవో పర్యవేక్షణలో మల్లాయిగూడెం, రామన్నగూడెం పంచాయతీల్లోని ఔత్సాహిక రైతులను జీవ ప్రాజెక్టులో ఎంపిక చేయటం జరిగిందన్నారు.మొదట దశలో 43 మంది,రెండోవ దశలో 137 మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించేందుకు ప్రయత్నాలు చేశామన్నారు.ప్రకృతి వ్యవసాయం కొత్తదేమీ కాదని మన పూర్వీకులు చేసిన వ్యవసాయం లోనే సులభ పద్దతిలో చేపట్టినట్లు తెలిపారు.ఖరీఫ్ సీజన్ లో నవధాన్యాలను విత్తి 45 రోజుల తరువాత దుక్కి కలియ దున్నటం ద్వార భూసారం పెరుగుతుందన్నారు.
భీజామృతం తో శుద్ది చేయటం వల్ల ఎటువంటి తెగుళ్లు ఆశించవన్నారు.మొలకలు వచ్చిన తరువాత ప్రతి 15 రోజులకు (పౌర్ణమి, అమావాస్య కు) కషాయాలు పిచికారి చేయాలని,గ్రుడ్డు దశలో ఉండగానే నివారించాలన్నారు.వరి సాగులో దేశీ వంగడాలు వినియోగించి పంటలు పండించటం ద్వార మన కుటుంబసభ్యులు ఆరోగ్యవంతంగా ఉంటారని, అదే విధంగా మంచి గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు.మా రైతుల వల్ల క్వింటా ధాన్యం రూ.3 వేలకు కొనుగోలు చేస్తున్నారని వివరించారు. ఏక పంటల ద్వార రైతులు నష్టపోతున్నారని బహుళ పంటలు సాగు చేయించేందుకు జీవ ప్రాజెక్టు ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.ద్రవ, ఘన జీవామృతం,నీమాస్త్రం, అగ్నిఅస్త్రం, బ్రహ్మస్త్రం, కోడిగ్రుడ్లు, నిమ్మరస ద్రావణం, తూటికాడ, సప్తగింజలు కషాయాలు, పేడ, మూత్రం ఇంగువ, చేప బెల్లం, పంచగవ్య, వేపనూనె తయారీకి కావలసిన పదార్దాలు తయారీ విధానం, చీడపీడల నివారణకు ఎంత మోతాదు వినియోగించాలనేది వివరించారు. బయో చార్ ఉపయోగాలు పై అవగాహన కల్పించారు. ప్రకృతి రైతు ఈఎస్ఆర్పీ మొడియం సీతారాముల తన అనుభవాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల బోధనా సిబ్బంది డాక్టర్ కే. నాగాంజలి, కే.హిమ శ్రీ, వాసన్ సిబ్బంది, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాల 2 వ సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు 73 మంది పాల్గొన్నారు.



