నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
ఇందూరు పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలలో బాలుర, బాలికల , ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం బీహెచ్ఈఎల్ & బాలాజీ అమాయిన్స్ లిమిటెడ్ పాలిటెక్నిక్ కాలేజ్ పూర్వ విద్యార్థి అందే. ప్రతాప్ రెడ్డి ల ఇరువురి సహకారంతో రూ.6కోట్ల నిధులతో నిర్మించిన ఈ వసతిగృహా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ , అభివృద్ధి పథకాల సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి , నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ , ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి , జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణ రెడ్డి తదితరులు హాజరై, పాల్గొని వసతి గృహాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ విద్య అనేది పాఠశాల గోడలకే పరిమితం కాకుండా, సమాజ మార్పుకు బలమైన పునాది కావాలి.
ఈ రోజు ప్రారంభించిన వసతి గృహాలు కేవలం భవనాలు మాత్రమే కాదు వేలాది విద్యార్థుల భవిష్యత్తుకు వెలుగు నిచ్చే మార్గదర్శకాలు. గ్రామీణ నేపథ్యం గల విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలో నిలిపివేయకుండా, వారికి సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన వసతి ఏర్పాట్లు ఉపయోగ పడతాయి. పాలిటెక్నిక్ వంటి సాంకేతిక విద్య దేశ అభివృద్ధికి వెన్నెముకల వంటివని, ఇక్కడి నుండి బయటకు వెళ్లే ప్రతి విద్యార్థి నైపుణ్యంతో, సమాజానికి ఉపయోగపడే పౌరుడిగా ఎదగాలని ఆకాంక్షించారు. యువత తమ ప్రతిభను వినియోగించి రాష్ట్రాన్ని, దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఈ కళాశాల తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా ఆదర్శ విద్యాసంస్థగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కేశవ వేణు , గ్రంథాలయ చైర్మన్ అనంత రాజా రెడ్డి, ప్రిన్సిపాల్ పి. భారతి , నగోళ్ళ లక్ష్మినారాయణ , మాజీ కార్పొరేటర్ ప్రభాకర్ , మఠం పవన్ , విద్యార్థులు , పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.



