Monday, November 17, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమెక్సికోలో జెన్‌-జెడ్‌ నిరసనలు

మెక్సికోలో జెన్‌-జెడ్‌ నిరసనలు

- Advertisement -

దేశంలో నేరాలు, అవినీతికి వ్యతిరేకంగా ఆందోళన
అధ్యక్షురాలు రాజీనామా చేయాలని డిమాండ్‌
పెద్ద ఎత్తున పాల్గొన్న యువత
పోలీసులు, నిరసనకారులకు మధ్య ఘర్షణ
120 మందికి గాయాలు

మెక్సికోసిటీ : ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జెన్‌-జెడ్‌ నిరసనలు అక్కడి ప్రభుత్వాలను వణికిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆందోళనలు మెక్సికోకూ పాకాయి. దేశంలో పెరుగుతున్న నేరాలు, అవినీతికి వ్యతిరేకంగా, చట్టరక్షణలో ప్రభుత్వ వైఫల్యంపై జెన్‌-జెడ్‌ నిరసన గళం విప్పింది. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిపింది. దేశంలో హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ అధ్యక్షురాలు క్లాడియా షిన్‌బామ్‌ రాజీనామా చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో వారు అధ్యక్ష భవనం నేషనల్‌ ప్యాలెస్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. ఈ చర్యతో నిరసనకారులను అణచివేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. వారిపై టియర్‌గ్యాస్‌ ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో 100 మంది పోలీసులకు గాయాలయ్యాయని అక్కడి అధికారులు చెప్పారు. వీరిలో 40 మంది ఆస్పత్రి పాలయ్యారని వివరించారు.అలాగే మరో 20 మంది యువత గాయ పడ్డారనీ, 20 మందిని అరెస్ట్‌ చేసినట్టు చెప్పారు.

నిరసనలు దేనికి?
ఈనెల 1న మెక్సికో పశ్చిమ రాష్ట్రమైన మికోకాన్‌లోని ఉరుపాన్‌ నగర మేయర్‌.. కార్లోస్‌ మంజో దారుణ హత్యకు గురయ్యారు. నేరాలకు వ్యతిరేకంగా పోరాడిన ఈయన మరణం.. సంచలనంగా మారింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను దుండగులు కాల్చి చంపారు. దీంతో కార్లోస్‌ మంజో దారుణ హత్య దేశవ్యాప్తంగా యువతలో ఆగ్రహావేశాల్ని రేపింది. ప్రభుత్వాలు హింసను అరికట్టడంలో విఫలమయ్యాయని ఆందోళనలకు దిగారు. మెక్సికో సిటీతో పాటు పలు నగరాల్లో వేలాది మంది యువత ప్రదర్శనలు చేపట్టారు. ఈ ఆందోళనల్లో భాగంగానే నిరసనకారులు అధ్యక్ష భవనం ముట్టడికి ప్రయత్నించారు. కాగా షీన్‌బామ్‌ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో ఆమెకు 70 శాతానికి పైగా అప్రూవల్‌రేటింగ్‌ ఉన్నది. అయినప్పటికీ పెరుగుతున్న నేరాలు, అవినీతి వంటి అంశాలు ఆమెకు ప్రతికూలంగా మారాయి. ఇందులో భాగంగా తాజా ఆందోళనలు చోటు చేసుకున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.

ఫిలిప్పీన్స్‌లో అవినీతిపై భారీ పోరాటం
ప్రాజెక్టుల్లో జరిగిన వేల కోట్ల రూపాయల అవినీతికి వ్యతిరేకంగా ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలా దద్దరిల్లింది. వేలాది మంది ఆందోళనాకారులు రోడ్డెక్కారు. ఈ భారీ అవినీతి విషయంలో ప్రభుత్వ జవాబుదారీతనాన్ని డిమాండ్‌ చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇగ్లీసియా ఎన్‌ఐ క్రిస్టో ఆధ్వర్యంలో జరిగిన మూడు రోజుల ర్యాలీ శనివారం ప్రారంభమైంది. దాదాపు 27వేల మంది మనీలాలోని రిజాల్‌ పార్క్‌లో గుమిగూడారు. ఫ్లడ్‌ కంట్రోల్‌ పేరిట నకిలీ ప్రాజెక్టులు చేపట్టారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ప్రమాణాలనూ పాటించలేదని ఆరోపించారు. ఈ నిరసనలో ప్రధానంగా ప్రభుత్య పర్యవేక్షణను కోరారు. వరద-నియంత్రణ ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగిందని ఆందోళనాకారులు ఆరోపించారు.

ప్రాజెక్టులను దక్కించుకోవడం కోసం రాజకీయ నాయకులు, అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి కంపెనీలు ప్రయత్నించాయనీ, ఇందులో వందల కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. ఈ మేరకు నిరసనకారులు ప్లకార్డులను చేతబూనీ, అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు వినిపించారు. ప్రభుత్వ జోక్యాన్ని కోరారు. ఈ కుంభకోణంలో ప్రధానంగా పలువురు ప్రభుత్వ పెద్దలు, ఎంపీలు, వ్యాపారవేత్తల పేర్లు వినిపిస్తున్నాయి. కాగా ఆ దేశ అధ్యక్షుడు మార్కోస్‌ మాట్లాడుతూ.. దోషులు క్రిస్మస్‌కు ముందే జైలులో ఉంటారని హెచ్చరించారు. అధ్యక్షుడు ఏర్పాటు చేసిన స్వతంత్ర కమిటీ ఇప్పటికే 37 మందిపై అవినీతి కేసులు పెట్టగా.. 86 మంది కాంట్రాక్టర్లపై భారీ పన్ను ఎగవేత కేసులు నమోదయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -