భారీ సంఖ్యలో కార్మికుల తొలగింపు
అక్టోబర్ 10-నవంబర్ 14 మధ్య 27లక్షల మంది ఔట్
ఏపీ నుంచి అత్యధికంగా 15.2 లక్షల మంది
న్యూఢిల్లీ : గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఎంతోగానో ఉపయోగపడే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)పై మోడీ సర్కారు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది. గత కొన్నేండ్లుగా ఈ పథకాన్ని నీర్చు గార్చే విధంగా కొత్త కొత్త నిబంధనలను తీసుకొస్తూ లబ్దిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నది. కేంద్రం చర్యలతో లక్షలాది మంది లబ్దిదారులు ఈ పథకానికి దూరమవుతున్నారు. గతనెల 10 నుంచి ఈనెల 14 మధ్య దేశ్యాప్తంగా 27 లక్షల మంది ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కార్మికుల పేర్లను డేటా బేస్ నుంచి తొలగించినట్టు తెలుస్తున్నది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచే అత్యధికంగా 15 లక్షల తొలగింపులు జరగటం గమనార్హం. దీంతో కేంద్రం చేపట్టిన ఈ-కేవైసీ, కొత్త డిజిటల్ విధానాలే లబ్దిదారులను ఈ పథకం నుంచి దూరం చేస్తున్నాయని సామాజిక కార్యకర్తలు, మేధావులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సమయంలో 10.5 లక్షల మంది కార్మికులు మాత్రమే కొత్తగా పథకంలోకి చేరారు. కాగా కార్మికుల తొలగింపు అసాధారణంగా ఉన్నదని సామాజిక కార్యకర్తలు, మేధావులతో కూడిన లిబ్ టెక్ అనేపరిశోధనా సంస్థ వెల్లడించింది. గత ఆరు నెలల్లో 15 లక్షల తొలగింపులు జరగగా.. ఒక్క నెలలోనే 27 లక్షల మంది కార్మికులు తొలగింపునకు గురయ్యారని సమాచారం. అంటే దాదాపు రెండు రెట్ల తొలగింపులు జరిగాయి. ఇది పలు అనుమానాలను రేకెత్తిస్తున్నదని సామాజిక కార్యర్తలు అంటున్నారు. లిబ్‌టెక్ విశ్లేషణ ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆరు మాసాల్లో మొత్తంగా 83.6 లక్షల మంది కార్మికులు (నెట్ ఆడిషన్) చేరారు. తొలగింపులు 15.2 లక్షలుగా ఉన్నది. నవంబర్ నెల మధ్య వరకు చూస్తే కార్మికుల చేరికలు 66.5 లక్షలకు పడిపోయాయి. దీంతో ఒక్క నెలలోనే 17 లక్షల మంది కార్మికులు పథకానికి దూరమయ్యారు.
ఈ-కేవైసీ పూర్తయిన రాష్ట్రాల నుంచి తొలగింపులు అధికం
కాగా ఈ-కేవైసీ పూర్తి చేసిన రాష్ట్రాల్లో ఈ తొలగింపులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 78.4 శాతం మంది ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోగా.. అత్యధికంగా 15.92 లక్షల మంది కార్మికులు తొలగింపునకు గురయ్యారు. ఆ తర్వాత 67.6 శాతంతో రెండో స్థానంలో ఉన్న తమిళనాడు నుంచి 30,529 మంది, 66.6 శాతంతో మూడో స్థానంలో ఉన్న ఛత్తీస్‌గఢ్ నుంచి 1.04 లక్షల మంది కార్మికులు డేటా బేస్ నుంచి తొలగించబ డ్డారు. అయితే కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మాత్రం ఈ తొలగింపులకు, ఈ-కేవైసీకి సంబంధం లేదని చెప్తోంది.
పథకంలో కొత్త సమస్యలు
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్‌ఎంఎంస్ యాప్ ద్వారా కార్మికులు రోజుకు రెండుసార్లు ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయాలి. కానీ పరిశీలనలో అనేక లోపాలు, సమస్యలు బయటపడ్డాయి. అసలు పనితో సంబంధం లేని ఫొటోలు, ఒకే ఫొటోను పలుసార్లు వాడటం, ఉదయం, మధ్యాహ్నం ఫొటోల్లో కార్మికుల సంఖ్యలు భిన్నంగా ఉండటం, మహిళలు, పురుషుల నిష్పత్తిలో అసమానతలు వంటివి ఇందులో ఉన్నాయి. ఇక 2023 నుంచి తప్పనిసరి చేసిన ఆధార్ ఆధారిత చెల్లింపులతోనూ కార్మికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అధికార పత్రాల్లో ఒక్క అక్షరం భిన్నంగా ఉన్నా.. చెల్లింపులు నిలిచిపోయే పరిస్థితులు ఈ పథకంలో ఉన్నాయి.



