200కు పైగా స్థానాల్లో అధికార కూటమి గెలుపు
మహాగట్‌బంధన్ 35 సీట్లకే పరిమితం
సీపీఐ(ఎం)కు ఒకటి, సీపీఐ ఎంఎల్(ఎల్)కు రెండు సీట్లు
ఖాతా తెరవని ప్రశాంత్ కిషోర్ పార్టీ
పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ విజయం సాధించింది. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ 200కు పైగా సీట్లను చేజిక్కించుకున్నది. మ్యాజిక్ ఫిగర్ 122ను దాటి బీహార్‌లో మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ మార్గం సుగమం చేసుకున్నది. ఇక ఈ సారి ఎలాగైనా అధికారాన్ని చేపట్టాలని బరిలో నిలిచిన మహాగట్‌బంధన్ 40 స్థానాలు కూడా దాటలేకపోయింది. కేవలం 35 స్థానాలకు పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కూటమి వైపు గాలి వీచినా.. వామపక్ష పార్టీలు తమ ఉనికిని చాటగలిగాయి. ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం) ఒక స్థానాన్ని, సీపీఐ ఎంఎల్(ఎల్) రెండు సీట్లను కైవసం చేసుకున్నాయి.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు చెందిన జన్ సురాజ్ పార్టీ (జేఎస్‌పీ) ఖాతా కూడా తెరవలేకపోయింది. ఐదు స్థానాల్లో విజయంతో ఎంఐఎం కీలక పాత్ర పోషించింది. అధికార ఎన్డీఏ 202 స్థానాల్లో గెలుపొందింది. ప్రధాన పార్టీలైన బీజేపీ, జేడీ(యూ)లు చెరో 101 స్థానాల్లో పోటీ చేశాయి. ఇందులో బీజేపీ 90, జేడీయూ 84 సీట్లలో విజయం సాధించాయి. ఎన్డీఏలోని ఇతర పార్టీలు ఎల్జేపీ (ఆర్‌వీ) 19, హెచ్‌ఏఎం(ఎస్) ఐదు, ఆర్‌ఎల్‌ఎం నాలుగు స్థానాలను కైవసం చేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో మరోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. ఎన్డీఏ విజయంతో కూటమిలోని పార్టీ కార్యాలయాల వద్ద పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నాయి.
బీజేపీ, జేడీ(యూ), ఎల్జేపీ(ఆర్‌వీ) నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నేతృత్వంలో ముందుకెళ్లిన మహాగట్‌బ ంధన్‌కు ఆశించిన ఫలితాలు రాలేదు. కూటమిలో కీలక పార్టీగా ఉన్న ఆర్జేడీ 25 స్థానాల్లోనే విజయం సాధించింది. కాంగ్రెస్ ఆరు నియోజకవర్గాలకే పరిమితమైంది. ఈ కూటమిలోని వామపక్ష పార్టీలు మూడు సీట్లను చేజిక్కించుకున్నాయి. సీపీఐ(ఎం) ఒక స్థానాన్ని, సీపీఐ ఎంఎల్(ఎల్) రెండు సీట్లను దక్కించుకు న్నాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మహాగట్‌బంధన్ కూటమి 114 స్థానాల్లో విజయం సాధించగా.. ఈ సారి అందులో సగం కూడా దక్కించు కోకపోవడం గమనార్హం.
ఆర్జేడీకి ఓటింగ్ శాతం అధికం
ఈ ఎన్నికల్లో ఆశించినస్థాయిలో సీట్లను దక్కించుకోలేకపోయిన ఆర్జేడీ..మిగతా పార్టీలకంటే ఎక్కువ ఓట్లను పొందింది. ఆ పార్టీకి 22.94 శాతం ఓట్లు వచ్చాయి. ఇక ఎన్డీఏలోని బీజేపీకి 20 శాతం, జేడీ(యూ)కు 19 శాతం ఓట్లు దక్కాయి. కాంగ్రెస్ మాత్రం ఎనిమిది శాతానికి పరిమితమైం ది. ఎల్జేపీ(ఆర్‌వీ) ఐదుశాతం ఓట్లను దక్కించుకు న్నది. ఎంఐఎం 1.86 శాతం ఓట్లను పొందింది. ఆర్జేడీ 2005 నుంచి (మధ్యలో కొన్నినెలలు మినహాయిస్తే) అధికారానికి దూరంగా ఉన్నది.
పని చేయని ప్రశాంత్ కిషోర్ వ్యూహం
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్.. జన్ సురాజ్ పార్టీ(జేఎస్‌పీ)ని స్థాపించి బీహార్ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఆయన పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపలేపోయింది. సొంత నియోజకవర్గంలోనూ ఆయన వ్యూహాలు పని చేయలేదు. దీంతో ఆ పార్టీ ఖాతా తెరవక చతికిలపడిపోయింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించిన విషయం విదితమే. ఈనెల 6న మొదటి దశ, 11న రెండో దశలో ఎన్నికలు జరిగాయి. ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యాన్ని 14న ఓట్ల లెక్కింపు ద్వారా అధికారులు వెల్లడించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఎనిమిది సార్లు సీఎం.. అసెంబ్లీ ఎన్నికలకు దూరం
బీహార్‌కు సీఎంగా దాదాపు రెండు దశాబ్దాల పాటు పరిపాలిస్తున్న జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్.. ఈ సారి కూడా మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు ఎనిమిది సార్లు సీఎంగా పని చేసిన ఆయన.. గత 35 ఏండ్లుగా ఎమ్మెల్యేగా మాత్రం పోటీ చేయలేదు. ఎమ్మెల్సీగా ఉంటూనే ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వస్తుండటం గమనార్హం. ఆయన చివరగా 1985లో హార్నౌట్ స్థానం నుంచి లోక్‌దళ్ పార్టీ ద్వారా ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1989,1991, 1996, 1998, 1999 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా ఐదుసార్లు బార్హ్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో బార్హ్, నలంద నుంచి పోటీ చేసిన ఆయన.. నలంద నుంచి విజయం సాధించారు. 1995లో హార్నౌట్ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు.
అభివృద్ధికి జై కొట్టిన ఓటర్లు : మోడీ
బీహార్‌లో ఓటర్లు అభివృద్ధికి పట్టం కట్టారని ప్రధాని మోడీ అన్నారు. రాష్ట్ర ప్రజలు తమ కూటమికి అఖండ విజయం అందించారని చెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముస్లింలు, యాదవ్‌లు అని కొన్ని రాజకీయపార్టీలు సంతుష్టీకరణ రాజకీయాలు చేశాయన్నారు. అయితే ఎన్డీఏ విజయానికి మహిళలు, యువత బాసటగా నిలిచారని ఆయన చెప్పారు. బీహార్‌లో విజయం కోసం పని చేసిన ఎన్డీఏ నేతలు, సీఎం నితీశ్ కుమార్ నాయకత్వాన్ని ప్రధాని ప్రశంసించారు. రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పు చెప్పారనీ, బీహార్ ప్రగతికి నూతన సంకల్పంతో పని చేసేందుకు ఈ చారిత్రక విజయం మరింత శక్తిని ఇస్తుందని అంతకుముందు ఎక్స్ వేదికగా మోడీ స్పందించారు.
ఎంఐఎం ఐదు స్థానాల్లో..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా మారుతున్న ఎంఐఎం.. ఈ సారి కూడా ఐదు స్థానాల్లో విజయం సాధించింది. మైనారిటీ ఓట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో దృష్టి కేంద్రీకరించిన ఈ పార్టీ అధికార, ప్రతిపక్ష కూటముల ఓట్లను చీల్చటంలో విజయం సాధించిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కాగా ఎంఐఎం నుంచి గతంలో విజయం సాధించిన ఎమ్మెల్యేలు ఆర్జేడీకి పార్టీ ఫిరాయించిన విషయం విదితమే.
కీలకంగా మహిళా ఓటర్లు
దేశంలో జరిగే ఏ ఎన్నికలోనైనా గణనీయమైన ప్రభావాన్ని చూపే మహిళా ఓటర్లు.. బీహార్‌లోనూ కీలకంగా మారారు. ఇక్కడి మహిళా ఓటర్లను ఆకర్షించడంలో అధికార ఎన్డీఏ కూటమి విజయం సాధించిందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ముఖ్యంగా మహిళలకు రూ.10 వేల చొప్పున ఇచ్చే రోజ్‌గార్ యోజన ఈ ఎన్నికల్లో బాగా పని చేసిందని అంటున్నారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఎన్డీఏ సర్కార్ ఈ పథకాన్ని తీసుకొచ్చిన విషయం విదితమే. మొత్తానికి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్డీఏ చేసిన ప్రయత్నాలు విజయవంతం కావటంతో అవే ప్రణాళికలను బీహార్‌లోనూ ప్రయోగించిందని విశ్లేషకులు చెప్తున్నారు.
మూడు స్థానాల్లో లెఫ్ట్ విజయం
బీహార్‌లో వామపక్షాలు మూడు స్థానాలను గెలుచుకున్నాయి. సీపీఐ(ఎం) ఒక స్థానం, సీపీఐఎంఎల్ (ఎల్) రెండు స్థానాలను గెలుచుకున్నాయి. సీపీఐ(ఎం) సిట్టింగ్ సీటు అయిన విభూతిపూర్‌ను గెలుచుకోగా, సీపీఐఎంఎల్ (ఎల్) పాలిగంజ్, కరకట్ నియోజకవర్గాలను నిలుపుకుంది. అజియోన్ నియోజకవర్గంలో సీపీఐఎంఎల్ (ఎల్) కేవలం 96 ఓట్ల తేడాతో ఓటమి చెందింది. సీపీఐ(ఎం) సిట్టింగ్ సీటు అయిన మంజీలో జన్సురాజ్ పార్టీ అభ్యర్థి 9,197 ఓట్లు చీల్చి, జేడీయూ అభ్యర్థి రణధీర్ కుమార్ సింగ్‌కు సహాయం చేశాడు. హయాఘాట్ నియోజకవర్గంలో సీపీఐ(ఎం) అభ్యర్థి శ్యామ్ భారతి 65,383 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. మరో నియోజకవర్గం పిప్రాలో సీపీఐ(ఎం) అభ్యర్థి రాజ్‌మంగల్ ప్రసాద్ 99,677 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ, జేడీయూ అభ్యర్థులు డబ్బులు పంచి, కులాన్ని ప్రస్తావిస్తూ ఓట్లు కోరగా, వామపక్ష అభ్యర్థులు అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం ఓట్లు కోరారు.



