రైతు సంఘం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ – దామరచర్ల
దామరచర్ల మండలం కల్లేపల్లి గ్రామంలో పత్తి పంటలను మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సోమవారం పరిశీలించి, పత్తి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో వరి పంట తర్వాత పత్తిని ఎక్కువ సాగు చేస్తున్నట్లు చెప్పారు. ఎకరానికి రూ.40 నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టి పంటను సాగు చేయడం జరుగుతుందన్నారు. విత్తనాలు వేసినప్పటి నుంచి రైతులకు సమస్యలు ప్రారంభమవుతున్నాయని చెప్పారు. విత్తనాలు దొరకక, యూరియా అందుబాటులో ఉండక పోవడం తోపాటు నకిలీ పురుగు మందులు ప్రకృతి వైపరీత్యాలతోటి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.
ఏదోలా చివరకు పంటను పండించినప్పటికి ఆ పంటను అమ్ముకోవడానికి మార్కెట్ కు వెళ్తే కాపాస్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనే నిబంధనతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రైతుకు గిట్టుబాటు ధర చెల్లించాలని, సీసీఐ కొనుగోలు కేంద్రాలు పెంచాలని అన్నారు. ఎంతో కష్టపడి పంట అమ్మిన తర్వాత సిసిఐ వాళ్ళు పంటకు ధర చేసే డబ్బులు ఇస్తే బ్యాంకు వాళ్లు అప్పుందని ఆ డబ్బులు కట్ చేసుకుంటున్నారని ఆవేదన చెందారు. పై సమస్యలు పరిష్కరించకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ , రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు రవి నాయక్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మాలోత్ వినోద్ నాయక్ ,గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి లావుడియా ఎర్రా నాయక్, దయానంద్ సుభాని విజయ్ వెంకటయ్య ప్రసాద్ లక్ష్మయ్య హచ్చు తదితరులు పాల్గొన్నారు.



