నలభై రెండు రోజుల రికార్డు షట్‌డౌన్ (కేంద్ర ప్రభుత్వ మూత) పరిష్కారం తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బూతు పర్వంలో ప్రవేశించాడు. 2019లో జైల్లో మరణించిన ఘరానా తార్పుడుగాడు జెఫ్రీ ఎప్‌స్టెయిన్ ఫైల్స్ బయటకు వచ్చే పరిణామం బుధవారం నాడు చోటు చేసుకుంది. ప్రతిపక్ష డెమోక్రాట్లు,అధికార రిపబ్లికన్లు ఎప్‌స్టెయిన్‌కు సంబంధించిన కొన్నివేల పేజీల సమాచారాన్ని బయట పెట్టారు. అయితే ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని బయటకు తీయాలంటే ప్రజాప్రతినిధుల సభలో 218 మంది సభ్యులు ప్రతిపాదనకు మద్దతు తెలపాల్సి ఉంది. బుధవారం నాడు నాటకీయ పరిణామాల మధ్య అది కూడా నెరవేరటంతో అమెరికన్ కాంగ్రెస్ స్పీకర్ ప్రభుత్వం ఉన్న ఫైళ్ల విడుదలకు సంబంధించిన ఓటింగ్ అంశాన్ని వచ్చే వారం లోనే చర్చకు తీసుకుంటానని ప్రకటించాల్సి వచ్చింది. డిసెంబరులో చేపడతారని వార్తలు వచ్చిన్నప్పటికీ సమస్య తీవ్రత కారణంగా వెంటనే ఉపక్రమించవలసి వచ్చింది. ఈ పరిణామాన్ని ట్రంప్ తేలికగా కొట్టిపారేశాడు.
ఒక సామాన్య టీచరుగా జీవితాన్ని ప్రారంభించిన ఎప్‌స్టెయిన్ 1976లో బర్తరఫ్ అయిన తరువాత అనేక ఉద్యోగాలు చేశాడు. ఈ క్రమంలో వచ్చిన పరిచయాలతో ఒక బ్యాంకర్‌గా ఎదగటమేగాక సమాజంలోని ధనవంతులు, ఉన్నతాధికారులకు కౌమార ప్రాయంలో ఉన్న బాలికలను ఎరగా వేసి డబ్బు సంపాదించి పలుకుబడి కలిగిన ఘరానా పెద్దమనిషిగా చెలామణి అయ్యాడు. అనేక మంది బాలికలను ప్రలోభ పెట్టి పెద్దవారికి తార్చినప్పటికీ ఒక కేసులో అరెస్టయినా తప్పించుకుని విడుదలయ్యాడు. 2019లో అరెస్టయిన నెల రోజుల్లోనే జైల్లో ఉరివేసుకొన్న గాయాలతో మరణించినట్లు ప్రకటించగా అతని లాయర్లు అనుమానాలు వ్యక్తం చేశారు. జూలై ఆరున అరెస్టు కాగా 29వతేదీన ఉరివేసుకొని అపస్మారక స్థితిలో ఉన్నట్లుగా చెప్పగా ఆగస్టు పదవ తేదీన మరణించినట్లు తేల్చారు. డోనాల్డ్ ట్రంప్ కూడా అతగాడి ఖాతాదార్లలో ఒకడనే ప్రచారం ఉంది. అందుకే అతన్ని మట్టుపెట్టించి ఉరి అని ప్రచారం చేశారనే ఆరోపణలు వచ్చాయి. అతనికి సంబంధించిన ఫైళ్లను బయట పెట్టాలని, విచారణ జరపాలనే డిమాండ్ తలెత్తింది.గతంలోనూ, ఇప్పుడూ డోనాల్డ్ ట్రంప్ వాటిని తొక్కిపెట్టాలని చూసి నట్లు దుమారం రేగింది, ఆగస్టు నెలలో అతని ఈ మెయిళ్లు ఉన్న కంప్యూటర్‌ను ఎఫ్‌బిఐ స్వాధీనం చేసుకుంది.
మొత్తం ఫైళ్లు బయటపెట్టాలంటే ప్రతిపాదనకు అవసరమైన సంఖ్య 2018 కాగా డెమోక్రాట్లు 213 మంది, రిపబ్లికన్లు నలుగురు సంతకాలు చేశారు. ఇంకా ఒకరు తక్కువ. సెప్టెంబరులో జరిగిన ఉప ఎన్నికలో అరిజోనా నుంచి డెమోక్రాట్ ఎన్నికైనప్పటికీ ఆమె ప్రమాణ స్వీకారం చేయలేదనే సాకుతో స్పీకర్ అడ్డుకున్నాడు. అప్పటి నుంచి సభ సమా వేశం కాలేదని సాకు చెప్పినా బుధవారం నాడు షట్‌డౌన్ ఎత్తివేతకు సమావేశం జరగటం కొత్త సభ్యురాలు ప్రమాణ స్వీకారం వెంటనే తీర్మానానికి అవసరమైన సంఖ్య చేరటంతో స్పీకర్‌కు మరొక అవకాశం లేకపోయింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ తీర్మానం చేసినప్పటికీ అది సెనెట్ ఆమోదం, తరువాత ట్రంప్ ముద్రపడాల్సి ఉంది. అందువలన ఏం జరుగుతుందన్నది ఇప్పుడే చెప్పలేకపోయినా ఒత్తిడి మరింత పెరగటం ఖాయం. వెల్లడైన ఈమెయిల్స్‌లో అనేక మందికి సంబంధించిన సమాచారం ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు ప్రకటించాయి. అంతకు ముందు విచారణ పూర్తికాకుండా ఫైళ్ల విడుదల కుదరదని అమెరికా న్యాయశాఖ, ఎఫ్‌బిఐ కూడా చెప్పాయి. అందువలన ఆ ప్రక్రియ ఎప్పుడు ముగుస్తుందన్నది కూడా అనుమానమే.
ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమౌతున్న డోనాల్డ్ ట్రంప్‌కు ఈ బూతు పురాణ కేసు మాయని మచ్చ. గతంలో ఒక రంకుకేసు నుంచి బయటపడేందుకు సదరు యువతికి ట్రంప్ డబ్బు చెల్లించిన సంగతి తెలిసిందే. ఎప్‌స్టెయిన్ ఫైల్స్ వ్యవహారం అమెరికా సమాజంలో ఉన్నత స్థానాలలో ఉన్నవారి విశృంఖలతకు నిదర్శనం. బాలికలను వినియోగించుకోవటంలో రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలకు చెందిన ఉన్నత నేతలు అనేకమంది ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ శృంగార లీలలను రచనలకు, సినిమాలకు కథావస్తువులుగా మలుచుకొని వాటి ద్వారా కూడా డబ్బు సంపాదించుకొని చూసేవారికి కొదవ ఉండదని వేరే చెప్పనవసరం లేదు. ట్రంప్ మీద అనేక విమర్శలు ఉన్నప్పటికీ ఓటర్లు వాటిని పట్టించుకోకుండా రెండవసారి గతేడాది ఎన్నికల్లో గెలిపించారంటే ఇవన్నీ సర్వసాధారణమే అనే భావంతో ఉన్నారని అనుకోవాలా? అలాగని నిర్ధారించలేం గానీ వచ్చే ఏడాది జరిగే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఇతర అంశాలతో పాటు ఇది కూడా గండికొట్టి పార్లమెంటు ఉభయ సభల్లో అధికార పార్టీ మైనారిటీలో పడిపోనుందా?
మూత నుంచి బూతు పర్వంలోకి ట్రంప్!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



