Saturday, November 15, 2025
E-PAPER
Homeఎడిట్ పేజి''శ్రమశక్తి నీతి''లో నీతి ఎంత?

”శ్రమశక్తి నీతి”లో నీతి ఎంత?

- Advertisement -

”శ్రమశక్తి నీతి” పేరుతో మోడీ ప్రభుత్వం కార్మిక విధానం ముసాయిదాను ప్రకటించింది. హిందీలో ”నీతి” అంటే విధానం అని అర్థం. ఈ విధానం లక్ష్యం ఏమిటి? కార్మిక విధానం అంటే ఏమి ఉండాలి? ప్రాచీన కాలం నాటి మనుస్మృతి వంటి స్మృతులలోనే అన్నీ ఉన్నాయా? శ్రమపట్ల భారతీయ భావనకు ప్రత్యేకత ఉన్నదా? ఇలాంటివే అనేక ప్రశ్నలను లేవ నెత్తింది. కార్మిక చట్టాల అమలు, తనిఖీలు, యాజమాన్యాలకు, కార్మిక సంఘాలకు మధ్య మధ్యవర్తిత్వం వహించడం ద్వారా రాజీలు కుదుర్చటం, తీర్పులివ్వటం వంటి పద్ధతులతో వివాదాలు పరిష్కరించే బాధ్యత కార్మికశాఖది. కార్మికుల హక్కులు కాపాడేందుకు చట్టాలు చేశారు. కార్మికుల కోసం చట్టాలు చేయాలన్న స్ఫృహ 1917 రష్యన్‌ విప్లవం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అంగీకారం పొందింది. రష్యాలో వచ్చిన కార్మిక విప్లవం శ్రామికులకు హక్కులిచ్చింది.

దీని ప్రభావం ప్రపంచమంతా వ్యాపించే అవకాశం ఉన్నదని అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, జపాన్‌ వంటి అనేక పెట్టుబడిదారీ దేశాలు గమనించాయి. తామే ఈ హక్కులను కల్పిస్తామనే భ్రమలు సృష్టించే ప్రయత్నంలోనే ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎల్‌ఒ) ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అప్పటికే హక్కుల కోసం పోరాటం చేస్తున్న కార్మికవర్గానికి రష్యన్‌ విప్లవం స్ఫూర్తినిచ్చింది. భారతదేశంలో కూడా కార్మికోద్యమం ఊపందుకున్నది. ఫలితంగా నాటి తెల్లదొరల పాలనలోనే ట్రేడ్‌ యూనియన్‌ చట్టం, వేతన చెల్లింపుల చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం లాంటి అనేక చట్టాలు చేయక తప్పలేదు. స్వాతంత్య్రానంతరం కార్మికవర్గం మరిన్ని చట్టబద్ధమైన హక్కులను సాధించుకున్నది. వీటితో కార్మికవర్గానికి సంపూర్ణ న్యాయం జరక్కపోయినప్పటికీ ఎంతో కొంత మేలు జరిగింది.ఈ చట్టాలు కూడా సక్రమంగా అమలు చేయలేదు. తర్వాత ప్రపంచీకరణ పేరుతో ఈ పాటి చట్టాలు కూడా నీరుగార్చటం మొదలైంది.

క్రమంగా కార్మికశాఖ యజమానుల శాఖగా పనిచేయటం మొదలుపెట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుండి నేటి వరకు అనేక సందర్భాల్లో యజమానులనే కార్మిక మంత్రిగా నియమిస్తున్నారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ”శ్రమ శక్తి నీతి” పేరుతో కార్మిక శాఖను సారాంశంలో యజమానుల శాఖగానే చట్టబద్ధం చేస్తున్నది. తనిఖీల వ్యవస్థకు కాలం చెల్లిందనీ, రాష్ట్రాల సామర్ధ్యాలలో తరతమ తేడాలు, సాంకేతిక అంతరాల వంటి కారణాలతో ఈ విధానం ప్రకటిస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. ఏకీకృత జాతీయ చట్టం అవసరమైందని సమర్ధించుకున్నది. మన రాజ్యాంగం ప్రకారం కార్మికరంగం ఉమ్మడి జాబితాలో ఉన్నది. ఏకీకృత జాతీయ చట్రం పేరుతో కార్మిక హక్కులను కాలరాసే ప్రయత్నం జరుగుతున్నది. ”శ్రమ శక్తి నీతి” లక్ష్యం సులభతర వ్యాపారం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) అన్నారు. అంటే కార్మిక విధానాన్ని వ్యాపార ప్రయోజనాల కోసం అనుసరించే విధానంగా మార్చేస్తున్నారు.

యజమానులకు, కార్మికులకు కూడా ఈ విధానంలో మరింత పట్టు విడుపులకు (గ్రేటర్‌ ఫ్లెక్సిబులిటీ) ఉంటుందన్నారు. మారుతున్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా కొంత మంది కార్మికులను తొలగించటం అనివార్యమని కూడా చెప్పారు. పట్టువిడుపులతో కూడిన అవకాశం అంటే అర్థం ఏమిటో తెలియనిది కాదు. కార్మికులను తొలగించడానికి లేదా బానిస చాకిరీ చేయించడానికి యాజమాన్యానికి స్వేచ్ఛనివ్వడమే తప్ప మరొకటి కాదు. ఇప్పటివరకు కార్మిక చట్టాల అమలును అందుకవసరమైన తనిఖీలను కార్మిక శాఖ చూస్తున్నది. ఇప్పుడీ విధాన పత్రంలో కార్మికశాఖ ఉపాధిని సులభతరం చేసే బాధ్యత చూడాలన్నది. ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా కాదు, సులభతరం (ఫెసిలిటేట్‌) చేయడం అంటున్నారు. అంటే కార్మిక శాఖ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల సమాచారం అందించే ఏజెన్సీగా మిగిలిపోతుందన్నమాట. కార్మికుల హక్కులు, భద్రత కోసం ప్రభుత్వంలో ఒక మంత్రిత్వశాఖ అవసరం లేదని చెప్పకనే చెప్పింది. అది యజమానుల శాఖగానే పనిచేస్తుంది.

ప్రపంచంలో ఎక్కడైనా శ్రమ ఫలితం ఒక్కటే. ఉత్పత్తి పెంచటం, సంపదను పెంచటమే. ప్రపంచీకరణ యుగంలో ఎప్పుడూలేనంత సులభంగా అందరికీ అర్థమౌతున్న విషయమిది. కానీ, ఈ విధాన పత్రంలో శ్రమ గురించిన భారతీయ అవగాహన ఆర్థిక కోణాన్ని మించిందని మోడీ ప్రభుత్వం అంటున్నది. అంటే శ్రమకు తగ్గ ఫలితం అడగవద్దు. శ్రమించటం కార్మికుల నైతిన బాధ్యత అని నొక్కి చెబుతున్నది. పనిచేసే బాధ్యతను కార్మికవర్గం నైతిక బాధ్యతగా స్వీకరించడం ద్వారా సమా జంలో సామరస్యం, ఆర్థిక శ్రేయస్సు, సమిష్టి అభివృద్ధి సాధించగలమని చెబుతున్నది. ఈ విధానంలో ఎక్కడా ‘యజ మాని-కార్మికులు’ సంబంధాల ప్రస్థావనే లేదు. ద్వైపాక్షిక, త్రైపాక్షిక ఒప్పందాలను గురించిన ఊసే కనిపించదు. యజమానులు కార్మిక సంక్షేమం స్వచ్ఛందంగా అమలు చేస్తారట. ఇది మనందరము నమ్మాలట. కార్మికుల చెవిలో పువ్వుపెట్టడం కాక దీన్నేమంటాము! ఆరెస్సెస్‌ నేత గోల్వాల్కర్‌ చెప్పిన సిద్ధాంతాన్నే నేడు మోడీ అమలులోకి తెస్తున్నారు.

కార్మిక చట్టాలు అవసరం లేదనీ, యజమాని హృదయ సరివర్తన ద్వారా కార్మికుల బాగోగులు చూడాలని గోల్వాల్కర్‌ సుద్దులు చెప్పారు. యజమానులు స్వచ్ఛందంగా కార్మిక చట్టాలను అమలు చేసేందుకోసం ప్రభుత్వం నిరంతరం అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తుందట. పెట్టుబడిదారులకు నీతి బోధలు చేస్తుందట. అవన్నీ యజమానులు పాటిస్తారట! ఈ విధానాన్ని రూపొందించే ముందు దేశంలో కేంద్ర కార్మిక సంఘాలను మాటమాత్రంగా కూడా సంప్రదించలేదు. స్వతంత్ర భారతదేశంలో కార్మిక విధానం రూపొందించేందుకు ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ను నిర్వహించటం ఆనవాయితీ. ఇవేవీ ప్రధాని మోడీకి, హోంమంత్రి అమిత్‌షాకు నచ్చవు. అందుకే విధానం వారు రూపొందిస్తారు. ముసాయిదా విడుదల పేరుతో అభిప్రాయ సేకరణ తంతు ముగిస్తారు. ఈ విధాన రూపకల్పనకు ప్రాతిపదిక స్మృతులలోనే ఉన్నదట. మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, నారద స్మృతి, శుక్రనీతి లాంటి స్మృతులను ఈ విధాన పత్రంలో ఆదర్శంగా చూపించింది.

ఆధునిక కాలానికి చెందిన ”శ్రమశక్తి నీతి” మూలాలన్నీ ఈ స్మృతులలో ఉన్నాయని చెప్పారు. రాజధర్మం ప్రాతిపదికగా శ్రమశక్తి నీతిని రూపొందించారు. అందుకేనేమో ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ పురావస్తు ప్రదర్శన శాలల్లో పెట్టించిన ‘రాజదండం’ తెచ్చి మోడీ ప్రభుత్వం పార్లమెంటులో పెట్టేసింది. దేశంలో ప్రజాస్వామ్య పాలన జరుగుతుందని నెహ్రూ హామీ ఇచ్చారు. తన పాలన రాచరికంతో పోలి ఉంటుందని ‘రాజదండం’ ప్రదర్శనతో ప్రధాని మోడీ చెప్పకనే చెప్పారు. స్మృతులలో శ్రమ సంబంధాల గురించి కూడా ఉంటుంది. అది నిజమే. కానీ, స్మృతుల కాలం నాటి శ్రమ సంబంధాలను అది వ్యక్తీకరిస్తుంది. స్మృతులు రెండవ శతాబ్దం నుండి ఆరవ శతాబ్దం మధ్యంలో గ్రంధస్తమయ్యాయని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. అంటే అత్యంత వెనుకబడిన సమాజం. భూస్వామ్య వ్యవస్థ స్థిరపడుతున్న కాలం. వర్ణవ్యవస్థ బలపడిన కాలం. మనుస్మృతి వర్ణవ్యవస్థను సమర్ధించిన తీరు అందరికీ తెలిసిందే.

ఆనాటి శ్రమ సంబంధాలన్నీ భూస్వాములకు, శ్రామి కులకు మధ్య సంబంధాలే. వర్ణవ్యవస్థతో ముడిపడిన సంబంధాలే. అందువల్ల స్మృతులలో చెప్పిన శ్రమశక్తికి సంబంధించిన సూత్రాలు ఆ కాలం నాటి పరిస్థితులను సూచిస్తాయి. ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో ఉన్నాము. కృత్రిమ మేధస్సు యుగంలో ఉన్నాము. ఉత్పత్తి పరికరాలు ఉన్నతస్థాయికి అభివృద్ధి చెందాయి. ఆమేరకు కార్మికుల నైపుణ్యం అనేక రెట్లు పెరిగింది. ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఆచరణలోకి వచ్చింది. పారిశ్రామికీకరణ ఐదవ దశకు పరుగులు తీస్తున్నది. రాచరిక రాజ్యాలు అంతమై, ప్రజాస్వామిక దేశాలు అవతరించాయి. పెట్టుబడిదారీ విధానం ప్రపంచీకరణ దశకు చేరింది. ఈ క్రమంలోనే కుల, మతాలతో సంబంధం లేని ఉత్పత్తి విధానం అభివృద్ధి చెందింది. నైతిక బాధ్యత, కులవృత్తి స్థానంలో కార్మికుల హక్కులు ముందుకొచ్చాయి. కార్మిక చట్టాలు అనివార్యమైనాయి. పారిశ్రామికీకరణ ప్రారంభ దశలోనే ఎనిమిది గంటలు పని అన్న సూత్రం ముందుకొచ్చింది.

రష్యాలో కార్మికవర్గ రాజ్యం ఏర్పాటుతో ఎనిమిది గంటల పనిదినం చట్టబద్ధమైంది. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలు కూడా కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం అనేక చట్టాలు చేయక తప్పలేదు. ఇప్పుడు ఆవిరి యంత్రాలు కాదు, కృత్రిమ మేధతో ఉత్పత్తి జరుగుతున్నది. ఉత్పత్తి, యజమానుల లాభాలు వందల రెట్లు పెరిగాయి. ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఫలాలు కార్మికులకు కూడా చెందాలి. పనిగంటలు తగ్గించటం, వేతనాలు, సౌకర్యాలు పెంచటం ద్వారా ఇవి అమలు చేయాలి. ఆర్థిక, సాంఘిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలలో శ్రామిక కుటుంబాలు వికసించే విధంగా కార్మిక విధానాన్ని రూపొందించాలి. ఇందుకు పూర్తి భిన్నంగా హక్కుల ప్రస్తావన లేని విధానాన్ని కేంద్రం ప్రతిపాదించింది. యజమానుల నేరపూరిత చర్యలను నేరాల జాబితా నుండి తొలగించే విధంగా భారతీయ న్యాయ సంహితలో మార్పులు తెస్తున్నారు. అంటే యజమానులు నేరాలు చేసినా వాటిని సాధారణ తప్పులుగా పరిగణిస్తారు. మరోవైపు కార్మికవర్గ నిరసనలను, సంఘటిత పోరాటాలను నేరాల పరిధిలోకి చేర్చుతున్నారు.

అంటే స్మృతుల కాలం నాటి అణిచివేత చర్యలను చట్టబద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసింది. కోరలు లేని లేబర్‌ కోడ్స్‌ రూపొందించింది. భారతీయ భావన పేరుతో భూస్వామ్య అణిచివేతను రుద్దుతున్నది. నేటి కార్మికులను ఆధునిక బానిసలుగా చేసే ప్రయత్నమిది. ప్రాచీన కాలం నాటి స్మృతుల స్ఫూర్తితో కార్మికులతో బానిస చాకిరీ చేయిస్తారు. కార్మికులకు బాధ్యతలే తప్ప, హక్కులకు స్థానం లేదని తేల్చేశారు. యజమానులకు మాత్రం ఆధునిక కాలపు స్ఫూర్తితో పాలకులు సేవ చేస్తారు. ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని సంపద పోగేసుకు నేందుకు అన్ని అవకాశాలు కల్పిస్తారు.

అంతేకాదు, ప్రపంచీకరణ యుగంలో ఉన్నాం కదా! జాతీయ, అంతర్జాతీయ అనుసంధానం పేరుతో బహుళజాతి సంస్థల దోపిడీకి కూడా పూర్తి స్వేచ్ఛనివ్వటమే ఈ విధానం సారాంశం. ఇది దీర్ఘకాలిక విధానమని కూడా ప్రభుత్వం నొక్కి చెప్పింది. కార్మికవర్గం నైతిక బాధ్యతగా భావించి, తలవంచుకుని శ్రమచేసే విధంగా ఈ విధానం అమలు పర్చేందుకు అంతర్జాతీయ సహకారం కూడా తీసుకుంటారు. శ్రమ విలువలు లేని ”శ్రమశక్తి విధానం” ఇది. కార్మికవర్గానికి ఇదొక సవాలు. కార్మిక హక్కులను కాలరాసి, యజమానుల సేవలో తరించే విధానాలు రూపొందించడంలో మోడీ ప్రభుత్వం అత్యంత వేగంగా అడుగులు వేస్తున్నది. కార్మికోద్యమం కూడా అంతే వేగంతో, పట్టుదలతో ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలి.

ఎస్‌.వీరయ్య

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -