Sunday, November 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంచేపల స్టోరేజ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తాం

చేపల స్టోరేజ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తాం

- Advertisement -

చెరువుల వద్ద సైన్‌ బోర్డులు : మంత్రి వాకిటి శ్రీహరి
హుస్నాబాద్‌ అభివృద్ధికి కృషి : మంత్రి పొన్నం ప్రభాకర్‌
ఎల్లమ్మ చెరువులో 3 లక్షల చేప పిల్లలు విడుదల

నవతెలంగాణ-హుస్నాబాద్‌
హుస్నాబాద్‌లో మత్స్య సంపద అభివృద్ధి చెందేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చేపల మార్కెట్‌లో స్టోరేజ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మత్స్య, పశుసంవర్ధక శాఖమంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ చెరువులో రూ.5.17 లక్షల విలువ చేసే మూడు లక్షల చేపపిల్లలను మంత్రి పొన్నంతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉచిత చేపపిల్లల పంపిణీ ద్వారా ఎల్లమ్మ చెరువులో విడుదల చేసిన చేపపిల్లలతో 253 మంది మత్స్యకారుల కుటుంబాలకు లబ్ది చేకూరనుందన్నారు. నియోజకవర్గంలోని మొత్తం 165 చెరువుల్లో 38.92 లక్షల ఉచిత చేపపిల్లలను విడుదల చేయనున్నామని, దీంతో 4,144 మంది మత్స్యకారుల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మత్స్య శాఖ కీలకంగా మారేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు.

ఇప్పటికే నియోజకవర్గంలో ఇందిరా మహిళాశక్తి పథకం ద్వారా మహిళా సంఘాలకు 3 మొబైల్‌ ఫిష్‌ రిటైల్‌ అవుట్‌లెట్స్‌ అందించామని తెలిపారు. అంతేకాకుండా మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి గ్రూప్‌ యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ద్వారా రూ.5లక్షల బీమా ద్వారా బాధిత కుటుంబానికి భరోసా కల్పిస్తున్నట్టు తెలిపారు. మత్స్యశాఖకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.123 కోట్లు కేటాయించారనీ, అందుకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ కీలకపాత్ర పోషించారని తెలిపారు. ఈ బడ్జెట్‌లో 84 కోట్ల చేపపిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలు, రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేశామన్నారు. గతంలో చేపపిల్లల పంపిణీలో అవకతవకలు జరిగాయనీ, ఈసారి అంతా పారద ర్శకంగానే జరుగుతోందని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. గురుకులాల్లో మటన్‌, చికెన్‌ లాగా చేపలు కూడా మెనూ ఉండాలని ఇటీవల మంత్రి వాకిటి శ్రీహరి లేవనెత్తిన అంశాలపై చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

హుస్నాబాద్‌లో టూరిజంను అభివృద్ధి చేస్తున్నామని, ఇక్కడికి వచ్చే వారు చేపలు కొనేలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ఈ ప్రాంతంలో అధునాతన వెటర్నరీ హాస్పిటల్‌ నిర్మించాలని, అసంపూర్తిగా ఉన్న మోడ్రన్‌ చేపల మార్కెట్‌ను పూర్తిచేయాలని, వెటర్నరీ డాక్టర్‌ పోస్టు మంజూరు చేయాలని, గోపాల మిత్ర సమస్యలు పరిష్కరించాలని మంత్రి వాకిటి శ్రీహరికి విజ్ఞప్తి చేశారు. పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తికి స్పందించిన మంత్రి శ్రీహరి.. హుస్నాబాద్‌ పశువైద్యశాల ఆధునీకరణ, చేపల మార్కెట్‌, స్టోరేజ్‌ సెంటర్‌, పాల శీతలీకరణ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఫిషరీస్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ మెట్టు సాయికుమార్‌ మాట్లాడుతూ.. చేపల పంపిణీలో అవినీతికి తావులే కుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మంత్రుల మార్గద ర్శకత్వంలో పారదర్శకంగా చేపపిల్లల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ హైమవతి, గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ లింగమూర్తి, హుస్నాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ తిరుపతి రెడ్డి, కోహెడ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ నిర్మలా జయరాజ్‌, సింగిల్‌ విండో చైర్మెన్‌ శివయ్య, మత్స్య సహకార సంఘం నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -