కైరో (ఈజిప్ట్) : భారత వర్థమాన షూటర్, తెలంగాణ స్టార్ ఇషా సింగ్ చరిత్ర సష్టించింది. మహిళల 25మీ స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలో పతకం సాధించిన ఇషా సింగ్.. షూటింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో ఈ విభాగంలో భారత 70 ఏండ్ల నిరీక్షణకు తెరదించింది. శుక్రవారం జరిగిన మహిళల స్పోర్ట్స్ పిస్టల్ విభాగం పతక పోటీలో ఇషా సింగ్ 30 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. 40 పాయింట్లతో దక్షిణ కొరియా షూటర్ పసిడి, 38 పాయింట్లతో చైనా షూటర్ సిల్వర్ సాధించగా.. 25 పాయింట్లతో భారత స్టార్ షూటర్ మను భాకర్ ఐదో స్థానానికి పరిమితమైంది. 86 మంది పోటీపడిన స్పోర్ట్స్ పిస్టల్ విభాగం అర్హత రౌండ్‌లో మను భాకర్ 586 పాయింట్లతో ఆరో స్థానంలో నిలువగా.. 587 పాయింట్లతో ఇషా సింగ్ ఐదో స్థానంలో నిలిచింది. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో తొలి నాలుగు రోజులు పది ఒలింపిక్ విభాగాల్లో పోటీలు జరుగగా.. భారత్ ఓ పసిడి, నాలుగు రజతాలు, రెండు కాంస్య పతకాలతో భారత్ పతకాల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది.



