Wednesday, November 19, 2025
E-PAPER
Homeఆటలుఅథ్లెట్లకు ఉచిత విద్య!

అథ్లెట్లకు ఉచిత విద్య!

- Advertisement -

బాక్సర్‌ నిఖత్‌కు చేయూత
146 మంది క్రీడాకారులకు ఉన్నత విద్య
స్పోర్ట్స్‌ హబ్‌గా ఎంఎల్‌ఆర్‌ఐటీ
నవతెలంగాణ- హైదరాబాద్‌

క్రీడలను కెరీర్‌గా ఎంచుకుని రాణించేందుకు మన దగ్గర వ్యవస్థీకృత విధానం లేదు. అన్ని రకాల ఒడిదొడుకులు అధిగమిస్తూ క్రీడాకారులు సొంతంగా ఎదగాల్సిందే. జాతీయ స్థాయిలో మెప్పించినా ప్రభుత్వం నుంచి సహకారం ఉండదు. అంతర్జాతీయ స్థాయిలో పతక ప్రతిభ చాటితేనే.. ప్రభుత్వ ప్రోత్సాహం, నగదు బహుమతులు దక్కుతాయి. ఇటువంటి కఠిన పరిస్థితుల్లో క్రీడాకారులు తొలినాళ్లలో ఎదుర్కొనే ఆర్థిక, ఇతర మౌలిక సదుపాయాల సమస్యలను పట్టించుకునే వాతావరణం కరువైంది. తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, కెరీర్‌లో నిలదొక్కుకునేందుకు అవసరమైన ఆర్థిక సహకారం అందించేందుకు ఎంఎల్‌ఆర్‌ఐటీ విద్యా సంస్థలు ముందుకు రావటం హర్షణీయం. రెండు సార్లు ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌, భారత స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌.. జాతీయ స్థాయిలో రాణిస్తున్న తరుణంలోనే ఎంఎల్‌ఆర్‌ఐటీ విద్యా సంస్థలు ఉపకారవేతనంతో పాటు ఆమె ఉన్నత విద్యకు అపూర్వ సహకారం అందించారు. ప్రస్తుతం న్యూఢిల్లీలో ప్రపంచ బాక్సింగ్‌ కప్‌ పోటీల్లో నిఖత్‌ జరీన్‌ పసిడి పతకం కోసం పోటీపడుతున్న వేళ.. క్రీడాకారులకు ఎంఎల్‌ఆర్‌ఐటీ విద్యా సంస్థలు అందిస్తున్న సహకారం, ఉచిత విద్య సదుపాయంపై ఆ సంస్థ చైర్మెన్‌, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి మాట్లాడారు.

ఎంఎల్‌ఆర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఎల్‌ఆర్‌ఐటీ) క్రీడాకారులకు అండగా స్పోర్ట్స్‌ హబ్‌ గా నిలుస్తోంది. ఆటల్లో సత్తా చాటుతున్న అథ్లెట్లను ఉచిత విద్యతో ప్రోత్సహిస్తోంది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ సహా 146 మంది క్రీడాకారులు స్పోర్ట్స్‌ కోటాలో బీటెక్‌, ఎంబీఏ, ఎంటెక్‌ కోర్సులను ఉచితంగా అభ్యసిస్తున్నారు. వర్థమాన క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహిస్తూ, ఉన్నత విద్యలో అవకాశాలు కల్పించడానికి 2017లో ఉచిత ప్రవేశాలను మొదలుపెట్టాం. విద్య, క్రీడల నడుమ సరైన సమతుల్యత పాటిస్తూ, అర్హులైన విద్యార్థులు రెండు రంగాల్లోనూ రాణించేలా చూడటమే మా లక్ష్యం. మా నాన్న మర్రి లక్ష్మణ్‌రెడ్డి మాస్టర్‌ అథ్లెట్‌. క్రీడల పట్ల ఆయనకు అమితమైన ప్రేమ. ఆయ స్ఫూర్తితోనే క్రీడాకారులకు ఉపకారవేతనాలు, ఉచిత విద్య అందిస్తున్నామని’ మర్రి రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. ఎంఎల్‌ఆర్‌ఐటీ క్రీడాకారులకు ఉచిత విద్య అందించటంతో పాటు విద్యార్థులకు ప్రపంచ శ్రేణి క్రీడా సదుపాయాలు అందుబాటులో ఉంచింది. కాలేజ్‌ ప్రాంగణంలో ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌, బ్యాడ్మింటన్‌ ఇండోర్‌ స్టేడియం, టేబుల్‌ టెన్నిస్‌, స్నూకర్‌, వాలీబాల్‌ కోర్టులు, 400మీ సింథటిక్‌ ట్రాక్‌, క్రికెట్‌ మైదానం ఉన్నాయి. పది మంది ఫిజికల్‌ డైరెక్టర్లు, ప్రతి క్రీడాంశంలో స్పెషలిస్ట్‌ కోచ్‌లు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించిన, ప్రతిభావంతులైన క్రీడాకారులకు స్పోర్ట్స్‌ స్కాలర్‌షిప్‌ సహా ఉచిత ఉన్నత విద్య ఎంఎల్‌ఆర్‌ఐటీలో లభిస్తోంది.

ఆ సహకారం మరువలేనిది : నిఖత్‌ జరీన్‌
‘కెరీర్‌ తొలినాళ్లలో మర్రి లక్ష్మణ్‌ రెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి అందించిన సహకారం మరువలేనిది. ఎంఎల్‌ఆర్‌ఐటీలో ఎంబీఏ అడ్మిషన్‌తో పాటు రూ. 5 లక్షల ఉపకారవేతనం అందించారు’ అని భారత స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -