నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
డిసెంబర్ 26వ తారీఖున ఖమ్మంలో జరిగే సిపిఐ శతజయంతి ఉత్సవాలను జయప్రదం చెయ్యాలి అని కార్యకర్తలను సిపిఐ మండల కార్యదర్శి కల్లేపల్లి మహేందర్ కోరారు. సోమవారం, యాదగిరిగుట్ట మండలం చిన్న కందుకూరు, భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) గ్రామ శాఖ సమావేశం నమిల సంజీవ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో ఆవిర్భవించి వంద సంవత్సరాలు అవుతున్నదని నాటి నుండి నేటి వరకు అనేక ప్రజా పోరాటాలు నిర్వహించి ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు నిర్వహిస్తున్న పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు.
దేశ స్వాతంత్రం కొరకు అదేవిధంగా తెలంగాణలో జరిగినటువంటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిర్వహించినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచంలోనే సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డదని ఆ పోరాటాలలో 4500 మంది కమ్యూనిస్టుల త్యాగాలతో 10 లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకు పంచినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీని అన్నారు. ఇంత చరిత్ర కలిగిన పార్టీ 100 సంవత్సరాల ఉత్సవాలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో శాఖా కార్యదర్శి కాటం శ్రీకాంత్, మండల కార్యవర్గ సభ్యులు సుబ్బురు నరసయ్య, నమిల సంజీవ, ర్యాకల సాగర్, రాకల మహేందర్, సుబ్బూరు కరుణాకర్, కళ్ళేపల్లి మల్లేష్, రమేష్, కాటం మల్లుస్వామి, ఆర్ మల్లుస్వామి, కరుణాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.



