Friday, November 14, 2025
E-PAPER
Homeఆటలుఈడెన్‌లో సఫారీ సవాల్‌

ఈడెన్‌లో సఫారీ సవాల్‌

- Advertisement -

దక్షిణాఫ్రికా, భారత్‌ తొలి టెస్టు నేటి నుంచి
వరుస ఓటములతో ఒత్తిడిలో సఫారీలు
సొంతగడ్డపై ఫేవరేట్‌గా టీమ్‌ ఇండియా
ఉదయం 9.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌ దక్షిణాఫ్రికా.. భారత్‌లో కఠిన పరీక్షకు సిద్ధమైంది. గత ఏడు టెస్టుల్లో ఒక్క విజయం చవిచూడని సఫారీలు తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తున్నారు. కుర్రాళ్ల రాకతో ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న భారత్‌పై ఓ విజయం సాధించాలనే తపన బవుమా బృందంలో ఉంది.

స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో అనూహ్య ఓటమి చవిచూసిన భారత్‌.. ఇటీవల వెస్టిండీస్‌పై క్లీన్‌స్వీప్‌తో సిరీస్‌ సాధించినా… స్పిన్‌ పిచ్‌లపై మన బలహీనతలు ప్రత్యర్థులు పసిగట్టారు. ఇంగ్లాండ్‌ పర్యటనలో గిల్‌సేన మెరిసినా.. సొంతగడ్డపై బలమైన ప్రత్యర్థిపై సత్తా చాటాల్సి ఉంది.

ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ రేసు ఆసక్తికరంగా మారుతున్న వేళ భారత్‌, దక్షిణాఫ్రికా రెండు టెస్టుల సిరీస్‌కు సై అంటున్నాయి. ఆతిథ్య భారత్‌ క్లీన్‌స్వీప్‌పై కన్నేసి బరిలోకి దిగుతుండగా.. భారత్‌లో వైవిధ్య పరిస్థితులకు అనుగుణంగా రాణించేందుకు సఫారీ ఆపసోపాలు పడుతోంది. భారత్‌, దక్షిణాఫ్రికా తొలి టెస్టు నేటి నుంచి ఆరంభం.

నవతెలంగాణ-కోల్‌కతా
భారత్‌, దక్షిణాఫ్రికా ఫ్రీడమ్‌ టెస్టు సిరీస్‌ నేటి నుంచి ఆరంభం కానుంది. కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో నేటి నుంచి తొలి టెస్టు షురూ కానుంది. స్వదేశంలో సహజంగా స్పిన్‌ పిచ్‌లతో పర్యాటక జట్లను ఇబ్బందిపెట్టే టీమ్‌ ఇండియా.. సఫారీతో సవాల్‌కు భిన్నంగా సన్నద్ధమవుతోంది. పేస్‌, స్పిన్‌ కాకుండా.. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై ఈడెన్‌గార్డెన్స్‌లో సవారీ చేయనుంది. భారత కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌కు, సఫారీ కెప్టెన్‌ తెంబ బవుమాకు ఈడెన్‌గార్డెన్స్‌ టెస్టు కఠిన పరీక్ష కానుంది. భారత్‌, దక్షిణాఫ్రికా తొలి టెస్టు నేడు ఉదయం 9.30 గంటలకు ఆరంభం కానుంది. 9 గంటలకు టాస్‌ వేయనున్నారు.

బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా!
తుది జట్టు కూర్పుపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ముందుగానే స్పష్టమైన ఆలోచనతో ఉంది. ఈడెన్‌గార్డెన్స్‌లో బ్యాటింగ్‌ పిచ్‌ సిద్ధమవుతుండగా.. భారత్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను బలోపేతం చేసింది. పేస్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డిని జట్టు నుంచి తప్పించి.. భారత్‌-ఏ వన్డే సిరీస్‌కు పంపించింది. భారత్‌-ఏ రెడ్‌బాల్‌ సిరీస్‌లో వరుస శతకాలతో చెలరేగిన వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌ను తుది జట్టులోకి తీసుకోనుంది. దీంతో భారత్‌కు లోతైన, బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉండనుంది. వైస్‌ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ నం.5, కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ నం.4లో బ్యాటింగ్‌ చేయనుండగా.. ధ్రువ్‌ జురెల్‌ నం.6 పొజిషన్‌లో బ్యాట్‌ పట్టనున్నాడు. టాప్‌ ఆర్డర్‌లో యశస్వి జైస్వాల్‌, కెఎల్‌ రాహుల్‌, బి సాయి సుదర్శన్‌ ఉన్నారు. స్పిన్‌ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌లతో భారత్‌ ఎనిమిదో స్థానం వరకు బ్యాటర్లను కలిగి ఉంది. పేసర్లు జశ్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌లతో కలిసి కుల్‌దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌ బాధ్యతలు పంచుకోనున్నాడు.

శుభ్‌మన్‌ గిల్‌ మూడు ఫార్మాట్లలో ఆడుతుండగా.. అతడికి విశ్రాంతి లభించటం లేదు. యుఏఈలో ఆసియా కప్‌, స్వదేశంలో వెస్టిండీస్‌ సిరీస్‌, ఆస్ట్రేలియాలో వన్డేలు, టీ20 సిరీస్‌.. తాజాగా స్వదేశంలో సఫారీ సవాల్‌. మూడు ఫార్మాట్లలో ఆడుతున్న శుభ్‌మన్‌ గిల్‌ ఆసీస్‌ పర్యటనలో అంచనాలను అందుకోలేదు. ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో మెరిసినా.. ఆ జోరు ఆసీస్‌ పర్యటనలో కనిపించలేదు. టెస్టుల్లో గిల్‌కు మంచి రికార్డుంది. దక్షిణాఫ్రికాతో టెస్టుల్లోనూ అదే జోరు కొనసాగిస్తాడా? లేదంటే.. విరామ లేని క్రికెట్‌ గిల్‌ ప్రదర్శనపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందా? చూడాలి. టాప్‌-3లో యశస్వి జైస్వాల్‌ నిలకడగా దంచికొడుతుండగా.. కెఎల్‌ రాహుల్‌, బి సాయి సుదర్శన్‌లపై అనుమానాలు ఉన్నాయి. రాహుల్‌ ప్రతి సిరీస్‌లోనూ మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచటంలో విఫలం అవుతున్నాడు. సాయి సుదర్శన్‌ నం.3 బ్యాటర్‌గా జట్టులో తన స్థానానికి న్యాయం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.

బవుమాకు పరీక్ష
దక్షిణాఫ్రికా ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌. కానీ గత ఏడు టెస్టుల్లో ఆ జట్టు ఆరు పరాజయాలు చవిచూసింది. వర్షంతో మరో మ్యాచ్‌లో ఓటమి నుంచి తప్పించుకుంది. భారత్‌లోనూ ఆ జట్టుకు చెప్పుకోదగిన గణాంకాలు లేవు. సఫారీ శిబిరంలో కొత్త ఆటగాళ్లకు భారత పిచ్‌లపై టెస్టులు ఆడిన అనుభవం లేదు. పేసర్‌ కగిసో రబాడ, స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌, కెప్టెన్‌ తెంబ బవుమా ఆ జట్టుకు బంతితో, బ్యాట్‌తో కీలక ఆటగాళ్లు. రియాన్‌ రికెల్టన్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, టోనీ, ముతుసామి, సిమోన్‌లు ఈ పర్యటనలో సత్తా చాటాలని ఎదురుచూస్తున్నారు. కేశవ్‌ మహరాజ్‌కు 60 టెస్టుల అనుభవం ఉంది.

లెఫ్టార్మ్‌ స్పిన్నర్లలో రవీంద్ర జడేజా తర్వాత అత్యధిక టెస్టులు ఆడిన ఘనత కేశవ్‌దే. స్పిన్‌ను ఆడటంలో ఇబ్బంది పడుతున్న భారత బ్యాటర్లను కేశవ్‌ మహరాజ్‌ టార్గెట్‌ చేసుకోనున్నాడు. దక్షిణాఫ్రికాకు బ్యాటింగ్‌ పిచ్‌పై కుప్పకూలిన చెత్త గణాంకాలు ఉన్నాయి. అందుకే భారత్‌ ఈడెన్‌గార్డెన్స్‌లో స్పిన్‌, పేస్‌ వద్దనుకుంది. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై సఫారీలు భారీ తేడాతో పరాజయం చవిచూడగా..ఆ టెస్టుల్లో ఆతిథ్య జట్టు స్పిన్నర్ల సగటు 27.18 కాగా, పేసర్ల సగటు 17.50. దీంతో భారత్‌ ఈడెన్‌గార్డెన్స్‌లో సఫారీలకు బ్యాటింగ్‌ పిచ్‌తో ఉచ్చు వేస్తోంది. మరి,ఈ వ్యూహం ఫలిస్తుందో లేదో వేచి చూడాలి.

పిచ్‌, వాతావరణం
ఈడెన్‌గార్డెన్స్‌ పిచ్‌ సహజశైలిలో ఉండే అవకాశం లేదు. పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉండవద్దనే సంకేతాలు క్యూరేటర్‌కు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కాస్త పచ్చిక కనిపిస్తున్నా.. మరీ జీవం లేని పిచ్‌ కాదు. ఇటు స్పిన్‌కు, అటు పేస్‌కు అనుకూలించే సూచనలు లేకపోయినా.. రివర్స్‌ స్వింగ్‌కు అనుకూలత ఉండనుంది. కోల్‌కతా టెస్టులో పరుగుల వరద పారేందుకు అవకాశం మెండు. పిచ్‌ స్వభావంపై తర్జనభర్జనతో టాస్‌ నెగ్గిన జట్టు తొలుత ఏం ఎంచుకుంటుందో చూడాలి.

తుది జట్లు (అంచనా) :
భారత్‌ : యశస్వి జైస్వాల్‌, కెఎల్‌ రాహుల్‌, బి సాయి సుదర్శన్‌, శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), ధ్రువ్‌ జురెల్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌.
దక్షిణాఫ్రికా : ఎడెన్‌ మార్‌క్రామ్‌, రియాన్‌ రికెల్టన్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, టోనీ, తెంబ బవుమా (కెప్టెన్‌), కైల్‌ వెరెనె (వికెట్‌ కీపర్‌), సెనురన్‌ ముతుసామి, సిమోన్‌ హార్మర్‌, మార్కో జాన్సెన్‌, కేశవ్‌ మహరాజ్‌, కగిసో రబాడ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -