సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తాం
జిల్లాకు సాగు నీరందించడంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ విఫలం : తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
కృష్ణానది నుంచి తాగు, సాగునీటి అవసరాలకు సరిపడ నీళ్లు తేవడంలో అలసత్వం ప్రదర్శిస్తే సీఎం ఇంటి ముందు నిర్వాసితులతో కలిసి ధర్నా చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆమె నల్లగొండ పట్టణంలోని జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ తెచ్చుకున్నామన్నారు. గత పదేండ్లలో చాలా విజయాలు సాధించాం.. కానీ ఇంకా సాధించాల్సింది చాలా ఉందని అన్నారు. మన నీళ్లు మనకు వస్తాయని అందరం అనుకున్నాం.. కానీ నల్లగొండ జిల్లాకు కృష్ణా నీళ్లు పూర్తి స్థాయిలో వచ్చాయో లేదో ఆలోచించారన్నారు. మాధవరెడ్డి ప్రాజెక్ట్, మూసీ, డిండి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులతో జిల్లాకు నీళ్లు రావాలన్నారు. కాళేశ్వరం, దేవాదుల ద్వారా కొంత నీళ్లు రావాలని, అయినా కృష్ణా నీటిపైనే ఎక్కువగా జిల్లావాసులు ఆధారపడాల్సిన పరిస్థితి ఉందన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నల్లగొండ జిల్లాకు సాగు నీరందించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. ఇలాంటి సమస్యలపై ప్రభుత్వాలను అడిగేందుకు, నిలదీసేందుకే జాగృతి జనంబాట చేపట్టిందన్నారు.
కిష్టరాయినిపల్లె, నెల్లికల్ ప్రాంతాల్లో భూసేకరణ చేసి 17 ఏండ్లవుతున్నా నిర్వాసితులకు భూమి లేదు, ఉద్యోగం లేని పరిస్థితి ఉందన్నారు. సుంకిశాల లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్టర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్‌ను తిట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా అదే నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఎపిడ్యూరల్ మెడిసిన్‌ను ప్రభుత్వాస్పత్రిలో అందుబాటులో ఉంచాలని కోరారు. ”మంత్రి వెంకట్‌రెడ్డికి నాతో ఏం పంచాయితీ ఉంది? మా పిల్లల్ని(జాగృతి కార్యకర్తలు) ఎందుకు అరెస్టు చేయించావు? జాగృతితో పెట్టుకున్నోళ్లు ఎవరూ బాగుపడరు.. ఇప్పుడు నేను రాజకీయాలు చేయడానికి రాలేదు. రాజకీయాలు చేసినప్పుడు మీకు గట్టి పోటీదారులను పెడతాం” అని అన్నారు. జిల్లాలో 13 లక్షల 44 వేలమెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వేశారని, మిర్యాలగూడ రైస్‌మిల్లుల హబ్ కావడంతో సగం ధాన్యం వాళ్లే కొనే పరిస్థితి ఉందని అన్నారు. మిగిలినవి 6 లక్షల మెట్రిక్ టన్నులేనని, వాటిని ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఇస్మాయిల్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా నీళ్లు అందించడంలో అలసత్వం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



