ఏడాదిగా పెండింగ్.. ఏజెన్సీలకు తప్పని తిప్పలు
ప్రభుత్వమిచ్చేది రూ. 6.. మార్కెట్లో ధర రూ.7 పైనే
అప్పులు చేస్తున్న ఏజెన్సీ నిర్వాహకులు
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
కోడిగుడ్డు ధర పిరమై కొండెక్కుతోంది. పెరిగే ధరల ప్రభావం మధ్యాహ్నా భోజన పథకంపై పడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంలో భాగంగా ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తుంది. సర్కార్ సకాలంలో బిల్లులు ఇవ్వకున్నా ఏజెన్సీ నిర్వహణ చూస్తున్న స్వయం సహాయక సంఘాల మహిళలు మాత్రం అప్పులు చేసి పిల్లలకు భోజనం వండి పెడుతున్నారు. ధరలు పెరుగుతున్నా మెనూ మాత్రం ప్రభుత్వం పెంచడం లేదు. భోజనంలో వారానికి మూడ్రోజులు విద్యార్థులకు గుడ్డు పెట్టాల్సి ఉంది. ప్రస్తుతం కూరగాయలు, గుడ్ల ధరలు పెద్దఎత్తున పెరిగాయి. గుడ్డు బయట కిరాణా షాపుల్లో రూ.7 నుంచి రూ.8 వరకు అమ్ముతున్నారు. ప్రభుత్వం గుడ్డుకు ఇచ్చేది మాత్రం రూ.6. అదనంగా నిర్వాహకులపై రూ.2 భారం పడుతోంది. ఆ బిల్లు కూడా 12 నెలలుగా ఇవ్వకపోవడంతో భోజనంలో గుడ్డు పెట్టడానికి నిర్వాహకులు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 3143 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో లక్ష 76,659 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. నల్లగొండ జిల్లాలోని 1207 పాఠశాలల్లో లక్షా 53 వేల 483 మంది విద్యార్థులు చదువుతున్నారు. సూర్యాపేట జిల్లాలో 872 పాఠశాలల్లో 99094 విద్యార్థులు మంది ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 659 పాఠశాలలు ఉండగా.. అందులో 90124 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ విద్యార్థులందరికీ వారానికి మూడ్రోజులు మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం కోసం గుడ్డును అందిస్తున్నారు.
పెరుగుతున్న గుడ్డు ధర
గుడ్డు ధర రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఫామ్‌వద్ద రూ.6.50 పైసలు ఉండగా, బహిరంగ మార్కెట్లో రూ.7కు అమ్ముతున్నారు. ప్రతిరోజూ పౌల్ట్రీఫామ్స్ వద్ద రూ.10 నుంచి 20 పైసలు పెరుగుతోంది. మార్కెట్లో రిటైల్‌గా కిరణా షాపుల్లో కొన్ని చోట్ల రూ.8కి కూడా అమ్ముతున్నారు. దీంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులు అదనంగా రూ.2 రూపాయలు కలిపి విద్యార్థులకు భోజనంలో గుడ్డు ఇవ్వాల్సి వస్తోంది. కూరగాయల బిల్లుతోపాటు కోడి గుడ్ల బిల్లును ప్రభుత్వం ప్రత్యేకంగా అందిస్తోంది. అయితే, ఏడాదికాలంగా గుడ్ల బిల్లు చెల్లించడంలేదని నిర్వాహకులు అంటున్నారు. మధ్యాహ్న కార్మికుల ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా అప్పులు చేసి విద్యార్థులకు పౌష్టికాహారం పెడుతున్నారు. వంట చేయడానికి నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు.
బిల్లులు సమర్పించాం : జిల్లా విద్యాధికారి బొల్లారపు భిక్షపతి
ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన అన్ని రకాల బిల్లులను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాం.
ప్ర్రభుత్వమే గుడ్లు సరఫరా చేయాలి
ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజన పథకం కోసం ప్రభుత్వమే గుడ్లు సరఫరా చేయాలి. భోజనానికి కావలసిన సరుకులన్నీ ప్రభుత్వమే సమకూర్చి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చర్యలు తీసుకోవాలి. వెంటనే ప్రభుత్వం బకాయిలు విడుదల చేయాలి.
పోలే సత్యనారాయణ, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం – నల్లగొండ జిల్లా కార్యదర్శి
బిల్లులు చెల్లించకపోతే ఎలా
ధరలు పెరగడం వల్ల ప్రభుత్వం చెల్లించే బిల్లు సరిపోవడం లేదు. అదనంగా ప్రతి రోజూ 500 రూపాయల అవుతోంది. ఒకవైపు ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం, మరోవైపు రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో ఇబ్బందులు పడుతున్నాం. అప్పులు చేయాల్సి వస్తోంది. మార్కెట్ ధరలకు అనుగుణంగా మెనూ పెంచాలి.
కొప్పు అండాలు, మధ్యాహ్న భోజన కార్మికురాలు, నార్కట్‌పల్లి పాఠశాల



