ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల ఘటనలో ఎన్‌ఐఏ చర్యలు
ఘటనాస్థలంలో నిషేధిత 9ఎంఎం కాట్రిడ్జ్‌లు
న్యూఢిల్లీ : ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుళ్ల కుట్రలో భాగమని ఆరోపిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సూసైడ్ బాంబర్ ఉమర్‌నబీ సహాయకుడైన ఒకరిని అరెస్టు చేసింది. ”ఢిల్లీ పోలీసుల నుంచి కేసును స్వాధీనం చేసుకున్న తర్వాత ఎన్‌ఐఏ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. దాడిలో వినియోగించిన కారును రిజిస్టర్ చేసిన అమీర్ రషీద్ అలీని ఢిల్లీలో అరెస్టు చేసింది. కాశ్మీర్‌లోని పాంపోర్‌లోని సంబూరా నివాసి అయిన నిందితుడు ”ఆత్మాహుతి బాంబర్” ఉమర్ ఉన్ నబీతో కలిసి ఉగ్రవాద దాడికి కుట్ర పన్నాడని తమ దర్యాప్తులో తేలిందని ఎన్‌ఐఏ తెలిపింది. ”ఆ కారు కొనుగోలుకు వీలుగా అమీర్ ఢిల్లీకి వచ్చాడు.
చివరికి దీనిని పేలుడుకు వాహనంలో ఉపయోగించే ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్‌గా ఉపయోగించారు. ”ఉగ్రవాద నిరోధక సంస్థ నబీకి చెందిన మరో వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకుంది. నవంబర్ 10న దేశ రాజధానిని కుదిపేసిన పేలుడులో గాయపడిన వారితో సహా 73 మంది సాక్షులను ఎన్‌ఐఏ ఇప్పటివరకు విచారించిన కేసులో సాక్ష్యాల కోసం వాహనాన్ని పరిశీలిస్తున్నారు” అని అది తెలిపింది. ఢిల్లీ, జమ్మూ, కాశ్మీర్, హర్యానా , ఉత్తరప్రదేశ్ పోలీసులతో పాటు వివిధ ఇతర ఏజెన్సీలతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తూ, ఎన్‌ఐఏ అనేక రాష్ట్రాల్లో తన దర్యాప్తును కొనసాగిస్తోంది. ”బాంబు దాడి వెనుక ఉన్న పెద్ద కుట్రను వెలికితీసేందుకు , కేసులో పాల్గొన్న ఇతరులను గుర్తించడానికి ఇది బహుళ ఆధారాలను అన్వేషిస్తోంది” అని ఎన్‌ఐఏ తెలిపింది.
ఘటనాస్థలంలో నిషేధిత 9ఎంఎం కాట్రిడ్జ్‌లు..
ఢిల్లీ కారుబాబు పేలుళ్ల ఘటనాస్థలం నుంచి పోలీసులు మూడు 9ఎంఎం క్యాలిబర్ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు.ఈ కాట్రిడ్జ్‌లలో రెండు లైవ్‌గా ఉండగా.. ఒకటి ఖాళీ షెల్ కనిపించింది. దాంతో పేలుళ్ల కేసు దర్యాప్తు కొత్త మలుపు తీసుకున్నది. వాస్తవానికి ఈ 9ఎంఎం కాట్రిడ్జ్‌లను నిషేధించారు. ప్రధానంగా భద్రతా దళాలు, ప్రత్యేక అధికారాలు ఉన్న వ్యక్తులు మాత్రమే వీటిని వినియోగించేందుకు అనుమతి ఉంది. మిగతా ఎవరూ ఉపయోగించకుండా నిషేధం అమలులో ఉన్నది. ఢిల్లీ పోలీసుల వర్గాల ప్రకారం.. పేలుడు కేసుల దర్యాప్తులో భాగంగా సంఘటన స్థలంలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ మూడు కాట్రిడ్జ్‌లను సెర్చ్ ఆపరేషన్ సమయంలో స్వాధీనం చేసుకున్నారు.
ఆ 12 మంది వైద్యుల ఫోన్లు స్విచ్ఛాప్..
ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుళ్లు జరిగిన తర్వాత.. నుహ్ సహా ఫరీదాబాద్‌లో పలువురు వైద్యులను అరెస్టు చేశారు. ఆ ఘటన తర్వాత 12 మందికిపైగా వైద్యుల ఫోన్లు స్విచ్ఛాప్ అయ్యాయని.. వారి ఆచూకీని తెలుసుకునేందుకు దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో ఎక్కువ మంది అల్ ఫలాV్‌ా యూనివర్సిటీకి చెందిన వారేనని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. బాంబు పేలుడు కేసులో దర్యాప్తు సంస్థలు కీలక ఆధారాలను కనుగొన్నారు.
ఢిల్లీ కారు బాంబు పేలుడులో ‘మదర్ ఆఫ్ సైతాన్’
ఎర్రకోట వద్ద జరిగిన బాంబుపేలుళ్లలో అత్యంత ప్రమాదకరమైన ”ట్రయాసిటోన్ ట్రైపెరాక్సైడ్” (టీఏటీపీ) వాడినట్లు ఫోరెన్సిక్ బృందాలు అనుమానిస్తున్నాయి.ఈ పేలుడు పదార్థం తీవ్రత చాలా అధికంగా ఉంటుందని ప్రపంచ వ్యాప్తంగా జరిగిన వివిధ భారీ పేలుళ్ల ఘటనలో టీఏటిపీనే వాడారని తెలిపాయి. టీఏటీపీ పేలుడు పదార్థాన్ని ”మదర్ ఆఫ్ సైతాన్” గా భావిస్తారు. 2015లో పారిస్ లో జరిగిన బాంబుపేలుళ్లు, 2016 బ్రస్సెల్స్, 2017 మంచెస్టర్ పేలుళ్ల తర్యాత టీఏటీపీ వాడకం గురించి తెలిసింది.
ఈ పేలుడు పదార్థం కచ్చితంగా ఉగ్రవాద సంస్థల నుంచే ఉమర్ కు అంది ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. లేదా టీఏటీపీని తయారు చేయాలనుకుంటే దానికి వివిధ రకాల రసాయనాలు అవసరమని వాటిని ఉమర్ ఏలా సేకరించాడు. అతనికి ఎవరెవరు సహకరించారు అన్న కోణంలోనూ దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. ఎర్రకోట పేలుళ్లకు సంబంధించి ఉమర్ సన్నిహితులు షహీన్ సయీద్, మజమ్మిల్ షకీల్, ఆదిల్ రాథర్ అనే ముగ్గురు వ్యక్తులను ఇదివరకే పోలీసులు అరెస్టు చేశారు. వారి ఇళ్లనుంచి దాదాపు 3 వేల కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.



