నేడు బీహార్‌లో 243 నియోజకవర్గాలకు కౌంటింగ్
విస్తృత ఏర్పాట్లు చేశాం : ఈసీ
స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పని చేయని సీసీ కెమెరాలు
ససారాం కేంద్రానికి లారీలో వచ్చిన ట్రంక్ పెట్టెలు
అప్రమత్తంగా ఉండాలి : ఆర్జేడీ అగ్రనేత తేజస్వీయాదవ్
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్‌పోల్స్ సర్వే ఫలితాలు వచ్చినా.. ఎన్డీఏ, మహాగట్‌బంధన్‌లు గెలుపు తమదంటే.. తమదేనంటూ గొప్పలు చెప్పుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రెండు విడతల్లో జరిగిన ఎన్నికల ఫలితాలను లెక్కబెట్టేందుకు కౌంట్‌డౌన్ మొదలైంది. శుక్ర వారం బీహార్‌లోని 243 స్థానాలకు జరిగే కౌంటింగ్‌కు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశామని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) తెలిపింది. లెక్కింపు కేంద్రాలకు 243 మంది పరిశీలకులు, అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల సమక్షంలో 243 మంది రిటర్నింగ్ అధికారులు (ఆర్‌ఓలు) ఓట్ల లెక్కింపును నిర్వహిస్తారు.
ప్రతి టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో-అబ్జర్వర్‌తో కూడిన 4,372 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేసినట్టు పోల్ అథారిటీ తెలిపింది. అభ్యర్థులు నియమించిన 18 వేల మందికి పైగా కౌంటింగ్ ఏజెంట్లు కూడా లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తారని పేర్కొంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు మొదలవుతుంది. ఈసీ ఆదేశాల ప్రకారం.. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఉదయం 8.30 గంటలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు) లెక్కింపు ప్రారంభమవుతుంది.
కౌన్ బనేగా బీహార్ కా బాద్‌షా
బీహార్ అసెంబ్లీలోని 243 స్థానాలకు ఈసారి రెండు దశల్లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏకు 43 శాతం, మహాగట్‌బంధన్‌కు 41 శాతంగా ఓట్ షేరింగ్ ఉన్నది. స్వల్పంగా ఉన్న ఈ ఓట్ల శాతం ఎవరికి ప్లస్ అవుతుంది? ఎవరికి మైనస్ అవుతుంది.? అంతిమంగా బీహార్‌కా బాద్‌షా ఎవరు? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మధ్యాహ్నానికి వెలువడుతాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో విపక్ష మహాకూటమి అప్రమత్తమైంది. భారీ ఎత్తున ఆర్జేడీ శ్రేణుల్ని ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ల వద్దకు తేజస్వీ యాదవ్ పంపుతున్నారు.
బీహార్‌లో రెండో విడత ఎన్నికలు ముగిసిన అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ల్లో ఈవీఎంలను భద్రపరిచారు. అక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సమయంలో వీటిని తెరిచి ఈవీఎంలలో ఉన్న ఓట్లను లెక్కించాల్సి ఉంది. కానీ గురువారం పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. వీటిని ఎన్నికల అధికారులు లైవ్‌లో ఉంచారు. అయితే లైవ్ మధ్యలో ఆటంకాలు ఏర్పడి పలు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కెమెరాలు బ్లాంక్‌గా కనిపిస్తున్నాయి. అలాగే పలు చోట్ల అసలు సీసీ కెమెరాలు ఓపెన్ కావడం లేదనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. దీంతో బీహార్ ఎన్నికల ఓట్ల లెక్కింపు లోపు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.
స్ట్రాంగ్ రూమ్ వద్దకు అనుమానాస్పద ట్రక్..
ససారాంలోని ఈవీఎంలు భద్రపరిచిన ఓ స్ట్రాంగ్ రూమ్ వద్దకు ఓ అనుమానాస్పద ట్రక్ వచ్చింది. ఇందులో భారీ ఎత్తున ట్రంకు పెట్టెలు ఉన్నాయి. వీటిని దింపుతున్న దృశ్యాలు కనిపించాయి. అయితే ఈ వివరాలు అడిగితే ఇవ్వడం లేదంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆరోపించారు. అలాగే పలు చోట్ల సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదని ఆయన వీడియో తీసి మరీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అసలే బీహార్ ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయే విజయం తథ్యమని సర్వే సంస్థలు ముక్తకంఠంతో చెప్పేశాయి. దీన్ని నిజం చేసేందుకు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నట్టు తేజస్వీ ఆరోపించారు.



