Monday, November 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయండాక్యుమెంట్‌ రైటర్లదే హవా..!

డాక్యుమెంట్‌ రైటర్లదే హవా..!

- Advertisement -

వారిని కాదంటే కొర్రీలు
ఏజెంట్లు, మధ్యవర్తుల ద్వారానే రిజిస్ట్రేషన్లు
సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతి దందా


నవతెలంగాణ-సిటీబ్యూరో
సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో డాక్యుమెంట్‌ రైటర్లదే హవా నడుస్తోంది. ఏజెంట్లుగా, మధ్యవర్తులుగా వారి ద్వారానే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఒక్కో డాక్యుమెంట్‌కు ఆస్తి విలువ ఆధారంగా పర్సంటేజ్‌ తీసుకుంటున్నారు. వీరిని కాదని స్లాట్‌ బుక్‌ చేసుకుని నేరుగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళ్తే అక్కడి అధికారులు, సిబ్బంది కొర్రీలు పెడుతూ తిరిగి డాక్యుమెంట్‌ రైటర్లు, ఏజెంట్లు, మధ్యవర్తుల వద్దకే పంపిస్తున్నారు. ఇలా పలు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరిగే అవినీతి దందాపై ఏసీబీకి ఫిర్యాదులు అందడంతో ఇటీవల దాడులు చేసింది. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ మెరుపు దాడులు నిర్వహించింది. మేడ్చల్‌-మల్కాజిగిరిలో 12 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఈ నెల 6న సూరారంలోని కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లిలోని మూసాపేటసబ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏకకాలంలో మెరుపు దాడులు చేశారు. 15 మంది డాక్యుమెంట్‌ రైటర్లు కుత్బుల్లాపూర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఉండగా వారందరిపై కేసులు నమోదు చేశారు. నేరుగా రిజిస్ట్రేషన్‌ కోసం వస్తే పనులు కావడం లేదనీ, ప్రయివేటు వ్యక్తుల ద్వారా అయితేనే సాఫీగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.

సబ్‌ రిజిస్ట్రార్లతో కుమ్మక్కు..!
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేయించుకునే వారు (అమ్మకం, కొనుగోలుదారులు) చలానా రూపంలో నిర్ణీత మొత్తం చెల్లించాలి. రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయ్యాక సంబంధిత డాక్యుమెంట్లు కొనుగోలుదారుల చేతికి రావాలనే నిబంధనలున్నా ఎక్కడా అమలు కావడం లేదు. నేరుగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళ్లిన వారికి అక్కడి అధికారులు, సిబ్బంది ఏవేవో కారణాలు చెప్పి తిప్పి పంపించేస్తూ, డాక్యుమెంట్‌ రైటర్లు, ఏజెంట్లు, మధ్యవర్తుల ద్వారా వెళ్లిన వారికి మాత్రం ఏమీ పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. దీంతో ప్రజలు నేరుగా రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళ్లకుండా డాక్యుమెంట్‌ రైటర్ల ఆఫీసులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు ఆస్తి విలువ ఆధారంగా పర్సంటేజ్‌ రూపంలో వసూలు చేస్తున్నారు.

శివారు కార్యాలయాలు.. అదనపు ఆదాయం..
డాక్యుమెంట్‌ రైటర్లకు ఎలాంటి లైసెన్స్‌లూ లేవు.. వీరిపై ఎలాంటి నియంత్రణ ఉండదు. అయినా వారు తయారు చేసి ఇచ్చిన డాక్యుమెంట్లనే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బంది అంగీకరిస్తుండటం గమనార్హం. రైటర్లు తయారు చేసే ఒక్కో డాక్యుమెంట్‌కు రూ.3 నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇక ఆస్తుల రిజిస్ట్రేషన్స్‌లో ఏమైనా సమస్యలుంటే రూ.50 వేల నుంచి రూ.లక్షల వరకు వసూలు చేస్తున్నారు. జిల్లాలో అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే మేడ్చల్‌, శామిర్‌పేట, కుత్బుల్లాపూర్‌, ఘట్కేసర్‌, మేడిపల్లి, కీసర సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఈ పట్టణ ప్రాంతాల చుట్టుపక్కల భూముల రిజిస్ట్రేషన్లు విస్తతంగా జరుగుతున్నాయి. ఇక్కడ పని చేసే సిబ్బందికి ప్రతి నెలా వారు ప్రభుత్వం ద్వారా పొందే జీతానికి రెట్టింపు ఆదాయం అదనంగా సమకూరుతుండటం గమనార్హం.

ఫైళ్ల పరిశీలన.. త్వరలో మరికొన్ని దాడులు..
జిల్లాలోని పలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు జరిగాయి. అధికారులు పలు ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో భాగంగా పలు రికార్డులను, డాక్యుమెంట్లను తనిఖీ చేశారు. ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టినా డాక్యుమెంట్‌ రైటర్లు వారికి అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే మరికొన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు దాడులు చేసే అవకాశం ఉందని సమాచారం. మూసాపేట, మల్కాజిగిరి, ఉప్పల్‌, ఘట్కే సర్‌, కీసర, నారపల్లి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై ఏసీబీకి అధికంగా ఫిర్యాదులు అందాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -