ఏ మనిషిలోనైనా ఏదో ఒక సామర్థ్యం ఉంటుంది. అయితే దాన్ని గుర్తించడంలోనే లోపం జరుగుతుంటుంది. నేను చేయలేనేమో అనే భావన ఉంటుంది. అదే అభద్రతా భావం. కొంత మంది తమలో సమర్థత ఉన్నా తమను తాము తక్కువగా అంచనా వేసుకుని అభద్రతకు లోనవుతుంటారు. ఇలా వివిధ కారణాలలో అభద్రతా భావానికిలోనై మానసిక వేదన పడేవారి సంఖ్య ఇటీవల పెరిగిపోతోందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ముందే చెప్పినట్టు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యం ఉంటుంది. కానీ కొంత మంది మాత్రమే దాన్ని సరైన రీతిలో వినియోగించుకుంటారు. అయితే అభద్రతా భావం ఉన్న వారిలో కూడా మంచి నైపుణ్యాలున్నా.. తమను తాము తక్కువగా అంచనా వేసుకుంటారు. వారు సరిగా పని చేసినా తరచుగా ఇతరుల అభిప్రాయ కోరుతుంటారు. అవతలి వారి నుంచి సానుకూల స్పందన వస్తేనే సంతృప్తి పడడం, లేదంటే బాధపడడం వంటివి చేస్తారు. ఇలాంటి వారు స్వీయ నమ్మకం పెంపొందించుకోవడం చాలా ముఖ్యం.
ముఖ్యంగా అభద్రతకు లోనయ్యే వారు ఇతరులతో ఎక్కువగా పోల్చుకుంటూ వుంటారు. వారు సాధించిన విజయాలనే తాము సాధించాలని ఆరాటపడడం, వారిపై అసూయ పడడం, ఒకవేళ వాటిని చేరుకోలేకపోతే కుంగిపోవడం వంటివి అభద్రతకు లోనయ్యే వారిలో కనిపించే ముఖ్యమైన లక్షణాలు. అంతేకాదు ఇటువంటి భావనలో ఉన్నవారు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి బదులుగా కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇంకా వారి లోపాలకు ఇతరులను బాధ్యులను చేస్తూ వారిని నిందిస్తుంటారు. అయితే వీరు అప్పటికప్పుడు సంతృప్తి పొందినా భవిష్యత్తులో మాత్రం కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కనుక ఇలాంటి స్వభావం ఉన్నవారు తమ సమస్యను పరిష్కరించుకోవడానికి స్నేహితులో, నమ్మకమైనవారి సహకారమో తీసుకోవాలి.
అభత్రాభావం ఉన్నవారిలో భవిష్యత్తు గురించి ఆందోళన అధికంగా ఉంటుంది. అందుకే ప్రతి చిన్న విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఇది క్రమంగా ఒత్తిడికి దారి తీస్తుంటుంది. ఆ ఒత్తిడిని ఇతరులపై చూపించడం వల్ల రిలేషన్‌షిప్‌లో సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఇలాంటి వారు ఇతరులను, చివరికి సన్నిహితులను కూడా నమ్మడానికి వెనకాడుతుంటారు. ఇది భవిష్యత్తులో తీవ్రమైన మానసిక సమస్యలు దారి తీసే ప్రమాదం ఉంటుంది.
కనుక ఇలాంటి భావనతో ఇబ్బంది పడేవారు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. మరీ ముఖ్యంగా స్వీయ ప్రేరణ పొందేందుకు సాధన చేయాలి. దీనికోసం నిరంతరం పుస్తకాలు అధ్యయనం చేయాలి. విజయాలు సాధించిన వారి జీవిత చరిత్రలు చదవాలి. ఎవరో వచ్చి మనకోసం ఏదో చేస్తారని ఎదురు చూసి భంగపడటం కంటే మనకు మనమే ప్రేరణ ఇచ్చుకొని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. ఏ నిర్ణయం తీసుకున్నా అది మనదై ఉండాలి. దాని ఫలితం కానీ, నష్టం కానీ మనమే భరించాలి అనే ధోరణి పెంచుకోవాలి. మన ప్రయత్నంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు. పట్టుదలతో ముందుకే వెళ్లాలి. మరీ ముఖ్యంగా ఫలితాలతో నిమిత్తం లేకుండా ప్రయత్నానికే ప్రాధాన్యం ఇస్తూ కొనసాగితే అభద్రతాభావం దూరమై సమస్యలను ఎదుర్కొనే ధోరణి పెరుగుతుంది.
అభద్రత
- Advertisement -
- Advertisement -



