మహారాష్ట్రలోని మరాఠ్వాడ ప్రాంతంలో..
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు మహారాష్ట్రలోని మరాఠ్వాడ ప్రాంతంలో 899 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆరు నెలల్లో పంటలకు భారీ నష్టంతో 537 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అధికారిక డేటా స్పష్టం చేస్తుంది. ఛత్రపతి శంభాజీనగర్ డివిజనల్ కమిషనర్ కార్యాలయం అందించిన డేటా ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు పది నెలల్లో మరాఠ్వాడాలో 899 మంది రైతుల ఆత్మహత్యలు నమోదయ్యాయి. వీటిలో వర్షాలు, వరదల విధ్వంసంతో ఆరు నెలల్లో (మే 1 నుండి అక్టోబర్ 31 వరకు) 537 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బీడ్, ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు నమోదు అయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే ఈ ఆరు జిల్లాల్లో ఛత్రపతి సంభాజీనగర్‌లో 112, జల్నా-32, పర్భానీ-45, హింగోలి-33, నాందేడ్-90, బీడ్-108, లాతూర్-47, ధరాశివ్-70 రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. రైతుల ఆత్మహత్య పట్ల రైతులు సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశాయి. ప్రభుత్వం ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తుందని వ్యవసాయ శాఖ సహాయ మంత్రి ఆశిష్ జైస్వాల్ అన్నారు.
10 నెలల్లో 899 మంది రైతుల ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -



