నవతెలంగాణ- రాయపోల్: ఆడపిల్లకు జన్మనివ్వాలంటే ఆలోచించే నేటి సమాజంలో ఆడబిడ్డకు పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులకు గుండెల మీద పెనుబారంగా మారుతున్న కాలంలో నిరుపేద వధువు వివాహానికి నింగి నేల మేము సైతం సోషల్ ఆర్గనైజేషన్, 1992-1993 రాయపోల్ పదవ తరగతి బ్యాచ్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని ఓయు జేఏసీ చైర్మన్,ప్రజా కళాకారులు దరువు అంజన్న అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండలం దొమ్మట గ్రామంలో నిరుపేద ముస్లిం వధువుకు వివాహానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దౌల్తాబాద్ మండలం దొమ్మట గ్రామానికి చెందిన దూదేకుల హామీద్ కూతురు సానియా బేగం వివాహం చేయడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారని, వీరిది పూట పూటకు కాయకష్టం చేసుకుని బతుకులు వెళ్లదీస్తున్న నిరుపేద మైనారిటీ కుటుంబం. అలాంటి దీనస్థితిలో ఒక ఆడబిడ్డ పెళ్లి చేయడం తల్లిదండ్రులకు స్తోమతకు మించి శాపంగా మారిందన్నారు. పొట్టకూటి కోసం హమీద్ చిన్న సైకిల్ పంక్చర్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు.గత కొద్ది రోజులుగా హమీద్ తీవ్ర అనారోగ్యానికి గురి కావడం, ఒక కిడ్నీ ఫెల్యూర్ కావడంతో కుటుంబ పోషణ భారమైందన్నారు. వీరికి సెంటు భూమి కూడా లేకపోవడం, నివాసం ఉండే పూరి గుడిసె గతంలో ప్రమాదవశత్తు దగ్ధం కావడంతో ఇటీవల కూతురు వివాహం చేయడానికి డబ్బులు లేకపోవడంతో ఐదు నెలల క్రితమే నిశ్చితార్థం జరిగిన, ఆర్థిక స్తోమత లేక పెళ్లి చేయలేకపోయారని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజాసేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ సమాచారం మేరకు తమ వంతు సహకారంగా 41 వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగిందన్నారు. ఇంకా మానవతావాదులు ఎవరైనా నిరుపేద యువతీ వివాహానికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్, ప్రధాన కార్యదర్శి పుట్ట రాజు, ఉపాధ్యక్షులు ముబాషిర్, జర్నలిస్టులు సాయి, బాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.