ఈసారి 2025 అక్టోబర్ 2న దసరా వచ్చింది. అలాగే గాంధీజీ జయంతి కూడా వచ్చింది. అంటే రాముడికి – రఘుపతి రాఘవ రాజారామ్- అన్న గాంధీజీకి పోటీ పడిందా? రామాయణ కల్పితగాథలో రావణుణ్ణి చంపినవాడు రాముడైతే, చరిత్రలో గాంధీజీని చంపిన వాడు నాథూరాముడు. ఇందులో ఒకరు గాడ్, అయితే మరొకరు గాడ్ సే! నాథ్ అంటే మరాఠీలో ముక్కుపోగు. ముక్కు పోగురామ్ ఏమిటి? అంటే ఇక్కడ గాడ్సే బాల్యం గురించి కొద్దిగా చెప్పుకోవాలి. పూర్తి పేరు నాథూరాం వినాయక్ రావు గాడ్సే. ఇప్పుడాయన గురించి ఎందుకండీ? అని అంటారేమో! కానీ, తప్పదు – రేప్పొద్దున ఆయనను ఈ ప్రభుత్వం నేషనల్ హీరోగా ప్రకటించినా మనం ఆశ్చర్యపడకూడదు కదా?.. తెలుసుకోవాలి! నాథూరామ్ తండ్రి వినాయక్ వామన్‌రావు గాడ్సే, తపాలా శాఖ ఉద్యోగి. తల్లి లక్ష్మి (నీగోదావరి) వీరు మహారాష్ట్ర చిత్‌పవన్ బ్రాహ్మణులు. నాథూరామ్‌కు చిన్నప్పుడు పెట్టిన పేరు రామచంద్ర.
ఇతని కంటే ముందుపుట్టిన ముగ్గురు అబ్బాయిలు వెంట వెంట చనిపోవడం వల్ల, ఈయనకు దేవుని పేరు ”రామచంద్ర”- అని పెట్టారు. ఇతను కూడా చనిపోతాడేమో అన్న భయంవల్ల, చెవులూముక్కూ కుట్టించి, పోగులు పెట్టి, ఆడపిల్లల బట్టలు వేసి, ఆడ పిల్లలా పెంచారు. ఆ రకంగా సాథ్ అంటే ముక్కుపోగు ఉన్న రామ్‌గా పేరు స్థిరపడి, నాథూరామ్ అయ్యాడు. తర్వాత కొంతకాలానికి ఇతనికి తమ్ముడు పుట్టడం వల్ల, తల్లిదండ్రులకు భయం తగ్గి, ఆడపిల్ల వేషం తీసి మగపిల్లాడిలా పెరగనిచ్చారు. చిన్నప్పుడు బారామతి పాఠశాలలో చదువుకున్న నాథూరామ్‌ను తరువాత అతని పిన్నమ్మ దగ్గరికి పూనా పంపించారు. అక్కడి ఇంగ్లీషు స్కూల్లో చదివించారు.
సరే, ఇక ప్రస్తుత విషయానికి వస్తే, గతంలో అమెరికాలో చదువుకోవాలనుకునే వారు, అక్కడ ఉద్యోగం చేయాలనుకునేవారు హెచ్1బి విసాకు ఆరు లక్షల రూపాయలు కట్టాల్సివచ్చేది. అదే ఇప్పటి బీజేపీ సర్కారు వచ్చాక ఇప్పుడు దానికి 88 లక్షలు (సుమారు రూ.కోటి) కట్టాల్సి వస్తోంది. మోడీ సర్కార్ ట్రంప్ దోస్తీ, రాజనీతి! విదేశాంగ విధానం ఎన్ని రెట్లు పెరిగిందో, ఎంత మెరుగైందో ఈ విష యంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇకపోతే, ఈ తప్పిదం నెహ్రూది కదా? అని మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నేతలు కరాఖండిగా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే దేశంలో ఐఐటీలు, ఐఐఎంలు ప్రారంభించి ఉన్నతవిద్యను ప్రోత్సహించిన పాపం ఆయనదే అని అంటున్నారు. ఇప్పుడు ఆ ఐఐటి, ఐఐయంలు పూర్తిచేసిన వారే వేలం వెర్రిగా అధిక సంఖ్యలో హెచ్1బి వీసాలకోసం ఎగబడుతున్నారట. అందువల్లనే కదా ట్రంప్ అంతంత కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాడూ? ఈ విషమ పరిస్థితికి అనాడు నెహ్రూ తీసుకున్న నిర్ణయాలే కారణం. లేకపోతే ఈ దేశంలోని యువతీ యువకులంతా మోడీ చెప్పినట్లు పకోడా చేసి అమ్ముకుంటూ హాయిగా ఇక్కడే బతికేవారు.
