Saturday, November 15, 2025
E-PAPER
Homeఎడిట్ పేజివంచనాశిల్పంతో ఆరెస్సెస్‌ మనుగడ

వంచనాశిల్పంతో ఆరెస్సెస్‌ మనుగడ

- Advertisement -

ఆరెస్సెస్‌ యోగ్యతల గురించి దేశంలో ఓ వివాదం, ఓ చర్చ చెలరేగుతున్నాయి. ఈ సంస్థ చట్టబద్దంగా నమోదు రిజిస్టర్‌ కాలేదన్న అంశం వెలుగులోకి రావడంతో ఈ వివాదం కేంద్ర స్థానంలోకి వచ్చింది. బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వాలలో వివిధ స్థాయిల్లో వున్న మంత్రులకు ఇలాంటి చర్చ చేయడమంటే దైవదూషణ కన్నా ఘోరమైన అపరాధమే. తామే ఎల్లప్పుడూ సరైన వారమనే ధోరణిలో వుండే పాలక పార్టీ ఇలాంటి ప్రశ్నలను ఏ మాత్రం సహించడమన్న ప్రసక్తి వుండదు. జర్మనీ, ఇటలీ ఫాసిస్టులతో బంధం పెనవేసుకున్న వ్యవస్థాగత స్వరూపం ఆరెస్సెస్‌ది. ఈ కారణంగా వారు అలా అసహనాన్ని, అహంభావాన్ని కనబరడం వారి సహజ లక్షణమే.

ప్రధాని మోడీ ఆగష్టు 15న ఎర్రకోట పైనుంచి చేసిన ప్రసంగంలో ఆరెస్సెస్‌ను, దాని గతాన్ని నిస్సంకోచంగా కీర్తనలతో ముంచెత్తారు. ఓ మాజీ ప్రచారక్‌ నుంచి ఈ విధమైన ప్రశంసల వాన కురవడం ఆశ్చర్యమేమీ కాదు. ఆ కోట బురుజుల మీద నుంచి మాట్లాడిన మోడీ ఆరెస్సెస్‌ను దేశ సేవలో నిమగమైన ఎన్‌జివోగా అభివర్ణిస్తూ చట్ట బద్దత కల్పించారు. చూడ్డానికి వింతగా అనిపించవచ్చు ఒక సంస్థగా తాను రాజ్యాంగ బద్దమైన, ప్రామాణిక చట్టబద్ద పద్ధతులలో పని చేయడం లేదన్నది ఆరెస్సెస్‌ స్వయంగా అంగీకరించిన విషయం. అయితే దాన్ని కొంత మంది వ్యక్తుల బృందంగా గుర్తించిన కారణంగా ఏ విధమైన రిజిస్ట్రేషన్‌ అవసరం లేదన్నట్టు ఇప్పుడీ చర్చతో ముందుకొచ్చింది.

ప్రశ్నలు సశేషం
అయితే అంతటితోనే రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన చర్చ మటుమాయమైపోదు. బీజేపీ నేతృత్వ ప్రభుత్వంలోని మంత్రులకు ఈ విషయమై చెప్పడానికి నోరు పడిపోవడంతో ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ‘సంఘ్‌ వందేళ్ల ప్రయాణం:నూతన అవకాశాలు-సవాళ్లు’ అనే విషయమై నవంవరు 9న ఆయన బెంగళూరులో మాట్లాడారు. ”సంఘ్‌ 1925లో స్థాపించబడిందని మీకు తెలుసా? మా సర్‌ సంఘ్‌ చాలక్‌ (కె.బి హెగ్డేవార్‌) ఆ సమయంలో ఏ బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగానైతే పోరాడుతున్నారో… దాని దగ్గర మేము రిజిస్టర్‌ చేయించుకోవాలని మీరు ఆశిస్తున్నారా? ఇక స్వాతంత్య్రానం తరమైతే భారతీయ చట్టాల ప్రకారం రిజిస్ట్రేషన్‌ తప్పనిసరేమీ కాదు. వ్యక్తుల బృందాలతో ఏర్పడిన సంస్థలకు కూడా చట్టబద్దత లభిస్తుంది. మేము వ్యక్తుల బృందంగానే గుర్తించబడ్డాము.” భగవత్‌ ముందుకు తెచ్చిన వాదనల ప్రధాన సారాంశం ఇది.

ఇక్కడ ముందుగా చెప్పాలంటే హెగ్డేవార్‌ కాంగ్రెస్‌తో సంబంధం కలిగివున్న మాట నిజమే. ఆ విధంగా ఆయన స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వామి కావడం కూడా ఎలాగూ జరిగిపోతుంది. అయితే వ్యక్తుల బృందంగా వున్న ఆరెస్సెస్‌ బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. సంస్థగా దాని స్థాపనకు మూల సూత్రం హిందూ రాష్ట్ర సాధన కోసం కృషి చేయడం. హిందువులను సంఘటితం చేయడం, హిందూత్వను సైనికీకరించడం దాని ప్రేరణ సిద్ధాంతం. సంఘ్‌కు అత్యున్నత సిద్ధాంతకర్త అయిన గోల్వాల్కర్‌ సాధికారికంగా చెప్పిందదే. కులం, జాతి, తెగ, మతం వంటి తేడాలతో నిమిత్తం లేకుండా సాంస్కృతిక, భాషా వైవిధ్యాలు పాటించకుండా ప్రజలందరూ బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా భారత స్వాతంత్య్ర పోరాటంలో కలసి పోరాడాలనే భావనకు కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ తన ప్రతికూలతను పునరుద్ఘాటిస్తూ వచ్చింది. అందువల్ల బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నందున తాము రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేదని చెప్పుకోవడం సత్యాన్ని పచ్చిగా తారుమారు చేయడమే అవుతుంది.

ఈ.డి దూకుడు ఏమైంది?
జాతీయంగా సాగే ఆర్థిక అక్రమాలను అరికట్టడం గురించీ, న్యాయమైన పన్ను వనరులను పక్కదోవ పట్టించడం గురించీ ఇటీవలనే బిజెపి నేతృత్వ ప్రభుత్వం మాట్లాడింది. ప్రత్యేకించి మోడీ ప్రభుత్వం మనీ లాండరింగ్‌ను నిరోధించే పి.ఎం.ఎల్‌.ఎ చట్టానికి బాగా పదును పెట్టి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు హద్దూ అదుపూలేని విస్తార అధికారాలు కల్పించింది. ఇసుమంత సాక్ష్యం లేకున్నా కేసులు నమోదు చేసేందుకు, వ్యక్తులను అరెస్టు చేసేందుకు అవకాశమిచ్చింది. ప్రతిపక్షాలపై పాక్షికతతో కూడిన దాడి చేసేందుకు ఈ నిబంధనలను ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే దానికి కావలసినన్ని కేసులు ఉదాహరణలుగా వున్నాయి. ఆ విధంగానే వారిని తమకు విధేయులుగా మార్చుకోవడమూ జరుగుతున్నది. ఈ విధమైన కక్ష సాధింపులకు పాల్పడుతున్నందుకు ఈ.డి ని న్యాయస్థానాలు బహిరంగంగా మందలించిన సందర్భాలు అనేకం వున్నాయి.

ఏమైనా ఆరెస్సెస్‌కు సుతిమెత్తని సత్కారమే లభిస్తున్నది. సంఫ్‌ుకు సమృద్ధిగా నిధులూ, స్థిరాస్తి వనరులూ వుండటం గురించి మోహన్‌ భగవత్‌ను ప్రశ్నించగా ఇవన్నీ తమ స్వయం సేవకులూ అధికారులూ స్వచ్ఛందంగా ఇచ్చినవేననని జవాబివ్వకుండా దాటేశారు. అయితే ఆయనే తమది వ్యక్తుల బృందమే తప్ప రిజిస్టరైన సంస్థ కాదంటున్నారు. కనుక ఈ వనరులన్నీ ప్రజల సంపద అవుతుందన్న వాస్తవాన్ని ఆయన దాచిపెడుతున్నారు. సంఘ్‌కు భారీ స్థాయిలో భూములున్నాయనేది ప్రజలకు తెలిసిన విషయమే. ఆ స్థలాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ భారీ సౌధాలు, ఇతర నిర్మాణాలు చేసింది. అయితే అది రిజిస్ట్రేషన్‌ లేని సంస్థ గనక ఇలాంటి ఆస్తుల గురించి ప్రజలకు వివరాలు ప్రకటించడమే జరగదు. ఆరెస్సెస్‌ గనక విశుద్ధ కపోతమే అయితే ఎందుకని దాపరికంగా వ్యవహరిస్తూ ప్రజల తనిఖీకి తన ఖాతాలను సమర్పించకుండా తప్పించుకుంటున్నది?

మత కలహాలు, విద్వేషాల మూలం
ఇక్కడ మనం ఆరెస్సెస్‌ భావజాలం, చేసే పనులు, నిర్మాణ స్వరూపం వంటి విస్తృతాంశాల జోలికి పోనవసరం లేదు. దాని తప్పొప్పులు, అసత్య ప్రచారాల గురించి భారీ సమాచారం అందుబాటులో వుంది. పీపుల్స్‌ డెమోక్రసీ గత కొన్ని సంచికలలో కూడా మేము…వివిధ సమస్యలలో, రంగాలలో ఆరెస్సెస్‌ చేసిందేమిటన్నదాన్ని చాలా వివరంగా విశ్లేషించాము. భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలకే విరుద్ధమైన దాని జోక్యాలను వివరించాము. ఆరెస్సెస్‌ రాజ్యంగంపై విశ్వాసం కలిగివుంటుందనీ, జాతీయ పతాకం, జాతీయ గీతం వంటి జాతీయ చిహ్నాలను గుర్తిస్తుందనీ చెప్పడం పచ్చి వంచన మాత్రమే. సంఘ్‌ పూర్తి విరుద్ధమైన లక్ష్యాలతో అమలు చేస్తున్న మోసపూరిత ఆచరణ అది.

ఆరెస్సెస్‌ అద్భుత కృషి గురించి, దాని సేవల రికార్డు ఏమిటనేదానిపై మోడీ స్వయంగా ఎర్రకోట బురుజుల నుంచి స్వంత పూచీతో గర్జించారు. ఆరెస్సెస్‌ మతపరమైన హింసాకాండను రెచ్చగొట్టిందనీ, విద్వేషం రగిలించిందనీ ఆరోపణ వచ్చింది కేవలం దాని విమర్శకుల నుంచే కాదు. అయిదు తీవ్ర హింసాకాండలపై విచారణ జరిపిన విచారణ కమిషన్లు (1969లో అహ్మదాబాద్‌ మత కలహాలపై విచారణ జరిపిన జగన్మోహన్‌ రెడ్డి కమిషన్‌, 1970 భివాండి మత కలహాలపై డి.పి.మదన్‌ కమిషన్‌ నివేదిక, 1971 తలసెరి అల్లర్లపై జోసెఫ్‌ వితయతిల్‌ నివేదిక, 1979 జంషెడ్‌పూర్‌ అల్లర్లపై జితేంద్ర నారాయణ్‌ నివేదిక, 1982 కన్యాకుమారి మత కలహాలపై పి.వేణు గోపాలరెడ్డి నివేదిక) ఆరెస్సెస్‌తో, దాని భావజాలంతో బలమైన అనుబంధంగల సంఘాలూ పార్టీలూ పోషించిన పాత్రను బహిరంగంగా అభిసంసించాయి. ముస్లింలు ఇతర పౌరులకు అపార ప్రాణబలికీ, ఆస్తి నష్టానికి దారి తీసిన కలహాల ప్రజ్వలనకు వారెలా కారకులయ్యారో వెల్లడించాయి. వారి సేవా కార్యక్రమాల గురించి ఎలాంటి వాస్తవికమైన వివరాలు లేనప్పుడు వారి సహాయ కృషిపై ఆడిట్‌ తనిఖీ వంటివి లేకపోవడం ఊహించగలిగిందే.

ఇప్పటికైనా చెప్పాల్సిందే!
చివరగా జాతి, జాతీయత గురించి సావర్కర్‌ రూపొందించిన నిర్వచనమే గోల్వాల్కర్‌ ఏమాత్రం విమర్శ లేకుండా స్వీకరించారు. మరింత లోతుగా బలపర్చాడు కూడా. భారత దేశం తమ మాతృభూమి, పితృభూమి అని గుర్తించే వారిని మాత్రమే అసలైన భారతీయులుగా గుర్తించాలన్నాడు. అంటే భారతదేశంలో వివిధ మత విశ్వాసాలకు చెందిన ప్రజలు, దేశంలో స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత కలిగివుంటూ తమ తమ మత విశ్వాసాలు అనుసరించే వారు భారతీయులనిపించుకోరనే ఆయన నిర్వచనం సూర్య కాంతిలా స్పష్టంగా అర్థమవుతూనే వుంది. ఆర్‌ఎస్‌ ఎస్‌ వ్యవస్థాపక దృక్పథమే మన గణతంత్ర, లౌకిక, ప్రజాస్వామ్య రాజ్యాంగానికి వ్యతిరేకంగా వుంది. అందువల్ల ఆరెస్సెస్‌ ఏదో వ్యక్తుల బృందమనీ అందువల్ల రిజిస్ట్రేషన్‌ పరిధి వెలుపల వుండిపోతుందని మోహన్‌ భగవత్‌ చెప్పడం ప్రజల విజ్ఞతను అవమానించడమే అవుతుంది. అందువల్ల ఆర్‌ఎస్‌ఎస్‌ సూటిగా ముందుకొచ్చి తన వ్యవహారాలేమిటో ప్రజలకు సమర్పించి తన అసలు సంగతులకు ఆమోదం పొందడం ఇప్పుడు తక్షణమే జరగాల్సిన పని.
(నవంబర్‌ 12 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -