హోరాహోరీగా సాగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ నాయకత్వంలోని ఎన్‌డిఎ మళ్లీ విజయం సాధించడం ఆర్‌జెడి నాయకత్వంలోని మహాగట్ బంధన్ (ఎంజిబి)కి ఎదురు దెబ్బ. పాలక సంకీర్ణ కూటమి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని, అనేక అవకతవకలకు పాల్పడుతూ, పెద్ద మొత్తంలో డబ్బును వెదజల్లిందన్న ప్రాథమిక విశ్లేషణలు సత్యదూరం కాకపోవచ్చు. అయితే, నితీష్ కుమార్ ప్రభుత్వం చేపట్టిన సైకిళ్ల పంపిణీ తదితర సంక్షేమ చర్యలు, మద్య నిషేధం వంటివీ ఎన్నికల విజయానికి సోపానాలయ్యాయి. ఎన్‌డిఎ గెలుపులో ప్రధానంగా మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషించారు. ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ అమలు చేసే సోషల్ ఇంజనీరింగ్‌తోపాటు ప్రధాని, హోంమంత్రి అంతటి అత్యున్నత స్థానాల్లో వున్నవారితో సహా తమ నేతలు చేసే మతోన్మాద, కులతత్వ వ్యాఖ్యలు, వాక్చాతుర్యం వంటి వాటి నుండి ఎన్‌డిఎ ప్రయోజనం పొందిందన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. బీజేపీ కొమ్ము కాస్తూవస్తున్న కార్పొరేట్ మీడియా వాటిని చాకచక్యంగా ప్రజలకు చేరవేసింది. రెండవదశ పోలింగ్‌కు ఒక్కరోజు ముందు ఢిల్లీలో జరిగిన బాంబు విస్ఫోటనం మతపరమైన విభజన పెరగడానికి, విద్వేష వ్యాప్తికీ కారణమైంది.
బీహార్ ఎన్నికల్లో కొత్త శక్తిగా ముందుకు వచ్చిన ప్రశాంత్ కిశోర్ నాయకత్వంలోని జనసురాజ్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి ఎన్‌డిఎకు ఉపయోగపడిందన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి. సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్) పేరిట నిరంకుశంగా 65 లక్షల మంది ఓట్లర్లను తొలగించిన ఎన్నికల కమిషన్ కూడా ఎన్‌డిఎకు తోడ్పడిందన్న విమర్శను కొట్టి పారేయలేం. ఎన్నికల ప్రక్రియ సాగుతున్నా లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి పది వేల రూపాయల చొప్పున బట్వాడా చేస్తున్నా దాన్ని నివారించకుండా ఎన్నికల కమిషన్ మిన్నకుండిపోవడం అందుకో గట్టి నిదర్శనం. గతంలో ఇటువంటివాటిని ఇసి సూమోటోగా నిలుపుదల చేసిన దృష్టాంతాలెన్నో వున్నాయి. ఫిర్యాదులు చేసినప్పటికీ జ్ఞానేష్‌కుమార్ ఆధ్వర్యంలోని ఇసి మౌనం దాల్చడం దాని పాక్షిక దృష్టికి మచ్చు తునక. వీటన్నిటి మధ్య మహాగట్‌బంధన్ లేవనెత్తిన నిరుద్యోగం, ధరల పెరుగుదల, వలసలు పోతున్న దుస్థితి వంటి కీలక ప్రజా సమస్యలు అంతగా చర్చనీయాంశాలు కాకపోవడం విచారకరం.
అసెంబ్లీలోని 243 స్థానాలకుగాను ఎన్‌డిఎ 202 స్థానాల్లో గెలుపొంది భారీ ఆధిక్యాన్ని సాధించగా, ఎంజిబి 35 సీట్లకు పరిమితం కావలసివచ్చింది. అయితే, ఆర్‌జెడి అధికారానికి రాలేకపోయినా రాష్ట్రంలో అత్యధిక ఓట్లు సాధించడం అభినందనీయం. అలాగే ప్రాంతీయ పార్టీలతో చెలిమి చేసి వారి ప్రజా పునాదిని బీజేపీ తినేస్తుందన్న వాస్తవం బీహార్ ఫలితాల్లోనూ స్పష్టమైంది. ఇంత తీవ్రమైన పోటీలో విభూతిపూర్ నియోజక వర్గంలో సీపీఐ(ఎం), రెండు నియోజకవర్గాల్లో సీపీఐ(ఎంఎల్- లిబరేషన్) గెలుపొందడం ఎడారిలో ఒయాసిస్సు లాంటిదే! అణచివేతకు, దోపిడీకి గురవుతున్న వారి హక్కుల కోసం వామపక్షాలు సాగించే పోరాటాలకు ఈ విజయం తోడ్పడుతుందని ఆశించవచ్చు. మొత్తంగా చూస్తే బీజేపీని ఓడించడానికి ప్రతిపక్ష పార్టీలు మరింత సమైక్యంగా కృషి చేసి వుండాల్సిందని ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి.
గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లలో పోటీ చేసి గెలవలేక విపక్షానికి చేటు చేసిందని ఆనాటి ఫలితాల విశ్లేషణలో తేలింది. ఈ ఎన్నికల్లో ఎంజిబి పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, స్నేహ పూర్వక పోటీల పేరిట ఓట్ల చీలికకు దారితీసిన కారణాలేమిటో ఆయా పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఫలి తాల వెనుక గల ఇతర కారణాలను సవివరంగా సమీక్షించుకుంటేనే భవిష్యత్తులో పరివార్ శక్తుల కుట్రలను ఎదుర్కోవడం, వాటిని తిప్పికొట్టడం పూర్తి స్థాయిలో సాధ్యమవుతుంది. ప్రతిపక్ష పార్టీల మధ్య సమన్వయం, సుహృద్భావం పెరగాలి. ఉమ్మడి శత్రువును ఐక్యంగా ఓడించాలన్న స్ఫూర్తి మరింత అభివృద్ధి కావాలి. ప్రజాధనాన్ని శత సహస్ర కోటీశ్వరులకు కట్టబెడుతున్న మతతత్వ- కార్పొరేట్ కూటమి పాలనకు వ్యతిరేకంగా ఐక్య ప్రజా ఉద్యమాలు సాగించాలి.
బీహార్ పాఠాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



