Wednesday, November 19, 2025
E-PAPER
Homeఆటలుస్పిన్‌ కోటకు బీటలు

స్పిన్‌ కోటకు బీటలు

- Advertisement -

– 53 ఏండ్లలో ఇదే దారుణ భంగపాటు
– స్వదేశీ టెస్టుల్లో భారత్‌కు కొత్త సమస్య


టెస్టు క్రికెట్‌లో ఏ జట్టుకైనా సొంతగడ్డ పెట్టని కోట. స్పిన్‌ స్వర్గధామ పిచ్‌లు భారత్‌కు ఇంత కాలం కంచుకోటగా ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా స్పిన్నర్లు మన పిచ్‌లపై మాయ చేయడాన్ని చూస్తుంటే.. భారత్‌ సొంత బలం కోల్పోతున్నట్టు తెలుస్తోంది.

2017-2024లో స్వదేశంలో భారత్‌ 28 టెస్టులు ఆడగా.. అందులో 4 ఓటములే ఎదురయ్యాయి. కానీ గత ఏడాది నవంబర్‌ నుంచి స్వదేశంలో ఆడిన ఆరు టెస్టుల్లో భారత్‌ ఏకంగా 4 పరాజయాలు చవిచూసింది. బలహీన వెస్టిండీస్‌పై 2-0 సిరీస్‌ విజయం మినహాయిస్తే.. స్వదేశీ టెస్టుల్లో మన ప్రదర్శన గుండు సున్నా!.


నవతెలంగాణ క్రీడావిభాగం

ఈడెన్‌గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా 30 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించటం స్వదేశంలో అభిమానులు, క్రికెట్‌ నిపుణులు సహా మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆటలో గెలుపోటములు సహజం. కానీ స్వదేశంలో భారత్‌ వరుస టెస్టుల్లో ఓటమి పాలవటం తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. ఎందుకంటే, 2017-2024లో భారత్‌ 28 టెస్టుల్లో 4 పరాజయాలే చవిచూడగా.. గత ఏడాది నవంబర్‌ నుంచి ఇప్పటివరకు ఆరు టెస్టుల్లో నాలుగింట ఓటమి పాలైంది. చివరగా భారత్‌ స్వదేశంలో ఈ స్థాయిలో తడబడటం 1969-72 తర్వాతే ఇదే ప్రథమం. అప్పట్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లు భారత్‌ను ఆరు టెస్టుల్లో నాలుగింట ఓడించాయి. 53 ఏండ్లలో టీమ్‌ ఇండియా అత్యంత చెత్త ప్రదర్శన ఇదే. సొంతగడ్డపై ప్రత్యర్థిని మాయ చేసే భారత్‌.. ఏడాది కాలంగా ఎందుకీ ఇబ్బంది ఎదుర్కొంటుంది?

కలిసిరాని ‘టాస్‌’
భారత్‌ ఓడిన నాలుగు టెస్టులు స్పిన్‌ అనుకూల పిచ్‌పైనే జరిగాయి. పుణె, ముంబయి, బెంగళూరు సహా కోల్‌కతా ఈడెన్‌గార్డెన్స్‌ పిచ్‌లు స్పిన్‌ స్వర్గధామం. ఈ నాలుగింట మూడు టెస్టుల్లో (పుణె, ముంబయి, కోల్‌కతా) భారత్‌ టాస్‌ ఓడింది. పిచ్‌పై పగుళ్లు తేలిన పిచ్‌పై స్పిన్‌ను రెండో ఇన్నింగ్స్‌లో ఎదుర్కొవటం కత్తిమీద సామే. భారత్‌ ఈ మూడు టెస్టుల్లో ఆఖరు ఇన్నింగ్స్‌లో బ్యాట్‌ పట్టాల్సి రావటం తొలి ప్రతికూలత. టాస్‌ నెగ్గిన బెంగళూరు టెస్టులో పిచ్‌ స్వభావాన్ని జట్టు మేనేజ్‌మెంట్‌ అర్థం చేసుకోలేదు. తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుని 46 పరుగులకు కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసినా.. ఆ టెస్టులో భారత్‌ పుంజుకోలేకపోయింది. టాస్‌ ఓడి, తొలుత బౌలింగ్‌ చేయటంతో పిచ్‌ పరుగుల వేటకు అనుకూలించిన సమయంలో భారత్‌ బ్యాటింగ్‌ చేయలేదు. కానీ 2017-2024లో భారత్‌ టాస్‌ ఓడి 16 సార్లు ఫీల్డింగ్‌ చేసింది. అయినా, 11 టెస్టుల్లో విజయం సాధించింది. 3 టెస్టుల్లోనే ఓటమి చెందింది. ఇందులో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో 12 టెస్టుల్లో 7-2 రికార్డు నమోదు చేసింది.

బ్యాటర్ల వరుస వైఫల్యం
ఆసీస్‌, ఇంగ్లాండ్‌తో ఆడిన 12 టెస్టుల్లో భారత్‌ టాస్‌ ఓడినా.. బ్యాటర్లు రాణించటంతో బయటపడింది. ఆ టెస్టుల్లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ సగటు 368 పరుగులు (మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌). ఇందులో ఎనిమిది సార్లు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించగా, ఆరు సార్లు ఆధిక్యం 90కి పైనే. బ్యాటర్ల మెరుపులతో టాస్‌ ఓడిన బలహీనత నుంచి భారత్‌ బయటపడింది. కానీ, హైదరాబాద్‌ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల ఆధిక్యం సాధించినా.. భారత్‌ ఓడింది. తాజాగా, భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయటం లేదు. ఫలితంగా, టాస్‌ నెగ్గిన ప్రత్యర్థులు పైచేయి సాధిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌ సగటు 203 పరుగులకు పడిపోగా.. ఈ సమయంలో ముంబయిలోపై కివీస్‌పై 28 పరుగులు, కోల్‌కతాలో సఫారీపై 30 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ దక్కింది. 2024 ఆరంభం నుంచి 100-249 మధ్య లక్ష్యాలను ఛేదించటంలో భారత్‌ ఐదింట.. మూడు సార్లు విఫలమైంది. 1995-2023లో 16 సార్లు ఈ లక్ష్యాలను ఛేదించిన భారత్‌ 14 సార్లు విజయవంతమైంది, రెండు సార్లు మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

ఇటు పేస్‌, అటు స్పిన్‌ ఆడలేక
భారత బ్యాటర్లు ఈడెన్‌గార్డెన్స్‌లో ఇటు పేస్‌, అటు స్పిన్‌ ఆడలేకపోయారు. 13.25 సగటుతో స్పిన్‌కు 12 వికెట్లు కోల్పోయారు. 17.33 సగటుతో పేస్‌కు ఆరు వికెట్లు కోల్పోయారు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో స్పిన్‌కు 23.43 సగటుతో 37 వికెట్లు.. 18.50 సగటుతో పేస్‌కు 20 వికెట్లు కోల్పోయారు. ఇదే సమయంలో ప్రత్యర్థి బ్యాటర్లు ఇటు పేస్‌, అటు స్పిన్‌పై మెరుగైన గణాంకాలు నమోదు చేశారు. కివీస్‌తో సిరీస్‌లో భారత బ్యాటర్లు స్పిన్‌పై 23.43 సగటుతో పరుగులు చేయగా.. కివీస్‌ బ్యాటర్లు 23.86 సగటుతో రాణించారు. పేసర్లపై మనోళ్లు 18.50 సగటు సాధించగా, 44.71 సగటుతో కివీస్‌ది పైచేయిగా నిలిచింది. భారత్‌ ఓటమి పాలైన టెస్టుల్లో మన స్పిన్నర్ల కంటే ప్రత్యర్థి మాయగాళ్లు మెరవటం గమనార్హం. 2021-2024లో మన స్పిన్నర్లు 19.53 సగటుతో 264 వికెట్లు పడగొట్టగా.. ప్రత్యర్థి స్పిన్నర్లు 33.99 సగటుతో 195 వికెట్లు తీసుకున్నారు. స్వదేశంలో ఓడిన గత 4 టెస్టుల్లో భారత స్పిన్నర్లు 23.25 సగటుతో 54 వికెట్లు తీయగా.. ప్రత్యర్థి స్పిన్నర్లు 20.97 సగటుతో 49 వికెట్లు తీసుకున్నారు. అజాజ్‌ పటేల్‌, మిచెల్‌ శాంట్నర్‌, సైమన్‌ హార్మర్‌లు 15.69 సగటుతో 36 వికెట్లు పడగొట్టారు. ఫలితంగా, భారత్‌ స్వదేశంలో 4 టెస్టుల్లో దారుణ ఓటమిపాలైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -