బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలముంటే మంత్రి అజారుద్దీన్‌కు టికెట్ ఎందుకివ్వలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి చాలా సర్వేల్లో రేవంత్‌రెడ్డి కంటే నవీన్ యాదవ్‌కు ప్రాబల్యం ఎక్కువ అని తేలిందన్నారు. కానీ రేవంత్‌రెడ్డి గెలిచినట్టు ప్రజలను మభ్య పెడుతున్నారని అన్నారు. అధికార దుర్వినియోగం వల్లే కాంగ్రెస్ గెలిచిందని చెప్పారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ నుంచి శ్రీగణేశ్‌ను పట్టుకొచ్చి టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. గద్దర్‌ను వాడుకుని ఆయన బిడ్డకు ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదన్నారు.
గద్దర్ మీద గౌరవం ఉంటే, ప్రజాపాలనపై విశ్వాసం ఉంటే గద్దర్ బిడ్డ వెన్నెలకు టికెట్ ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లో కూడా అజారుద్దీన్‌కు టికెట్ ఇవ్వకుండా నవీన్ యాదవ్‌కు టికెట్ ఇచ్చారని అన్నారు. సొంత పార్టీలో ఉన్న వారిని ఖతం చేస్తూ బీజేపీ, ఎంఐఎం వారితో రేవంత్‌రెడ్డి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ గెలిచారనీ, రేవంత్‌రెడ్డి గెలవలేదని చెప్పారు. కాంగ్రెస్ పథకాలు అమలు చేయకపోయినా గెలిచానని సీఎం అనుకుంటే పొరపాటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు గౌతం ప్రసాద్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



