*ఎడిజె చంద్రశేఖర్ రావు
నవతెలంగాణ మిర్యాలగూడ
మూడు నెలలకోసారి జరిగే జాతీయ లోక్ అదాలత్ కాక ప్రతి రోజు కోర్టుల్లో లోక్ అదాలత్ లు నిర్వహిస్తారని సద్వినియోగం చేసుకోవాలని మిర్యాలగూడ ఐదో అదనపు జిల్లా జడ్జి కెవి.చంద్రశేఖర్ రావు అన్నారు. శనివారం స్థానిక కోర్టు సముదాయ ఆవరణలో ప్రత్యేక లోక్ అదాలత్ ను ప్రారంభించి మాట్లాడుతూ పెండింగ్ కేసుల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న లోక్ అదాలత్ లో కక్షిదారులు, ఫిర్యాదుదారులు పరస్పరం చర్చించి రాజీమార్గంలో దీర్ఘకాలిక పెండింగ్ కేసులను పరిష్కరించుకోవాలని కోరారు.
మోటార్ వెహికల్ యాక్ట్ కింద ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి రూ. 5లక్షలు క్లెయిమ్ చేస్తూ కేసు వేశారని రాజమార్గంలో రూ.2.35లక్షలు పొందారని ఆయనను ఆదర్శంగా తీసుకుని పరిష్కార దిశగా వెళ్లాలని, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా పరిష్కరించూసుకోవాలని ఆయన కోరారు. అదనపు జిల్లా కోర్టు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల్లో ఎడిజె చంద్రశేఖర్ రావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పవన్ కుమార్, రెండో జూనియర్ సివిల్ జడ్జి అరుణ్ తేజ్ లు సివిల్ 2, క్రిమినల్ 20, డిడి, పెట్టి కేసులు 528 పరిష్కరించారు.
అదాలత్ లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు దీపారాణి, సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నేతి సత్యనారాయణ, ఎ.భూపతిరెడ్డి, ఒన్ టౌన్ ఇన్స్పెక్టర్ నాగభూషణరావు, రూరల్ ఇన్స్పెక్టర్ పిఎన్డి. ప్రసాద్, ఎస్ఐ ఏం. లక్ష్మయ్య, వాడపల్లి ఎస్ఐ సతీశ్ రెడ్డి, న్యాయవాదులు వేలాద్రి, సిహెచ్.రఘురామారావు, ఎండి.ఇబ్రహీం, రాయారపు భాస్కర్ నాయుడు, కొంక వెంకన్న, నాగరాజు, పి.కిరణ్, జె. ఎల్లయ్య, ఎ.లచ్చిరాం, బివి.రవి పాల్గొన్నారు.



