”చింటూ.! ఏంటిరా ఇది..? ఇంకా హోమ్ వర్క్ చేయలేదు..” అంటూ టీచర్ కోపంగా అడిగింది, హోమ్ వర్క్ బుక్ చెక్ చేస్తూ..
”లేదు టీచర్!.. రాత్రి వొంట్లో బాగాలేదు, అందుకే చెయ్యలేదు” అంటూ బిక్కమొఖంతో బదులిచ్చాడు చింటూ.
”ఏంటిరా చింటూ ఎప్పుడూ అబద్దం ఆడుతావు” అంటూ కొద్దిగా కళ్ళు పెద్దగా చేసి గట్టిగా అరిచింది చింటూ అలియాస్ అభినవ్‌ని. ముద్దుగా ‘చింటూ’ అని నిక్ నేమ్‌తో పిలుస్తారు అందరు.
చింటూ ఇప్పుడు 2వ తరగతి చదువుతున్నాడు.
తను ఎప్పుడూ నిజాయితీగా నిజం చెప్పినా, టీచర్ ఎందుకు అబద్దం ఆడుతానంటుంది అని తనలో తనే సందేహ పడుతూ దీనికి జవాబు వెతకాలి? తనని టీచర్ మళ్ళీ ఆలా అనకూడదని గట్టిగా నిర్ణయించుకుంటాడు చింటూ.
ఇంటికి వచ్చాడు. ఆయాసంగా ఏదో కోల్పోయినట్లు.
అతని వాలకం చూసి చింటూ అమ్మ పార్వతి పరుగెత్తి వచ్చి ఒళ్లు చూసింది. జ్వరంతో వెచ్చగా వుంది.
‘అయ్యో ఏమైంది’ అని అడిగింది ఉండబట్టలేక.
కొంచెం రిలాక్స్ అయ్యాక అసలు విషయం చెప్పాడు చింటూ.
అతని మాటలు విన్న పార్వతి ”ఓసి ఇంతేనా?” అని మెల్లగా ఏదో ఊదింది చెవిలో. ఎగిరి గంతేసాడు చింటూ.
తల్లీ కొడుకు వాలకం చూసిన వెంకటేష్ ఏదో అనుమానం పడ్డాడు.
కొన్ని సంవత్సరాలు గడిచాయి. పదవ తరగతి బొటాబొటిగా పాసయ్యాడు చింటూ.
ఇంటర్‌లో రెండు సార్లు డుంకీలు కొట్టాడు. వెంకటేష్ గట్టిగ మందలిస్తే మళ్ళీ పాస్ అయ్యి డిగ్రీలో చేరాడు.
తల్లి పార్వతి గారాబం బాగా ఎక్కువయ్యింది. చెడు స్నేహం అలవాటయింది.
ఇంటికి రాత్రులు రావడం.. తాగిన వాసన.. అతని గోల భరించలేక వెంకటేష్, పార్వతిలు రోజూ గొడవ పడేవారు.
ఇదంతా ఏం తెలియనట్లు నచ్చింది చేయడం, ప్రతి దానికి అబద్దం చెప్పడం, అబద్దాన్ని అందమైన శిల్పంలా మలచడం చింటూకి వెన్నతో పెట్టిన విద్య అయిపొయింది.
ఒకప్పుడు నిజం మాట్లాడే చింటూ.. ఇపుడు ఇరవై నాలుగు గంటలు అదే పని… అబద్దం చెప్పడం.
బజారులో తిరగలేక దంపతులు ఇంట్లోనే తలుపులు మూసుకుంటున్నారు.
డిగ్రీ పరీక్ష రిజల్ట్స్ వచ్చాయి.. మళ్ళీ అదే రిపీట్.. ఫెయిల్.
ఇది తట్టుకోలేక పార్వతి సూసైడ్ అటెంప్ట్ చేసింది.
అమితంగా ప్రేమించే తల్లి అలా కావడం తట్టుకోలేక పోయాడు చింటూ.
ఎలాగో ఆమె బతికింది నాలుగు రోజులు ట్రీట్మెంట్ వల్ల.
ఆ తర్వాత ఆమెకి ప్రామిస్ చేశాడు… డిగ్రీ పూర్తి చేసి ఇంటి పరువు కాపాడతానని. తండ్రి దగ్గర చనువు లేదు. అమ్మ అంటే అంత ఇష్టం..
ఆ రోజు అమ్మ ఆ మాటలు చెప్పి ఉండక పొతే.. ఇలా అయ్యేది కాదేమో! కనీసం తండ్రి చెప్పిన మాటలు విని వుంటే ఇంత దూరం వచ్చేది కాదేమో అనుకుని డిగ్రీ పాస్ అయ్యాడు ఎట్టకేలకు.
అప్పటికే 25 ఏండ్లు. ఇంక చదువు ముందుకు సాగదు, ఏదైనా ఉద్యోగం ట్రై చెయ్యాలి అనుకున్నాడు.
కాని అతని వాలకం తెలిసిన వాళ్లెవరూ ఉద్యోగం ఇవ్వడానికి ముందుకు రాలేదు..
ఏదైనా బిజినెస్ చేద్దామన్నా అనుభవం, పెట్టుబడి కావాలి. చిల్లర తిరుగుళ్ళు తిరిగిన దానికి ప్రతి ఫలం.. అనుభవించక తప్పదు అనుకొన్నాడు.
తన చుట్టూ తిరిగిన ఫ్రెండ్స్ ఇప్పుడు మొహం చాటేశారు. జేబులో రూపాయి లేదు.
అమ్మను అడగలేడు.. ఫాదర్‌కి మొఖం చూపెట్టలేడు. బంధువులు, మిత్రులు దూరం పెట్టారు. కాని ఒక విషయంలో అదష్టవంతుడు.
డిగ్రీ క్లాట్‌మేట్ రవళి అంటే ఇష్టం. కాని తన ప్రవర్తన వల్ల ఆమెకి దగ్గర కాలేక పోయాడు. చింటూ మంచి వాడే కాని, తల్లి చేసిన నిర్వాకం వల్ల ఆనాడే అబద్దంతో బురిడి కొట్టించే అలవాటు చేసుకున్నాడు.
తెలివిగలవాడు కావడంతో ప్రైవేట్‌గా కంప్యూటర్‌లో డిప్లొమా చేసాడు. ఒక్కసారి చెపితే జ్ఞాపకం పెట్టుకునే రకం.. అలాంటి అతను ఇంటర్, డిగ్రీ ఫెయిల్ కావడం అనేది కోరి తెచ్చుకున్నది.
అదే ఫోకస్ పెట్టి వుంటే స్టేట్ ర్యాంక్ తెచ్చుకునేవాడు.
మంచైయినా చెడైనా పేరెంట్స్ బాధ్యత, చదువు చెప్పే గురువుల బాధ్యత కూడా ఉంటుంది.
ప్రతి వ్యక్తిని వేరే కోణంలో చూస్తే ఇలా చింటూలా తయారవుతారు. అందుకే ఈనాటి యువత పట్ల జాగ్రత్తగా ఉండాలని అనుకునే కొందరిలో రవళి ఒక అమ్మాయి. తను కాలేజీలో బ్రైట్ స్టూడెంట్.
చింటూ అందం.. అతని మాట.. చూసే కొంటె చూపులకు పడిపోయింది. ఏదో ఇతనిలో స్పెషల్ అట్రాక్షన్ ఉందనుకొని సైడ్‌గా అబ్సర్వ్ చేసింది.
కొద్దిరోజులు పోయాక చింటూ మీద మమకారం పెంచుకుంది. ఎట్లైనా అతనినే పెళ్లి చేసుకోవాలని. కాని ఇలాంటి వ్యక్తికి నన్ను కట్టబెట్టడం ఏ తల్లిదండ్రులకూ ఇష్టం ఉండదు.
అందుకే అతన్ని మార్చుకోవాలి. మనిషిగా తీర్చుదిద్దుకోవాలి. పుట్టుకతో ఎవరూ చెడ్డ వాళ్ళు కాదు. పరిస్థితులు అలా మారుస్తాయి.
తండ్రి ఫిలాసఫీలో లెక్చరర్. అందుకే కొంత వరకు తెలుసు. తల్లితండ్రులతో రెగ్యులర్‌గా డిబేట్ చేస్తుంది. అందుకే ఆమెకి జీవితం పట్ల సరియైన దక్పథం ఉంది.
చింటూ పట్ల ఏదో భావన మొదలైంది. చింటూని మనిషిని చెయ్యాలి.
తను పి.జి పూర్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం మొదలెట్టింది..
చింటూ డిగ్రీ ఫెయిల్ కావడం, పూర్తి చేసే క్రమంలో కంప్యూటర్ కోర్స్‌లు నేర్చుకోవడం.. అలా అప్పుడప్పుడు కలిసే వాళ్ళు.
ఇకా చింటూ అమ్మ సుసైడ్ అటెంప్ట్ తర్వాత చింటూలో వచ్చిన మార్పుతో అతనికి దగ్గరై, సరియైన దారిలో నడిపించే క్రమంలో ప్రేమకి గ్రీన్ సిగల్ ఇచ్చుకున్నారు ఇద్దరు.
ఉద్యోగం ఎవ్వరూ ఇవ్వక పోయేసరికి, రవళి వాళ్ళ డాడీకి చెప్పి కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌లో డీటీపీ ఆపరేటర్‌గా జాబ్ ఇప్పించింది.
ఆమె అందించిన తోడ్పాటుతో తనలో ఉన్న ప్రతిభను బయటకు తీసి అతికొద్ది నెలల్లోనే ఆ ఇన్‌స్టిట్యూట్‌కి సీనియర్ ట్రైనర్‌గా మారాడు..
అతని డెవలప్‌మెంట్ చూసిన పార్వతి, వెంకటేష్ దంపతులకు ఆనందం సముద్రంలా ఉప్పొంగింది.
తన కొడుకు ఎలా దారికి వస్తాడో అని బెంగ పెట్టుకున్న వాళ్లకు అతని పట్టుదల కొత్త ఉత్సాహం ఇచ్చింది.
అతనికి తోడుగా రవళి ఉండడం వాళ్లకు కూడా ఆమెని ఇంటి కోడలుగా తెచ్చుకోవాలి అనుకున్నారు.
మరికొన్ని నెలలు గడిచాయి. కంప్యూటర్ ఓనర్ ఒకరోజు ”చింటూ.. నేను అమెరికా వెళ్లిపోతున్నా. పరిచయం అయిన కొద్ది నెలల్లోనే నీలో ఇంత డెవలప్మెంట్ ఉంది. నాకు చాలా ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి. ఏ పరిస్థితుల వల్లో నీవు ఇలా తయారయ్యావు. చాలా బ్రైట్ స్టూడెంట్‌వి. ఒక్కసారి చూస్తే గుర్తుంచుకుంటావు. చాలా గొప్ప నాలెడ్జి ఉంది. అప్డేట్ అవుతున్నావు. రవళి కూడ నీకు తోడుగా ఉంది. ఆమె వల్ల నీవు ఇంత పేరు తెచ్చుకున్నావు. మీ ఇద్దరు ఒకటయితే చూడాలని వుంది. ఈ ఇన్‌స్టిట్యూట్ నీవే తీసుకో. డబ్బులు ఇప్పుడు కొంత ఇవ్వు. మిగతాది మెల్ల మెల్లగా తీర్చు. నీమీద నమ్మకం ఉంది. ఈ విషయం అలోచించి నిర్ణయం తీసుకో. ఇది నీ జీవితంలో కొత్త మలుపు” అనగానే చింటు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన బాస్ నారాయణ మూర్తి కాళ్లకు దండం పెట్టాడు.
”సరే సార్ ఒకసారి రవళి, మా అమ్మ నాన్నతో మాట్లాడతాను. ఈ సంతోష విషయం చెప్పాలి” అని అక్కడ నుండి ఇంటికి పరుగుపెట్టాడు.
ఫోన్‌లో రవళిని ఇంటికి రమ్మని చెప్పాడు. పనిలో పనిగా మీ అమ్మా నాన్నకి కూడ చెప్పు అన్నాడు.
ఇంటికి వెళ్లి అమ్మ పార్వతికి, నాన్న వెంకటేష్ పాదాలకు దండం పెట్టాడు. కళ్ళల్లో నీళ్లు కారుతున్న దశ్యం చూసిన పార్వతి.. ”ఏమైంది నాన్న” అంది కొడుకుని దగ్గరికి తీసుకుంటూ.
”నాన్న.. మనం ఇప్పుడు ఈ సిటీలో ఫేమస్ కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌కి ఓనర్ అవబోతున్నాం..” అని జరిగిన విషయం చెప్పాడు..
ఆ ఆనందంలో నోటి మాట రాక అలాగే కొడుకుని దగ్గరికి తీసుకున్నారు. ఎక్కడ చెడిపోతాడో.. వాడి జీవితం ఏమై పోతుందో అనే బెంగ పడ్డ వాళ్లకు ఈ శుభవార్త వారికి వెయ్యి ఏనుగుల బలం ఇచ్చింది.
అంతలోనే రవళి, రవళి తల్లీ తండ్రి కూడా వచ్చారు. చింటూకి కంగ్రాట్స్ చెప్పి ఆలింగనం చేసుకున్నాడు రవళి తండ్రి. అందరూ ఆలా ఆనందంగా మాట్లాడుకుంటుంటే ఓనర్ నారాయణ మూర్తి కూడా అక్కడికి వచ్చాడు.
వాళ్ళ సెలెబ్రేషన్స్‌కి కేక్, స్వీట్‌లు తెచ్చి సంబరాలు చేసాడు.
ఆలా ఉప్పొంగిన ఆనంద సాగరంలో నారాయణ మూర్తి రవళితో ”అమ్మా రవళి.. మా చింటూ అంటే ఇష్టమా. మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా” అని అనగానే సిగ్గుతో తల దించుకొని ”పో” అంకుల్ అంటూ ఆమె అమ్మ నాన్న వైపు తిరిగింది. చాటున కొంటె చూపులతో చూస్తూ సైగ చేశాడు చింటూ.
అంతలోనే.. ”సార్.. అంతా అమ్మాయి ఇష్టం. మా అమ్మాయి ఇష్టాన్ని ఎప్పుడూ కాదనలేదు. అన్నీ తెలుసు తనకి. ఇప్పుడు అల్లుడు కూడా ట్రాక్‌లోకి వచ్చాడు. ఈ విషయం మా రవళి ముందే చెప్పింది. ”సరే తల్లీ నీకు తోచింది చేయి. ఇది నీ జీవితం. జాగ్రత్త” అని రవళి తండ్రి అనగానే అందరూ చప్పట్లతో ఓకే చేశారు.
”అబద్దం ఆడాలి.. ఆపద సమయంలో. అది సమయస్ఫూర్తిగా ఉండాలి. కాని పదే పదే అబద్దం చెపితే అది నిజం కూడా అయ్యే ప్రమాదం లేకపోలేదు. ఎంతోమంది ఈ అబద్దాలు ఆడడం వల్ల జీవితాలు పాడుచేసుకుంటున్నారు. జీవించడం కుదరని పక్షంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకే జాగ్రత్త ఉంటూ రేపటి నుండి ఈ ఇన్‌స్టిట్యూట్‌కి నువ్వే ఓనర్ బాబు” అంటూ.. చేతిలో చెయ్యి కలిపి ”కంగ్రాట్స్ చింటూ, నీకు రవళి వుంది. మేమంతా అండగా ఉంటాం. కొత్త టెక్నాలజీ అప్డేట్ చేస్తూ అనేక మందికి జీవితం ఇవ్వు” అంటాడు.
వెళ్లే క్రమంలో రవళి, నారాయణ మూర్తితో ”అంకుల్ మరో శుభవార్త.. ప్రభుత్వం లెక్చరర్‌గా ఉద్యోగం వచ్చింది. ఇప్పుడే మెసేజ్ వచ్చింది” అనగానే ”నారాయణ మూర్తి కాలం కలిసి వచ్చేటప్పుడు నడిచి వచ్చే కొడుకు పుడతాడని అంటారు.
మీ విషయంలో నిజమయ్యింది” అని కంగ్రాట్స్ చెప్పి పెళ్లికి మాత్రం పిలవడం మరిచిపోవద్దు. అంటూ కార్ ఎక్కి వెళ్లి పోయాడు.
అతను వెళ్లిపోతున్న వైపు చూస్తూ.. చేతులు ఊపుతూ ఇంట్లోకి వెళ్లారు అందరు.
అంతలోనే రవళి చెయ్యి పట్టుకొని తన గదిలోకి వెళ్ళిపోయాడు చింటూ. రేపటి జీవితం గురించి డిస్కస్ చేయడానికి తన కలల రాణి, తన గహలక్ష్మిగా రాబోతున్న సంతోషంలో.
వాళ్ళు ఆలా వెళ్ళగానే పెళ్లి గురించి ముచ్చట్లు స్టార్ట్ చేసారు, వారి తల్లిదండ్రులు.
ఆ ఆనందంలో.. ఆకాశంలో వెన్నెల కురిపించడానికి పున్నమి చంద్రుడు వారి ఇంటి వాకిలిలో అడుగు పెట్టాడు.
కె. రవీందర్, 9059237771