ఇదే మన దేశ నాయకులు బల్లలు పగలగొడుతూ చేస్తున్న వాదన! మీడియా సంస్థలన్నింటినీ కొనేసిన తర్వాత కూడా ఒక చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించే ధైర్యం లేనప్పుడు, ఛాతీ ఎన్ని ఈంచుల దైతేనేం? వేసుకునే సూటు ఎన్ని కోట్లదయితేనేం? 1947లో మన దేశంలో టెలివిజన్ ఉండి ఉంటే- మనం ఇప్పటి దాకా బానిసత్వంలోనే ఉండిపోయే వాళ్లం. ఎందుకంటే, అధికారంలో ఉన్న బ్రిటీషు వారే మీడియాను తమ ఆధీనంలో ఉంచుకునేవారు. బానిసత్వంలో బతుకుతూ ఉంటే ఎంత మజా వస్తుందోనన్నది – ఈ దేశ ప్రజలకు ప్రతిక్షణం బోధిస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో టి.వి. లేకపోవడం వల్ల, వారికి ఫొటోషూట్ చేసుకోవాలన్న యావ లేకపోవడం వల్ల బతికిపోయాం! మరి ఇప్పుడూ? పార్టీలు, ప్రజా సంఘాలు, సామాన్య పౌరులూ అందరూ కలిసి పోరాడాల్సిన సమయం వచ్చింది –
”నెహ్రూ ఓ ప్యూడల్- ఆయన వల్లే మనం ఎదగలేకపోయాం” అని అన్నది ఎవరో కాదు, చార్మినార్ నేనే కట్టించానని చెప్పుకునే వెన్నుపోటు వీరుడు. నలభైయేండ్ల ఇండస్ట్రీకి సిఈఓ చంబాబు! దేశంలోకి కంప్యూటర్ తెచ్చానని చెప్పుకునే ఈ ఘనాపాటికి, చరిత్ర బొత్త్తిగా తెలియదని తనకు తానై చెప్పుకున్నాడు.
చదువు అయిపోగానే ఓ కాలేజిలో లెక్చరర్ అవుదామని ఇంటర్యూకు వెళ్లాడు. ఇంటర్వ్యూలో సెలక్షన్ కమిటీ వాళ్లు ఈయన టాలెంట్ గ్రహించి, విద్యార్థుల అదృష్టవశాత్తూ ఈయనను సెలక్ట్ చేసుకోలేదు. అది మంచి నిర్ణయమే అయినా, సెలక్ట్ అయి ఉంటే – కొద్దిమందితో పోయేది. సెలెక్ట్ కానందుకే కదా కోట్లాది మంది తెలుగువారి ప్రాణం మీదికొచ్చింది? వల్లంపాటి వెంకట సుబ్బయ్య అని నాకో రచయిత మిత్రుడు ఉండేవాడు. ఆయన మదనపల్లె కాలేజిలో సీనియర్ లెక్చరర్‌గా ఉండేవాడు. ఆయన తరచూ ఈ విషయం చెపుతూ ఉండేవాడు. రెండెకరాల ఆసామి, వేల కోట్లకు ఎలా పడగెత్తాడో తెలుగు ప్రజలందరికీ తెలుసు! మరీ- ఇటీవల ఏంచేశాడూ? మతగజ్జితో కుళ్లిపోయినవాణ్ణి వెళ్లి కౌగిలించుకున్నాడు. అంతకన్నా ఎవరు మాత్రం ఏం దిగజారగలరు? నిజమే – నెహ్రూ ధనవంతుల బిడ్డ.
ఆయన ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకుంటున్నప్పుడు ఏ గేటు దగ్గరికి వెళితే కారు ఆగేటు దగ్గరికి వచ్చేది. అయితే, తన ఆస్తిపాస్తులు, జీవితం మొత్తానికి మొత్తంగా దేశానికి అర్పించిన త్యాగధనుడి గురించి సొళ్లు కార్చుకోకుండా ఉంటే గౌరవం ఇంతో అంతో మిగిలి ఉండేది. మోడీ నెహ్రూను విమర్శిస్తున్నారు కదా ! నేనేం తక్కువ తిన్నానా? నేనూ విమర్శిస్తాను అంటే అభాసుపాలు కాక తప్పదు. అజ్ఞానం బయటపడకా తప్పదు. ఒక రచయిత చెప్పినట్లు – మూర్కుల్ని ఎవరూ పనిగట్టుకుని పరిచయం చేయనక్కరలేదు. వాళ్లకు వాళ్లే తమను పరిచయం చేసుకుంటారు. ఇప్పుడు చంబాబు ఆపని చేశాడన్న మాట! మోడీని తట్టిన నోటితోనే ఆయనను పొగడుతూ, ఆయన ఇంటి ముందు పడిగాపులు పడి, ఆయన చంకలో చేరి మద్దతు తెలిపినప్పుడే అంతా అయిపోయింది. దిగడానికి ఇంకా చివరి మెట్టంటూ ఇద్దరికీ లేదు.
గత ప్రభుత్వాలు బంగారం విలువను అతికష్టమ్మీద 24 వేలు చేయగలిగాయి. ఇప్పుడు చూడండి ఈ పదకొండేండ్లలో బీజేపీ ప్రభుత్వం దాని విలువ లక్షా పదిహేను వేలు చేయగలిగింది. ఇంత చురుకైన ప్రభుత్వం ఉన్నందుకు దేశప్రజలు గర్వపడాలి. ఏదో ఇప్పుడు మొన్నటి నుండి జీఎస్టీ ‘బచత్ ఉత్సవం’ చేస్తున్నారు గానీ, పదకొండేండ్లుగా ‘జీఎస్టీ దోపిడీ’ ఉత్సవం బ్రహ్మండంగా చేస్తూ వచ్చారు కదా? దేశ ప్రజలు అభినందించాల్సింది పోయి నిష్టూరాలాడతారెందుకూ? కాంగ్రెస్ ప్రభుత్వంలో రూపాయి విలువ పడిపోతూ ఉంటే, దేశంలో ప్రధాని విలువ పడిపోతూ ఉండేది. ఇప్పుడు చూడండి ఈ బీజేపీ ప్రభుత్వంలో రూపాయి విలువ ఎంత దిగజారినా ప్రధాని విలువ ఏమాత్రం దిగజారడం లేదు! ”అయినా అక్కడ విలువ అనేది ఉంటే కదా – పడిపోవడానికీ, దిగజారడానికి?” అని కొందరంటున్నారు. ”హమ్మయ్య బతికి పోయ్యామండీ! ఆయన డిగ్రీ నకిలీదని తేలిపోయింది. ఇంకానయం అదే గనక నిజమైందేనని తేలితే- మనకు మన విద్యావ్యవస్థ మీదనే నమ్మకం లేకుండా పోయేది కదా?” అని మరికొందరు వాపోతున్నారు.
ఇనుము, ఉక్కు పనిచేస్తే అది ‘టాటా’ అయిపోతుంది. చెప్పులు తయారు చేస్తే అది ‘బాటా’ అయిపోతుంది. మరి చారు అమ్ముతూ అమ్ముతూ ఒకాయన ఎలాగో తెలియదు, అంధభక్తులందరికీ ‘పాపా’ అయిపోయాడు. ఎనమిదో తరగతి చదివితేనే ఉద్యోగం దొరికే రోజుల్లో ఈ దేశంలో ఒక 8వ (ఎయిత్ వండర్) ఆద్భుతం జరిగింది. ఒకాయన డిగ్రీ తీసుకుని రైల్యే స్టషన్‌లో చారు అమ్మాడు. ఆయన చెప్పినచోట రైల్వేస్టేషనే అప్పటికి కట్టలేదు. అదొక వింత. దేశంలో ఈ మెయిల్‌లేని రోజుల్లోనే ఆ మేధావి ఈ మెయిల్స్ పంపాడు. ఒక కుర్రవాడు లేచి ”మన తొలి ప్రధాని సార్!” అన్నాడు. ”ఆయన ఏం చేశాడూ?” అని టీచర్ మళ్లీ ప్రశ్నించాడు. మరో పిల్లవాడు చటుక్కున లేచి చెప్పాడు. ”ఆయన మన పదహారో ప్రధానిని పని చేయనివ్వడం లేదు. ఈయన చేయాలనుకున్న దేశ వికాసాన్ని ప్రతిచోటా ప్రతి సారి అడ్డుకుంటున్నాడు” టీచర్ కండ్లు తిరిగి, క్లాసురూంలోనే పడిపోయాడు.
