కాప్ 30 సదస్సులో ఆందోళనకారుల ఆగ్రహం
సెక్యూరిటీ గార్డులతో ఘర్షణ
బెలెమ్ : వాతావరణ సదస్సు కాప్ 30 జరుగుతున్న వేదిక వద్దకు వెళ్ళేందుకు ఆదివాసీలు, ఆదివాసీయేతరులు ప్రయత్నించిన నేపథ్యంలో మంగళవారం రాత్రి సెక్యూరిటీ గార్డులతో వారికి ఘర్షణలు జరిగాయి. డజన్ల సంఖ్యలో పురుషులు, మహిళలు ప్రవేశ ద్వారం నుండి లోపలకు తోసుకుపోవడానికి ప్రయత్నిం చారు. వీరిలో కొందరు ప్రకాశవంతమైన ఈకలు తలపై ధరించడం కనిపించింది. వారు ఒక తలుపును బలవంతంగా తోయడంతో విరిగిపోయింది. ఆ తర్వాత మెటల్ డిటెక్టర్ల గుండా వెళ్ళిన వారందరూ బ్లూ జోన్‌లోకి ప్రవేశించారు. దాంతో ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ గార్డులు హడావిడిగా వారిని నిలువరించే ందుకు వచ్చారు.
దాంతో అక్కడ తోపులాటలు, ఘర్షణలు, తిట్టుకోవడాలు చోటు చేసుకున్నాయి. ”మా అడవులు అమ్మకానికి లేవు.” అని రాసిన ప్లకార్డును వారు ప్రదర్శించారు. ‘జుంటోస్’ (కలిసి) అని రాసిన టీ షర్ట్‌లను ధరించారు. బ్యానర్లను ప్రదర్శిస్తూ, అక్కడ నుండి సెక్యూరిటీ గార్డులు బలవంతంగా తరలించేవరకు గట్టిగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు గార్డులకు స్వల్ప గాయాలయ్యాయని యూఎన్ వాతావరణ ప్రతినిధి ఒకరు తెలిపారు. వేదిక కూడా కొద్దిగా దెబ్బతింది. ఘర్షణ అనంతరం ఆందోళనకారులు అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ప్రవేశ మార్గాన్ని బ్లాక్ చేస్తూ అగ్నిమాపక దళ అధికారులు వలయంలా ఏర్పడి పహరా కాశారు. అయితే దీనికి బాధ్యులెవరో తెలియరాలేదు.
ఆందోళనకారుల ఆగ్రహం
”మేం లేకుండా మా గురించి వారు నిర్ణయించలేరు.” అంటూ ఆ వచ్చిన వారు నినదించారని గ్లోబల్ యూత్ కొయిలేషన్‌కి చెందిన ఆగస్టిన్ ఓషనా చెప్పారు. సదస్సులో ఆదివాసీలు పాల్గొనడంపై రేగిన ఉద్రిక్తతలను ప్రస్తావించారు. విద్య, ఆరోగ్యం, అటవీ సంరక్షణ వంటి కీలక రంగాలపై ఖర్చు పెట్టడం అవసరంగా కనిపిస్తున్నపుడు బెలెమ్‌లో కాప్ సదస్సు నిర్వహణ కోసం ఏకంగా కొత్త నగరాన్ని నిర్మించేందుకు మొత్తంగా వనరులన్నింటినీ గుమ్మరించడంపై కొన్ని ఆదివాసీ కమ్యూనిటీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయని ఓషనా చెప్పారు. ఇలా సెక్యూరిటీ గార్డులతో ఘర్షణ పడ్డారని వారిని చెడ్డ వ్యక్తులుగా చిత్రీకరించలేమని, తమ భూమిని, తమ నది (అమెజాన్)ని కాపాడుకోవడానికి ప్రయత్నించి, వారు విసిగి వేసారిపోయారని అన్నారు.
చురుగ్గా ఆదివాసీ గ్రూపులు
ఇటీవల వాతావరణ సదస్సుల్లో ఆధిపత్యం వహించిన లాబీయిస్టులను ఎదుర్కొనడంలో వేదిక లోపల, వెలుపల ఆదివాసీ గ్రూపులు, ఎన్‌జీఓలు చురుకుగా కనిపిస్తున్నాయి. గురు, శుక్రవారాల్లో ప్రజా సదస్సు జరగనుంది. అలాగే అంతర్జాతీయ యువజన ర్యాలీని కూడా శుక్రవారం నిర్వహించనున్నారు. శనివారం బ్రహ్మాండమైన ప్రదర్శన జరగాల్సి వుంది. గత వారం రోజులుగా ఆదివాసీల రాక కూడా బాగా పెరుగుతోంది. ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలన్నీ ప్రశాంతంగానే జరిగాయి. మంగళవారం పాలస్తీనా అనుకూల మద్దతుదారులు, ఆరోగ్య, పర్యావరణ గ్రూపులు నిరసనలు నిర్వహించాయి.



