Sunday, November 16, 2025
E-PAPER
Homeనెమలీకఅదీ విష(య)మ్‌

అదీ విష(య)మ్‌

- Advertisement -

ఒకనాడు అపరాజిత దేశానికి చెందిన ముగ్గురు భటులకు, పొరుగు రాజ్యమైన అమరావతి గూఢచారి ఆనందుడు దొరికి పోయాడు. అతణ్ణి బందీగా రాజధానికి తీసుకుపోతూ, అరణ్యంలో ఒకచోట కొద్ది సేపు విశ్రాంతి తీసుకోవాలని పెద్ద మర్రిచెట్టు కింద ఆగారు భటులు.
వాళ్ళు, ఆనందుణ్ణి అక్కడ వున్న చెట్టుకు తాళ్ళతో కట్టివేశారు. అప్పుడే ఆనందుడి వద్ద భటులకు ఒక సంచీ దొరికింది. ఆ సంచీలో వాళ్ళకు ఒక మిఠాయిల పాట్లం కనిపించింది. మిఠాయిల మంచినేతి వాసనతో నోరూరింప సాగాయి.
వాటిని మూడు భాగాలుగా చేసుకుని భటులు తినేందుకు సిద్ధమయ్యారు. అయితే, వాళ్ళల్లో ఒకడు. ఏదో అనుమానం కలిగినట్టు ముఖం పెట్టి, ”ఇందులో ఏదైనా ‘విషం’ కలిసి వుండవచ్చు. తినకండి!” అని హెచ్చరించాడు.

భటులు మిఠాయిని తినడమా, మానడమా అన్న సందిగ్ధంలో పడ్డారు. వాళ్ళను చూసి ఆనందుడు నవ్వి, ”మీకు లేనిపోని అనుమానాలెందుకు? ఒకటి నాకు యివ్వండి. నేను తిన్నాక నాకేమీ కాకపోతే మీరు తినండి” అని భరోసా ఇచ్చాడు.
అతని మాటలు నచ్చడంతో చేతికట్లు విప్పదీసారు. ఆనందుడు ఏమాతం భయపడకుండా వాళ్ళ దగ్గరున్న తన సంచీలోని మిఠాయిని ఆవురావురమని తినసాగాడు. అది చూసిన ముగ్గురు భటులకి నోట్లో నీరు ఊరడం మొదలైంది.
తర్వాత అతడికి మంచినీళ్ళు కూడా యిచ్చారు. పావుగంట కాలం గడిచినా. ఆనందుడిలో ఎలాంటి మార్పూలేదు. ఇది గమనించిన భటులు, తమ అనుమానానికి స్వస్తిచెప్పి, మిఠాయిని సంతోషంగా తినేశారు.

కొంత సేపు తర్వాత భటులు, ఆనందుణ్ణి వెంటబెట్టుకుని బయలుదేరారు. దారిలో ఒకచోట ఆనందుడు కుప్పకూలి, కాళ్ళూ చేతూలూ కొట్టేసుకుంటున్నాడు. భటులు ఎక్కడలేని ఆశ్చర్యంతో భయంతో అయోమయంగా అతడికేసి చూడసాగారు.
అప్పుడు ఆనందుడు వాళ్ళతో, ”మీరు నన్ను వదిలిపెట్టరని, నాకు తెలుసు. రాజధానికి తీసుకుపోయి మా దేశ రహస్యాలు చెప్పమని నన్ను చిత్రహింసలకు గురిచేస్తారు. ఇలాంటి ప్రమాదం రావచ్చని నేను ముందే ఊహించి, విషం కలిపిన మిఠాయి వుంచుకున్నాను. ఈ విషం వెంటనే పనిచెయ్యదు. కాస్త నెమ్మదిగా కడుపులోకి చేరి తర్వాత రక్తంలో కలిసి ప్రాణాలు హరిస్తుంది. అందువల్లనే, ఇప్పటిదాకా బాగా ఉన్నాను. మరికాసేపట్లో ప్రాణాలు పోతాయి. నా మాటలు నమ్మి, మీరు మిఠాయి తిన్నారు. ఆ తర్వాత మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. రేపటినుంచి మనం పైలోకంలో కలిసి కులాసాగా కబుర్లు చెప్పుకుందాం” అంటూ గిలగిలా కొట్టుకుంటూ వగరుస్తూ అరవసాగాడు.

ఇది విని భటులు ముగ్గురూ కొయ్యబారిపోయారు. ఆనందుడికి కాళ్ళూ, చేతులూ కొట్టుకోవడం మరింత ఎక్కు వయింది.
భటుల్లో ఒకడు, మిగతా ఇద్దరితో, ”ఈ గూఢచారి బాగా మోసగించి, మన ప్రాణాలకే ఎసరుపెట్టాడు. అతను తిన్నాక తిన్నాం కాబట్టి కొంతసేపట్లో మనం ఇలాగ కాళ్ళు చేతులూ కొట్టుకుని చస్తాం. అతను తిన్నాక గదా మనం మిఠాయి తిన్నది. విషప్రభావం మన మీద పని చేయడానికి, మరికొంత సమయం పట్టవచ్చు. అయినా, యిప్పుడేం చేయడం?” అన్నాడు ముగ్గురిలో ఒకడు బెంబేలుపడిపోతూ.
”తొందరగా దగ్గర్లోని ఏదైనా ఊరు ఉంటే వైద్యుణ్ణి కలుసుకోవాలి. మనకి కొంత సమయం మాత్రమే ఉంది” ఒక భటుడు తొందర పెట్టాడు.

”ఈ దుర్మార్గుణ్ణి యిక్కడే చావనిద్దాం. ఏ జంతువో, వీడి శవాన్ని తినేస్తుంది. మనం ప్రాణాలు కాపాడుకోవాలి గనక, యీ చుట్టుపక్కల ఏదైనా గ్రామం వున్నదేమో చూసి, అక్కడి వైద్యుడి చేత చికిత్స చేయించుకుందాం” అన్నాడు ఇంకొక భటుడు.
”దయచేసి నన్నూ మీతో తీసుకెళ్ళండి”… బతిమిలాడసాగాడు ఆనందుడు.
అతని వాలకం చూసి ప్రాణ భయంతో ముగ్గురు భటులు అక్కడి నుంచి పరిగెత్తిపోయారు. వాళ్ళు వెళ్ళిన కొంత సేపటికి ఆనందుడు నవ్వుకుంటూ లేచి కూర్చున్నాడు.
నిజానికి ఆ మిఠాయిలో విషం లేదు. తన పథకం బాగా పారినందుకు సంతోషిస్తూ, తన దేశ సరిహద్దులకేసి బయలుదేరాడు.
నిరాశావాది తనకు ఎదురైన ప్రతి అవకాశంలో ఉన్న ఇబ్బందిని గురించి ఆలోచిస్తాడు. కానీ ఆశావాది తనకు ఎదురైన ఇబ్బందుల్లోనూ అవకాశాలను వెతుక్కుంటాడు.

సాయి ఆదిత్య వైనతేయ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -