నవతెలంగాణ – మక్తల్
మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి – పత్తి కొనుగోలు చేయాలని రైతులకు మద్దతుగా జాతీయ రహదారిపై రాస్తారోకోలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి చెమటోడ్చి పండించిన పత్తి పంటను ప్రభుత్వం కొనలేక రైతన్నలు ఇబ్బందులు పాలు చేయడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతన్నలకు అన్ని కష్టాలే మిగిలాయని అన్నారు. సోమవారం మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు మండలం వడ్వాట్ రోడ్ లో ఉన్నటువంటి పత్తి మిల్లులో రైతుల వద్ద పత్తి కొనుగోలు నిలిపివేయడంతో, ఆగ్రహించిన రైతన్నలు పత్తిని వెంటనే కొనుగోలు చేయాలని జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమానికి దిగారు.
విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకొని రైతుల పక్షాన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల పండించిన పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కొరవీలు పెడుతూ ఉందని, రైతన్నలు పొలంలో పండించిన పంటను మాత్రమే కొనుగోలు కేంద్రాలకు ఇస్తున్నారు తప్ప, ఇతర పంటను తీసుకురావడం లేదని అన్నారు. ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం, ఏడు క్వింటాలు కొంటామని కొరవీలు పెట్టి, ఏడు క్వింటాలు సైతం కొనుగోలు చేయకుండా, రైతులను ఇబ్బంది పాలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రాష్ట్రానికి కష్టాలతో పాటు, రైతన్నలకు కష్టాలు తప్పడం లేదని మాజీ ఎమ్మెల్యే చిట్టెం దుయ్య బట్టారు.



