నవతెలంగాణ వేములవాడ: దక్షిణ కాశీగా పేరొందిన, ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం తెల్లవారుజాము నుంచి దర్శనాలను అధికారులు నిలిపివేశారు. ఆలయంలో స్వామివారికి ప్రతిరోజు అర్చకులు నిర్వహించే కైంకర్యాలను యథావిధిగా కొనసాగిస్తున్నారు. విస్తరణ, అభివృద్ధి పనులను వేగవంతం చేసే క్రమంలో ఆలయం చుట్టూ ఇనుప రేకులతో రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు.
ఆలయ ప్రధాన గేటుతో పాటు ఇతర ప్రాంతాల వైపు గేట్లను మూసివేసి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దర్శనాలను నిలిపివేసిన నేపథ్యంలో ఆలయం ముందు ప్రచార రథం, ఎల్‌ఈడీ తెరను ఏర్పాటు చేసి స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. మరోవైపు శ్రీరాజరాజేశ్వర స్వామివారికి కోడె మొక్కులతో పాటు వివిధ ఆర్జిత సేవలను చెల్లించుకునేందుకు శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో ఇప్పటికే అన్నిరకాల ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బందోబస్తు తదితర ఏర్పాట్లను ఆలయ ఈవో రమాదేవి, అదనపు ఎస్పీ చంద్రయ్య నేతృత్వంలో పలువురు సీఐలు, ఆర్డీవో రాధాబాయి, తహశీల్దార్ విజయప్రకాశ్‌రావులు పర్యవేక్షించారు.



