నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ నియోజకవర్గంలోని పలు మండలాలలో పాటు జుక్కల్, బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ యువకులు నిర్వహించిన బిచ్కుంద బంద్, ధర్నా కార్యక్రమాలకు సంబంధించి యువతపై పెట్టిన అక్రమ కేసులు తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. ప్రజా సమస్యను ప్రశ్నించినందుకు యువతను బెదిరించడం ప్రజాస్వామ్యా విరుద్దమని, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో యువతకు న్యాయం చేయడానికి ముందుకు వచ్చిన జుక్కల్ మాజీ శాసనసభ్యులు హన్మంత్ షిండే, బాధిత యువకులను ప్రత్యక్షంగా కలిసి వారికి గుండె ధైర్యం చెప్పారు. ప్రజల కోసం గొంతు వినిపించడమే తప్ప తప్పేదేమీ చేయలేదని, ఇలాంటి అక్రమ కేసులు ఎవరినీ భయపెట్టలేవని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా హన్మంత్ షిండే షిండే మాట్లాడుతూ.. “యువకులు భయపడాల్సిన అవసరం లేదు. మీ వెంటే నేనున్నాను.
ప్రజా హక్కుల కోసం పోరాడిన ప్రతి ఒక్కరి కోసం అండగా నిలబడతాను” అని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించడం యువత హక్కు అని, ప్రజల డిమాండ్లను పరిష్కరించాల్సిన స్థానంలో కేసులు పెట్టడం ప్రజలను అణగదొక్కే ప్రయత్నమని ఆయన తీవ్రంగా విమర్శించారు. సెంట్రల్ లైటింగ్ లాంటి ప్రాథమిక సౌకర్యం కోసం ప్రజలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సూచిస్తున్నదని, ఈ సమస్యను పరిష్కరించే వరకు తాము ప్రజలతో పాటు నిలబడతామని ఆయన హామీ ఇచ్చారు. జుక్కల్ నియోజకవర్గ యువత, ప్రజల పైన అక్రమ కేసులు పెట్టిన మా ప్రభుత్వం రాగానే అవి అన్ని తీసేస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది.