పిల్లల మెదడ్లో ఇంత విషం నింపుతున్నది ఎవరన్నది ఆయనక్కూడా అర్థం కాలేదు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఆయన బతికి ఉన్న రోజుల్లోనే ప్రపంచ నాయకుడిగా, దార్శనికుడిగా, మేధావిగా పేరు గడించాడు. ఆయన స్థాయికి చేరుకోగలగటం ప్రపంచంలో ఏ కొద్దిమందికో సాధ్యమైంది. ఉదాహరణకు ఒకే ఒక్క విషయం చాలు. నెహ్రూజీ కన్నుమూసినప్పుడు ప్రపంచంలోని 169 దేశాల్లో తమతమ జాతీయ పతాకాలు అవనతం చేసి, ఆ మహనీయుడికి శ్రద్ధాభక్తులతో ఘనంగా నివాళులు అర్పించారు. అలాంటి గౌరవం మన దేశ నాయకులకు మరెవ్వరికీ లభించలేదు సరికదా ఇతర ప్రపంచ నాయకులక్కూడా చాలా తక్కువ మందికి లభించింది. అయినా ఒక విషయం ఆలోచిద్దాం. సూది నుంచి పరమాణు దాకా తయారు చేయించిన పార్టీ దేశద్రోహులదని అంటున్నారు. అదే మళ్లీ రైల్వేస్టేషన్లు మొదలుకుని, రైతుల గోదాంల దాకా అమ్ముకునే పార్టీ దేశ భక్తులదట?
ధర్మం పేరు చెప్పి పిల్లలకు కత్తులిచ్చి పంపేవాణ్ణి కాదు. జ్ఞానం పేరు చెప్పి పిల్లలకు పుస్తకాలు, పెన్నులూ ఇచ్చేవాణ్ణి ఎన్నుకుందామని ఈ దేశ పౌరులు అనుకోవాలి! ఇప్పుడు దేశంలో జరుగుతున్నదేమిటీ? మొదట సీత పేరు చెప్పి ఓట్లు అడుగుతారు. ఎన్నికైన తర్వాత ప్రతి పనీ నీత భర్త కోసం చేస్తుంటారు. సీత భర్త రాముడని అందరికీ తెలుసు. అలాగే నీత భర్త ఎవరో కూడా ఈ దేశంలో అందరికీ తెలిసిపోయింది. పైగా ఆయన పేరు మీడియాలో ఎక్కడా వాడకూడదని ప్రభుత్వంవారు స్వతంత్ర జర్నలిస్ట్‌లందరికీ ఫర్మాన్ జారీ చేసింది. ఆయన పేరు ఇంగ్లీషు అక్షరం Aతో ప్రారంభమై I తో ముగుస్తుందట! AI అంటే కొంపదీసి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ – అనుకుంటే.. తప్పులో కాలేసినట్టే- అదానీ/ అదానీ గ్రూప్ అంటూ వ్యాపార ప్రకటనలు టెలివిజన్ తెరల మీద కదలాడుతూనే ఉన్నాయి కదా? ఆ డబ్బా అలా మోగుతూనే ఉండాలా? విమర్శించే జర్నలిస్టుల మీద ఆంక్షలు పెడతారా? బీజేపీ వారి సమస్య కాంగ్రెస్ కాదు, దేశపౌరుల్లో పెరుగుతున్న చైతన్యం! అసలైతే వారికి బలహీనులు, నిరక్షరాస్యులు, అమాయకులు, నిరుపేదలు, నగంగా తిరిగే బాసిన మనస్కులు, అంధ భక్తులూ తమ చుట్టూ చేరే భజనపరులు కావాలి! ప్రశ్నలతో పిడికిళ్లు బిగించేవారిని వారు భరించలేరు.
వ్యాసకర్త: కవిరాజు త్రిపురనేని రామస్వామి జాతీయ పురస్కార తొలిగ్రహీత.
డాక్టర్ దేవరాజు మహారాజు



