Sunday, November 16, 2025
E-PAPER
Homeసోపతిఆవకాయ గొప్పతనాన్ని చాటిన పాట

ఆవకాయ గొప్పతనాన్ని చాటిన పాట

- Advertisement -

మన తెలుగింటి రుచుల్లో ఆవకాయకు ప్రత్యేకమైన స్థానముంది. మనకు తినడానికి ఎన్ని వంటకాలున్నా ఆవకాయ లేకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంటుంది. ఆవకాయ లేకుంటే అన్నం ముద్ద ముట్టమని మారాం చేసేవాళ్ళూ ఉన్నారు. ఆవకాయ రుచి అంత గొప్పది మరి. అలాంటి ఆవకాయ కోసం ఆంజనేయుడే ఆరాటపడ్డాడని చెబుతూ సింహాచలం మన్నెల ఓ పాట రాశాడు. 2024 లో ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హనుమాన్‌ ‘ సినిమాలోని ఆ పాటనిపుడు పరిశీలిద్దాం.

సింహాచలం మన్నెల ఎంతో అర్థవంతంగా, భావగర్భితంగా ఈ పాటను రాశాడు. ప్రతీ పదాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ వింటే తప్ప ఈ పాట అంత తొందరగా అర్థం కాదు. సంగీతం, సాహిత్యం రెండూ అద్భుతంగా ఉన్నాయి కాబట్టే ఈ పాట అంత పాపులర్‌ అయ్యింది. అయితే.. సినిమాకథ పరంగా చూసినట్లయితే.. హీరో, హీరోయిన్‌ లపై దాడి చేసిన విలన్‌ ల గ్యాంగ్‌ ను హీరో చితకబాదుతూ ఉంటాడు. ముసలి వయసులో ఉన్న బామ్మలంతా చేరి ఆవకాయ పెడుతుంటారు. ఆవకాయ పెట్టేటప్పుడు ఉపయోగించే పదార్థాలన్నింటిని గురించి పాటలో భాగంగా వివరిస్తారు. ఆ పదార్థాలకు, హీరో విలన్లను కొట్టే సందర్భాన్ని అన్వయించి పాట రాసినట్లుగా ఇక్కడ కనబడుతోంది. ఆవకాయ పెట్టడం, హీరో విలన్లను కొట్టడం రెండూ ఒకేసారి ప్రారంభమవుతాయి. ఇక్కడ ఆంజనేయుడిని హీరోకి ప్రతీకగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా..మామూలుగా ఈ పాట విన్నా గాని ఆంజనేయుడికి ఆవకాయ అంటే ఇష్టమని, తల్లి అంజనాదేవి ఆవకాయ పెడుతుంటే ఆంజనేయుడు సహాయపడ్డాడనే సందర్భమూ పాటలో స్పష్టంగా స్ఫురిస్తోంది. ఆ సందర్భాన్ని బట్టే ఆ పాటను చూద్దాం.

ఆవకాయ పెడదామని అంజనాదేవి మామిడికాయల్ని ముందర వేసుకోగానే ఆంజనేయుడు కూడా వచ్చి తన తల్లికి సహాయపడుతుంటాడు. తన శక్తినంతా ఉపయోగించి చెట్టు మీద ఉన్న కాయల్ని దులిపాడు. ఎరుపురంగులో దేదీప్యమానంగా మెరుస్తూ, కోతి అవతారంలో ఉన్న ఆ భగవంతుని మాయ ఎంత గొప్పది. అసలు కత్తిలేకుండానే కాయలన్నింటిని ముక్కలు ముక్కలుగా కోశాడు. అంజనమ్మ ముందు మేలైన మామిడి కాయలన్నీ పోశాడు. మామిడిలో జీడి వంకలెన్నో ఉన్నాయి. వాటన్నింటిని పులిగోరు లాంటి పళ్ళతో పరపరా తీసేసాడు. హనుమంతుడికున్న బలం అంతటిది మరి. అతని శక్తిని గురించి చెప్పడం దేవాధిదేవుళ్ళకే సాధ్యం కాలేదు. అతని మహిమ గురించి ఏమని చెప్పగలం. అతని కోపం, అతని శక్తి రెండూ తట్టుకోవడం కష్టమే. సముద్రం లెక్కచేయకుండా గర్వంతో నేను కల్లుప్పును వదలను అని విర్రవీగుతుంటే ఆ సముద్రానికున్న అహంకారాన్ని అణచడానికి తన తోకను వదిలాడు. ఆ తోక కెరటాలను ఆపింది. కెరటాలనుంచి ఉప్పును విడదీసింది. ఆ ఉప్పుపంటను తీసుకొచ్చి ఒడ్డున వేశాడు. అది హనుమంతుని తోకకున్న బలం. అతని తోకకే అంత బలముంటే మరి అతనికెంత బలముంటుందో కదా..

అంజనాదేవి మామిడికాయ ముక్కల్ని జాడీలో వేసి, కలుపుతుంటే ముక్కలు మునిగి గొడ్డుకారం పైకి వచ్చి గాలి ద్వారా వీస్తుంటే కంటిరెప్పలకంటకుండా గాలివాటాన్ని తిప్పాడు. గండుపిల్లిలాగా నక్కి నక్కి ధూళి అకస్మాత్తుగా ఎగిరెగిరి వస్తే అడ్డంగా నిలబడి నోటితో మింగేశాడు ఆంజనేయుడు. కాకి కూతల వల్ల, గోర చప్పుళ్ళ వల్ల ఆవకాయ తంతు జరగకుంటే మెంతులేసే అంతలోన గద పైకెత్తి పిట్టల్ని కొట్టాడు. వాటివల్ల కాకికూతల శబ్దాలు ఆగిపోయి ఆవకాయ తంతు సాగిపోయింది. నువ్వులు అనే దిష్టిబొమ్మలు పచ్చడివైపు చూసి దిష్టిపెట్టాయట. వెల్లుల్లిపాయల రెబ్బల జబ్బలిరిసి, కుండపెట్టి నూనెలో వేశాడంట. అలా..నోరూరించే ఆవకాయ సిద్ధమవ్వగానే సట్టినిండా ఆవకాయను కుక్కి ఉట్టి మీద పెట్టగానే ఆంజనేయుడు ఆగలేకపోయాడట. రుచి చూద్దామని ఆవజాడ తీసి చప్పరించాడట. అంతలా ఆంజనేయుడిని ఆవకాయ మురిపించిందని కవి రాసిన పాట చెబుతోంది.

ఐతే..చివరలో..హీరోయిన్‌ ని దష్టిలో పెట్టుకుని చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. హీరో విలన్లని కొట్టడం పూర్తయ్యే సరికి ఆవకాయ సిద్ధమైపోయింది. ఆ ఆవకాయను హీరో అనే ఆంజనేయుడు రుచి చూసినట్టుగా కూడా చెప్పబడింది. తాను రుచి చూశాక ఆవకాయని హీరోయిన్‌ కి కూడా అన్నంలో కలిపి తినిపిస్తాడు. కొత్త ఆవకాయ రుచి అమోఘం. అదో కొండంత మాయ. అందునా హీరో ప్రేమ మాయలోనూ ఉన్నాడు. ఒప్పుల కుప్ప అయిన హీరోయిన్‌ కి వడ్డించమని, అది తింటున్నప్పుడు ఆమె చెంపల్లోని కెంపు సొంపులను చూడమని చెబుతున్నాడు కవి.
ఈ పాట హీరోని ఆంజనేయుడిగా చూపిస్తూ రాయబడింది. ఇందులో హీరో ఆంజనేయశక్తిని ఆవహించుకుని ఉంటాడు. కాబట్టి సింబాలిక్‌ గా ఈ పాట రాయబడింది. ‘తోకతోటి కెరటమాపి ఉప్పుపంట ఒడ్డునెండేయడం’, ‘గొడ్డుకారం కంటిరెప్పనంటకుండా గాలివాటం తిప్పడం’, ‘గండుపిల్లి ధూళి’, ‘కాకి కూతలకు మెంతులేసెనంతలోనే పిట్టలెల్లగొట్టడం’, ‘నువ్వు డొంక దిష్టిపెట్టడం’, ‘వెల్లుల్లి రెబ్బల్ల జబ్బలిరిసే’…వంటి భావాలు చాలా వినూత్నంగా ఉన్నాయి. చిరకాలంగా నిలిచిపోయే గొప్ప పాటను మనకు అందించాడు సింహాచలం మన్నెల.

పాట:
ఆవకాయ ఆంజనేయా కథ మొదలెట్టినాడు సూడరయ్యా/ శక్తినంతా కూడగట్టి సెట్టు దులిపినాడు అంజయ్యా/ ఎర్ర ఛాయా ఎర్ర ఛాయా కోతి అవతారమెంత మాయా/కత్తి సేత పట్టకుండా కాయకోసినాడు కపిలయ్యా/ అంజనమ్మ ముందు వంజుల్‌ పుంజుల్‌ / జీడి మామిడి ముక్కలు కుప్పల్‌ తెప్పల్‌/ టెంకలోని జీడి వంకలెన్నున్నా పులిగోరు పళ్ళతో పరపరతీసాడురో/ అంజనాద్రి హనుమంతో నీ సురుకు సెప్పలేనంతో/ అంజనాద్రి హనుమంతో నీ శక్తి లెక్క చెప్పలేనంతో/ బక్కవాటం లెక్కసేయక కల్లుప్పు కడలి వదలనంటే/ తోకతోటి కెరటమాపి ఒడ్డు నెండేసాడు ఉప్పుపంట/ గొడ్డుకారం గొడ్డుకారం ముక్క మునిగి పైకి పొక్కుతుంటే/ సిన్నితల్లి కంటిరెప్పనంటకుండా తిప్పెగాలివాటం/ ఆవపిండి అంత చల్లి చల్లి ఆరబెట్టినాది తల్లి తల్లి/ గండుపిల్లి ధూళి గట్టిగెగిరొస్తే అడ్డుగా నిలుచుని అంగుటతో మింగాడురా/ కాకికూతలు గోర చప్పుళ్ళు ఆవకాయ తంతు జరగతుంటే/ మెంతులేసేనంతలోనే పిట్టలెల్లగొట్టినాడు గదయెత్తి/ నువ్వు డొంక దిష్టిబొమ్మ పచ్చడొంక సూసి దిష్టిపెడితే/ వెల్లుల్లి రెబ్బల్ల జబ్బలిరిసె నూనె తెండినాడురో కుండెట్టి/ సట్టినిండా సరుకు కుక్కి కుక్కి ఉట్టినెట్టి ముగ్గెట్టి ఎట్టి/ అంతపెద్ద దేవుడస్సలాగలేకా/ ఆవజాడి తీసి రుస్సప్పరించాడురో/ కొత్త ఆవకాయ కొండంత మాయ/ ఒప్పుల కుప్పకు వడ్డించరయా/ కొత్త ఆవకాయ కొండంత మాయ/సెంపలోన కెంపూ సొంపు సూడయా..

  • డా||తిరునగరి శరత్‌చంద్ర,
    [email protected]
    సినీ గేయరచయిత, 6309873682
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -