Friday, November 14, 2025
E-PAPER
Homeజాతీయంఅమెరికాలో ముగిసిన షట్‌డౌన్‌

అమెరికాలో ముగిసిన షట్‌డౌన్‌

- Advertisement -

ప్రభుత్వ ఫండింగ్‌ బిల్లుపై ట్రంప్‌ సంతకం
ఆ బిల్లుకు కాంగ్రెస్‌ ఆమోదం
యూఎస్‌లో కీలక పరిణామం

న్యూఢిల్లీ : అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్‌ ఎట్టకేలకు ముగిసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌.. బుధవారం ప్రభుత్వ ఫండింగ్‌ బిల్లుపై సంతకం చేశారు. దీంతో అమెరికా చరిత్రలోనే 43 రోజుల పాటు కొనసాగిన అత్యంత సుదీర్ఘమైన ఈ షట్‌డౌన్‌ అధికారికంగా ముగిసినట్టయ్యింది. ఈ షట్‌డౌన్‌ కారణంగా వేలాది మంది ఫెడరల్‌ ఉద్యోగులు వేతనం లేక ఇబ్బందులు ఎదుర్కొ న్నారు. అనేక విమానాలు ఆలస్యమయ్యాయి. కొన్ని రద్దు కూడా అయ్యాయి. ఫుడ్‌ బ్యాంకుల ముందు పొడవైన క్యూలు కనిపించాయి. ఇప్పుడు షట్‌డౌన్‌ ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఓవల్‌ ఆఫీస్‌లో సంతకం చేసే ముందు ట్రంప్‌ మాట్లాడారు. ”ఈ రోజు మేము స్పష్టమైన సందేశాన్ని పంపిస్తున్నాం. మేము ఎప్పుడూ దోపిడీకి తలవంచం” అని అన్నారు.

కాంగ్రెస్‌ ఆమోదం తర్వాత బిల్లుపై సంతకం
అంతకముందు అమెరికా ప్రతినిధుల సభ షట్‌డౌన్‌ ఎత్తివేతకు సంబంధించిన బిల్లును ఆమోదించింది. రిపబ్లికన్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ సభలో 222-209 తేడాతో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. ఆ తర్వాత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సంతకం కోసం బిల్లును పంపారు. కాంగ్రెస్‌ ఆమోదించిన రెండు గంటల తర్వాత ఓవల్‌ ఆఫీస్‌లో ట్రంప్‌ సంతకం చేసే కార్యక్రమం జరిగింది. ట్రంప్‌ సంతకంతో ఫెడరల్‌ ఉద్యోగులు గురువారం(అమెరికా కాలమానం ప్రకారం) నుంచే తిరిగి తమ పనిలో చేరే అవకాశం ఉంది. ఈ బిల్లును ఇప్పటికే సెనెట్‌ ఆమోదించిన విషయం విదితమే.

తీవ్ర ప్రభావాన్ని చూపిన షట్‌డౌన్‌
అమెరికా దేశ చరిత్రలో ఈ షట్‌డౌన్‌ నిలిచిపోనున్నది. ఈ ఏడాది అక్టోబర్‌ 1 నుంచి అమెరికాలోని ఆర్థిక వృద్ధి, ఫెడరల్‌ సేవలు, ప్రజల జీవనంపై ఈ షట్‌డౌన్‌ తీవ్ర ప్రభావాన్నే చూపింది.
సుమారు 14 లక్షల మంది ఫెడరల్‌ ఉద్యోగులకు జీతాలు ఆలస్యమయ్యాయి. సప్లిమెంటల్‌ న్యూట్రిషన్‌ అసిస్టెన్స్‌ ప్రోగ్రామ్‌ (ఎస్‌ఎన్‌ఏపీ) వంటి ఆహార సహాయ పథకాలు 4.2 కోట్ల మంది అమెరికన్లకు ఆటంకాన్ని కలిగించాయి. కొన్ని అధికారిక అంచనాల ప్రకారం ఈ షట్‌డౌన్‌ ఆర్థిక వృద్ధిని రెండు శాతం తగ్గించింది. మూడు బిలియన్‌ డాలర్ల నష్టాన్ని కలిగించిం దని అంచనా. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వంటి కీలక సర్వీసులు నిలిచిపో వడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. వ్యాపారాలకు అంతరాయం ఏర్పడింది. ఇది అక్కడి ప్రజలలో తీవ్ర అసంతృప్తిని కలిగించింది.

బిల్లులో ఏముంది?
ట్రంప్‌ సంతకం చేసిన బిల్లు జనవరి 30 వరకు నిధులను పొడిగిస్తుంది. దీంతో ప్రభుత్వం ప్రతి ఏడాదీ సుమారు 1.8 ట్రిలియన్‌ డాలర్ల అప్పుభారాన్ని కొనసాగించనున్నది. అలాగే షట్‌డౌన్‌ సమయంలో తొలగించబడిన ఉద్యోగులను తిరిగి నియమించే నిబంధన ఈ బిల్లులో ఉన్నది. జనవరి వరకు కొత్త తొలగింపులు జరగ కుండా రక్షణ కల్పిస్తుంది. ఉద్యోగులందరికీ షట్‌డౌన్‌ ముగిసిన వెంటనే బకాయి వేతనాలు చెల్లించనున్నారు. ఇక వ్యవసాయ శాఖకు ఆమోదించిన నిధులతో.. కోట్లాది మంది అమెరికన్లు ఆధారపడే ఆహార సహాయ కార్యక్రమాలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగనున్నాయి. అలాగే విమాన ప్రయాణ సేవల పునరుద్ధరణకు అవకాశం ఏర్పడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -