నవతెలంగాణ – భిక్కనూర్
బాల బాలికల సంరక్షణ, హక్కుల చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి నాగరాణి అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా మహిళా సాధికారిక కేంద్రం, సాధన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చిల్డ్రన్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు చట్టాలు, వాటి పని తీరుపై అవగాహన కల్పించారు. అనంతరం నాగరాణి మాట్లాడుతూ చిన్న పిల్లలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించాలని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఫోక్సో, బాల్యవివాహాలు, బాల కార్మిక చట్టాలపై అవగాహన కల్పించారు. చిన్నారులు ఎలాంటి ఇబ్బందులకు ఎదురైనా తల్లిదండ్రులకు లేదా బంధువులకు తెలియజేయాలన్నారు. విద్యార్థులు విద్యార్థి దశలో చదువుతోపాటు సమాజ సేవ దేశ ప్రగతికి కృషి చేయాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని ఎంఈఓ రాజ్ గంగారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాజా గంగారెడ్డి, ఆర్ ఐ బాలయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.



