నేను ఏ రోజూ పదవులు అడిగింది లేదు
ఓట్ చోరీపై త్వరలోనే ప్రత్యేక కమిటీ
కొండా సురేఖ విచారం వెనుక ప్రత్యేకతేమీ లేదు
హైకోర్టు తీర్పు మేరకు స్థానికంపై ముందుకెళ్తాం
జూబ్లీహిల్స్‌లో గెలుపు మాదే
వచ్చేసారీ కాంగ్రెస్‌దే అధికారం : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, ఆ సందర్భంగా ఎవరెవరికి బెర్తులు కేటాయించాలనే విషయమై ముఖ్యమంత్రి రేవంత్‌తోపాటు తమ పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్ పదవిలో తాను ఇప్పుడు పూర్తి సంతృప్తిగా ఉన్నానని ఆయన తెలిపారు. తానెప్పుడు పదవు లు కావాలని అడగలేదని పేర్కొన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనేది తన అభిమతమనీ, అయితే ఆ వ్యక్తి మహేశ్ కుమార్ గౌడే కావాలనే రూలేం లేదని వ్యాఖ్యానించారు.
బుధవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మహేశ్ కుమార్ గౌడ్… పాత్రికేయులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, క్యాబినెట్ విస్తరణ, ఓట్ చోరీ, బీహార్ ఎన్నికలు, కాంగ్రెస్ ప్రభుత్వ రెండేండ్ల పని విధానం తదితరాంశాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. తమ పార్టీ అంచనాల ప్రకారం జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
నవీన్ కుమార్‌ను అక్కడ అభ్యర్థిగా నిలపటం తమ పార్టీకి సానుకూలంగా మారిందన్నారు. గతానికి భిన్నంగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల ందరూ ఈ ఉప ఎన్నిక కోసం కలిసికట్టుగా పని చేశారని తెలిపారు. ఇది తమ పార్టీలోని ఐక్యతను నిదర్శమని చెప్పారు. పోలింగ్ శాతం ఇంకా పెరిగి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. యువత పోలింగ్‌కు దూరంగా ఉన్నారని వాపోయారు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. జూబ్లీహిల్స్‌లో ఓడిపోతామనే భయంతోనే ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ అబద్ధపు వార్తలు, అబద్ధపు ప్రచారానికి (ఫేక్ న్యూస్) పాల్పడిం దని విమర్శించారు. డబ్బులిచ్చి సోషల్ మీడియాలో తమ పార్టీపై అడ్డగోలుగా దుష్ప్రచారం చేశారని దుయ్యబట్టారు. ఇలాంటి చర్యల వల్ల తాత్కాలిక ఆనందమే తప్ప శాశ్వత ఫలితాలు ఉండబోవని బీఆర్‌ఎస్‌కు హితవు పలికారు. తమకున్న సమాచారం మేరకు బీహార్‌లో కూడా మహాఘట్ బంధన్ గెలవబోతోందని ఆయన చెప్పారు.
ప్రస్తుతం తమ ప్రభుత్వానికి ఇంకా మూడేండ్ల సమయముందనీ, ఆ తర్వాత కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరబోతోందని పీసీసీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు. తాను, సీఎం రేవంత్ కలిసి రెండోసారి కూడా పార్టీని గెలిపించి, సోనియా గాంధీకి బహుమతిగా ఇస్తామని వ్యాఖ్యానించారు. దేశంలో ఓట్ చోరీకి సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారని గుర్తు చేశారు. అదే తరహాలో రాష్ట్రంలో కూడా ఓట్ చోరీపై విస్తృత ప్రచారం నిర్వహించి, ముగ్గురు ఎమ్మెల్యేలతో ఒక కమిటీని వేయబోతున్నామని వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు కాబోతున్న తరుణంలో పార్టీ తరపున కూడా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తామని వివరించారు.
పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా అధిష్టానం సూచనల మేరకు త్వరలోనే డీసీసీలను ఏర్పాటు చేస్తామని మహేశ్ తెలిపారు. స్థానికంగా ప్రజల్లో పట్టుండే నాయకులకే తొలి ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. వీరిలో కొందరు ఎమ్మెల్యేలు కూడా ఉంటే ఉండొచ్చని అన్నారు. ఎమ్మెల్యే అయినంత మాత్రాన డీసీసీ అధ్యక్షుడు కాకూడదనే నిబంధనేదీలేదని స్పష్టం చేశారు. మంత్రి కొండా సురేఖ.. సినీ నటుడు నాగార్జున కుటుంబానికి క్షమాపణ చెప్పటం(చింతిస్తున్నానని చెప్పటం) వెనక ప్రత్యేకతేమీ లేదని అన్నారు. దీనిపై ఎలాంటి ఒత్తిళ్లు, ఎవరీ ప్రమేయమూ ఉండబోదని అభిప్రాయపడ్డారు. హైకోర్టు తీర్పు మేరకు స్థానిక ఎన్నికలపై ముందుకెళతామని స్పష్టం చేశారు.
అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



