– వారి ఆత్మగౌరవాన్ని అవమానించిన కాంగ్రెస్ సర్కారు : సోనియాగాంధీకి మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధుల లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణలో మహిళలపై అరాచకాలు, మోసాలతో పాటు వారి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అవమానకరంగా వ్యవహరిస్తున్నదని పలువురు మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు విమర్శించారు. ఈ మేరకు గురుచవారం మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. మహిళల ఆత్మగౌరవాన్ని అవమానించే విధంగా రాష్ట్ర మహిళలతో విదేశీ మహిళల కాళ్లు కడిగించారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలనీ, లేకపోతే మహిళలు కాంగ్రెస్ పార్టీపై తిరగబడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడిగి, తుడిచే పనులకు తెలంగాణ మహిళలను ఉపయోగించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని వారు మండిపడ్డారు. తెలంగాణ ఆడబిడ్డల స్వాభిమానాన్ని అందాల పోటీదారుల పాదాల చెంత ఉంచి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సంస్కతిని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చేసిన పని ఆయన బానిస మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు. రేవంత్ రెడ్డి పిచ్చి పనులను నియంత్రించాలని వారు డిమాండ్ చేశారు. కాళ్లు కడిగించడం రేవంత్ రెడ్డి వికృత వ్యక్తిత్వానికి, బానిస మనస్థత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. రజాకార్లు, దొరల దౌర్జన్యం, సమైక్యాంధ్రప్రదేశ్‌లో వివక్ష, అణచివేత ఏ రూపంలో ఉన్న ప్రతిఘటించిన చరిత్ర తెలంగాణ మహిళలకుందని గుర్తుచేశారు. అలాంటి మహిళలున్న తెలంగాణ ప్రతిష్ట రేవంత్ రెడ్డి ప్రతిష్టతో మసకబారుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. హామీల అమలు కోసం గళమెత్తిన ఆశావర్కర్లపై కాంగ్రెస్ సర్కారు చేసిన దుశ్శాసన పర్వం, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని అసెంబ్లీలో సీఎం అవమానించడం, బెటాలియన్ పోలీసుల భార్యలు సచివాలయం ముందు నిరసన తెలిపిన సమయంలో వారిపట్ల ప్రభుత్వం అత్యంత కిరాతకంగా వ్యవహరించడం, మహిళా జర్నలిస్టులను బట్టలూడదీసి కొడతామంటూ సీఎం రేవంత్ రెడ్డి బెదిరించడం కాంగ్రెస్ స్త్రీ వ్యతిరేక, నియంతృత్వ ధోరణలకు సాక్ష్యమని విమర్శించారు. సీఎం సొంత నియోజక వర్గంలోని లగచర్లలో దళిత, గిరిజన మహిళలపై పోలీసులు అర్థరాత్రి ఆకృత్యాలు చేశారని చెప్పారు. ఎన్నికలకు ముందు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల రూ.2,500, విద్యార్థినీలకు స్కూటీలు తదితర హామీలను అమలు చేయలేదని తెలిపారు. ఒకవైపు రాష్ట్రం దివాళా తీసిందంటూనే మరోవైపు అందాల పోటీల కోసం రూ.200 కోట్లు ఖర్చు చేస్తూ మహిళలను మోసం చేస్తున్నారని తెలిపారు. ఆ మొత్తాన్ని మహిళల సంక్షేమం, విద్య, ఉపాధి కోసం ఉపయోగిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఆవిర్భావం వేళ ఇది ఆత్మగౌరవానికి సంకేతంగా నిలవాలంటూ ఆశించిన సోనియాగాంధీ, మహిళల ఆత్మాభిమానంతో ఆటలాడుతున్న సీఎం రేవంత్ రెడ్డిని నియంత్రించరా? అని సోనియాగాంధీని ప్రశ్నించారు. సీఎం, కాంగ్రెస్ పార్టీ మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు, మోసాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES