ఫలించని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రయత్నాలు
జూబ్లీహిల్స్‌లో డిపాజిట్ గల్లంతు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కమలానికి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతైంది. ఈ ఓటమితో పార్టీ నేతల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. మరోవైపు ఓటమిపై తీవ్రమైన అంతర్మథనం కొనసాగుతున్నది. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఓడిపోవడంపై పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లతో పోల్చుకుంటే, ఉప ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓట్ల శాతం తగ్గింది. దీంతో పార్టీ నేతల్లో కలవరం మొదలైంది. ఉప ఎన్నికల ప్రచారంలో కిషన్‌రెడ్డి అన్నీ తానై వ్యవహరించినప్పటికి ఫలితం రాలేదు. దీని ఫలితంగా పార్టీలో ఉన్న తీవ్ర విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓటమికి మీరంటే మీరేనన్న రీతిలో అంతర్గత చర్చలు జరుగుతున్నాయి.
ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా జూబ్లీహిల్స్ ఓటమికి కిషన్‌రెడ్డి బాధ్యత వహించాలంటూ ముందుగానే హెచ్చరించారు. పార్టీ తరుపున బలమైన అభ్యర్థిని బరిలోకి దించకుండా కిషన్‌రెడ్డి తన సామాజిక తరగతికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయనకు టికెట్ ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీకి చెందిన ఎంతో మంది బలమైన నేతలు సీటు ఆశించినా, వారందర్ని కాదని కొత్తగా పార్టీలో చేరిన లంకల దీపక్‌రెడ్డికి ఇవ్వడం పట్ల అప్పట్లో తీవ్ర విమర్శలొచ్చాయి. అయితే ఎన్నికల ప్రచారంలో ప్రచారార్భాటం కనిపించింది. కానీ క్షేత్రస్థాయి ఓటర్లను ఆకర్షించేలా లేదని పార్టీవర్గాలు చెబుతున్నాయి. పార్టీలో నెలకొన్న అనైక్యత వల్ల ఓటర్లను చేరుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కిషన్‌రెడ్డిపై ఉన్న అసంతృప్తితో ఎంపీలు అర్వింద్, కొండా విశ్వేశ్వరరెడ్డి, కొంత మంది ఎమ్మెల్యేలు ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఎంపీ ఈటల రాజేందర్ ప్రచారానికి వచ్చినా పెద్దగా ప్రభావం చూపించలేదు. పైగా ఆయన సుడిగాలి పర్యటనకు పరిమితమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టినప్పటికీ బీజేపీ మొదటి నుంచి ఈ స్థానంలో ఏమాత్రం ఆశలు పెట్టుకోలేదు. ప్రచారంలో కూడా బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు పెద్దగా కనిపించలేదు. పార్టీలో ఫైర్ బ్రాండ్లుగా పేరున్న ఏ ఒక్క నేత ప్రచారంలో పాల్గొనకపోవడంతో ఆ పార్టీ కేడర్ కూడా జూబ్లీహిల్స్‌పై ఆశలు వదిలేసుకుంది. ఈ విషయాన్ని కిషన్‌రెడ్డి చెప్పకనే చెప్పారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ ఎప్పుడు గెలువలేదు. ఇప్పుడు కూడా పెద్దగా ఆశలు పెట్టుకోలేదని బహిరంగంగానే చెప్పారు. ఈ ఓటమి ఊహించినదే అంటూ ఆ పార్టీ అధ్యక్షులు రాంచందర్‌రావు వెల్లడించారు.
ఈ పరిణామాలన్నీ పార్టీలో అనైక్యత వల్లేనని సంకేతాలు వెళ్లాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధికంగా ముస్లిం మైనార్టీ ఓటర్లు ఉన్నారు. ఒక మతాన్ని కించపరిచేలా, అవమానించేలా కేంద్ర మంత్రి బండి సంజరుకుమార్ ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని కూడా ఓటర్లు జీర్ణించుకోలేదు. పోలింగ్ శాతం కూడా తగ్గిపోవడం కూడా బీజేపీకి మరో దెబ్బపడింది. అయినప్పటికీ కీలక నేతలెవరూ ప్రచారంలో భాగం కాకపోవడం, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయకపోవడం కూడా చర్చనీయాంశమైంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి డిపాజిట్ కోల్పోవడం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.
జూబ్లీహిల్స్ ఓటమి….బీహార్ విజయోత్సవాలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోరపరాజయాన్ని చవి చూసింది. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు బీహార్ ఎన్నికల విజయోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించింది. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంటున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో డిపాజిట్ కోల్పోయిన బీజేపీ సంబురం చేసుకోవడమేంటని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఓటమిపై చర్చ జరక్కుండా బీహార్ సంబురాలను ఉపయోగించుకుందనే చర్చ జరుగుతున్నది. ఈ సంబురాల్లో కేంద్ర మంత్రి బండి సంజరు, రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు కూడా పాలుపంచుకున్నారు. డప్పు చప్పులకు బీజేపీ మహిళ కార్యకర్తలు ఫుల్ జోష్‌తో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. బాణాసంచా పేల్చి.. స్వీట్లు తినిపించుకున్నారు. జూబ్లీహిల్స్ ఫలితం నేపథ్యంలో ఈ వేడుకలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.
బీజేపీకి ఎదురు దెబ్బ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



