మాట మార్చిన సీసీఐ..
నేటి నుంచి పత్తి, జిన్నింగ్ మిల్లులు బంద్
తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకటన
కలెక్టర్, అధికారులకు వినతిపత్రాలు అందజేత
నవతెలంగాణ-నల్లగొండ/ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధులు
పత్తి కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అవలంబిస్తున్న కొత్త నిబంధనలపై ఓవైపు పత్తి రైతులు, మరోవైపు జిన్నింగ్ మిల్లర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త నిబంధనలను ఎల్-1, ఎల్-2, ఎల్-3 కేటగిరీలను తొలగించి, రైతులకు అనుకూలంగా కపాస్ యాప్‌లో మార్పులు తీసుకొస్తాం… సమయం ఇవ్వండి పత్తి కొనుగోళ్లకు సహకరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, అధికారులు పత్తి జిన్నింగ్ మిల్లుల యజమాను లను కోరారు. దీంతో ఈనెల 6 నుంచి పత్తి కొనుగోళ్లను బంద్ చేయాలనే నిర్ణయాన్ని విరమించుకున్నారు. పది రోజులు గడిచినప్పటికీ కొత్తగా తెచ్చిన నిబంధనలో మార్పు లేదని, ఎల్-1, ఎల్-2, ఎల్-3 కేటగిరీలను తొలగించక పోవడంతో ఆసోసియేషన్ పత్తి కొనుగోళ్లను సోమవారం నుంచి బంద్ పాటించాలని నిర్ణయం తీసుకుంది.
ఈనెల 17 (సోమవారం) నుంచి నేటి నుంచి పత్తి, జిన్నింగ్‌మిల్లుల నిరవధిక బంద్ చేయడానికి తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకటన చేసింది. ఈ విదానాన్ని పూర్తిగా ఎత్తి వేసి రాష్ట్రంలోని 322 జిన్నింగ్ మిల్లుల ద్వారా పత్తి కొనుగోళ్లు చేపట్టేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు కొనుగోళ్లు చేపట్టమని అసోసియేషన్ పేర్కొంది. జిల్లా కలెక్టర్లకు, సంబంధిత అధికారులకు బంద్ నోటీసులు అందజేశారు. అన్ని కేటగిరీల జిన్నింగ్ మిల్లులను తెరిపించడం వల్ల స్లాట్ బుకింగ్‌లు అధికమై మార్కెట్‌లకు పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉంటుంది. తక్కువ జిన్నింగ్‌లు తెరవడంతో రైతులు పత్తి విక్రయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాట్‌మెంట్, యాప్ రిజిస్ట్రేషన్, తేమ శాతం పరిమితి వంటి నిబంధనలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజుకో కొత్త రూల్ తీసుకువచ్చి రైతులను, జిన్నింగ్ మిల్లు యాజమాన్యాలను ఇబ్బందుల పాలు చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
రైతుల ఇబ్బందులు.. నిబంధనలతో జిన్నింగ్ మిల్లులకు ప్రమాదం
ఎకరానికి ఏడు క్వింటాళ్లు మాత్రమే కోనుగోలు చేస్తామని నిబందన పెట్టడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఉష్ణోగ్రతలు పడిపోయి 12 శాతం లోపు మాయిశ్చర్ రాదు.. ఇప్పుడు సీసీఐ కొనుగోలు చేయదు..తాము ఎక్కడికి పోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన ‘కపాస్ కిసాన్ యాప్’ వల్ల రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరో వైపు కేంద్రం దిగుమతి సుంకాలు సడలించడంతో బహిరంగ మార్కెట్లో పత్తి ధర క్వింటాల్‌కు రూ.6 వేలకు పడిపోగా ఇప్పుడు సీసీఐ కొత్త నిబంధనలతో రైతులు పూర్తిగా నష్ట పోతున్నారు. వేల రూపాయలను పెట్టుబడిగా పెట్టి ఇటు పత్తిని అమ్ముకోలేక భద్రపరుచుకోలేక రైతులు అవస్థలు పడుతున్నారని జిన్నింగ్ మిల్లుల యజమానులు అంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే జిన్నింగ్ పరిశ్రమ మూతపడే ప్రమాదం ఉంది. రైతులు పండించిన పంటను సైతం స్వేచ్ఛగా అమ్ముకోకుండా షరతులు విధించడం బాధాకరమని అంటున్నారు.
సీసీఐ నిబంధనలు సడలించాల్సిందే.. : ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, రైతుసంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు సీసీఐ పత్తి కొనుగోళ్లను ఎకరానికి 12 క్వింటాళ్ల నుంచి ఏడు క్వింటాళ్లకు తగ్గించడం దారుణం. వెంటనే సీసీఐ నిబంధనలు సడలించి కపాస్ యాప్‌ను తొలగించాలి.



