Tuesday, November 18, 2025
E-PAPER
Homeజాతీయంఅంబులెన్స్‌కు మంటలు.. వైద్యుడు, నవజాత శిశువు సహా నలుగురి సజీవ దహనం

అంబులెన్స్‌కు మంటలు.. వైద్యుడు, నవజాత శిశువు సహా నలుగురి సజీవ దహనం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: గుజరాత్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అర్వల్లీ జిల్లా మొదాస పట్టణం సమీపంలో ఓ అంబులెన్స్‌లో మంటలు చెలరేగి నవజాత శిశువు, డాక్టర్‌ సహా నలుగురు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. మరో ముగ్గురు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుట్టిన తర్వాత అనారోగ్యానికి గురైన ఒక రోజు పసికందును మెరుగైన చికిత్స కోసం మొదాసలోని ఆసుపత్రి నుంచి అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో మొదాస-ధన్సురా రహదారిపై అంబులెన్స్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదంలో పసికందుతో పాటు ఆ చిన్నారి తండ్రి జిగ్నేష్ మోచీ (38), డాక్టర్ శాంతిలాల్ రెంటియా (30), నర్సు భూరిబెన్ మానత్ (23) అక్కడికక్కడే మృతి చెందారు. అంబులెన్స్ వెనుక భాగంలో మంటలు చెలరేగడాన్ని గమనించిన డ్రైవర్ వాహనాన్ని నెమ్మది చేశాడు. ముందు సీట్లలో కూర్చున్న డ్రైవర్ అంకిత్ ఠాకూర్, జిగ్నేష్ బంధువులు గౌరంగ్ మోచీ, గీతాబెన్ మోచీ గాయాలతో బయటపడ్డారు. వెనుక భాగంలో ఉన్న నలుగురూ మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేలోపే జరగరాని నష్టం జరిగిపోయింది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ నిపుణులను రంగంలోకి దించినట్లు జిల్లా ఎస్పీ మనోహర్‌సిన్హ్ జడేజా తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -