Wednesday, November 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగొప్ప మార్పునకు శ్రీకారం..

గొప్ప మార్పునకు శ్రీకారం..

- Advertisement -

– డీజీపీ బి.శివధర్‌రెడ్డి
– హైదరాబాద్‌ సిటీ పోలీసులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రారంభం
నవతెలంగాణ-సిటీబ్యూరో

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ ”ఒక గొప్ప మార్పునకు ఇదే శ్రీకారం” పేరుతో విస్తృత స్థాయి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం నిర్వహించడంపై డీజీపీ బి.శివధర్‌రెడ్డి ప్రశంసించారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ ఆడిటోరియంలో మంగళవారం జరిగిన ఈ శిక్షణా కార్యక్రమంలో హైదరాబాద్‌ సీపీ విసి.సజ్జనార్‌తో కలిసి డీజీపీ పాల్గొన్నారు. శిక్షణా మెటిరియల్‌ ప్రతులను ఆవిష్కరించారు. పోలీసు సిబ్బందిలో నైపుణ్యాలను పెంపొందించి, ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించడమే ఈ శిక్షణా కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని డీజీపీ తెలిపారు. హైదరాబాద్‌ కమిషనేట్‌ పరిధిలోని 19,488 మందికి దశలవారీగా శిక్షణ ఇస్తామన్నారు. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ చరిత్రలో అందరికీ ఈ తరహా శిక్షణ కార్యక్రమం నిర్వహించడం ఇదే మొదటిసారని చెప్పారు. క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు 178 మంది ప్రత్యేక శిక్షకులను ఎంపిక చేశామని, అందులో 74 మంది ఏసీపీలు, 98 మంది ఇన్‌స్పెక్టర్లు / రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు, 6 మంది ఎస్‌ఐలు ఉన్నారని అన్నారు. పోలీసింగ్‌లో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ రీస్కిల్లింగ్‌ కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉద్యోగి జీవితంలో శిక్షణ కీలకపాత్ర పోషిస్తుందని, అనేక కొత్త విషయాలను నేర్చుకోవచ్చని అన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రజల్లో చైతన్యం పెరిగిందని, అందుకనుగుణంగా పోలీసుల ప్రవర్తనలో మార్పు రావాల్సిన అవసరం ఉందని వివరించారు. పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం మరింతగా పెంచడంలో ఈ శిక్షణ దోహదం చేస్తుందన్నారు. ”ఒక గొప్ప మార్పునకు ఇదే శ్రీకారం” అనే పేరుతో సిబ్బంది అందరికీ నైపుణ్యాభివృద్ధి శిక్షణ అనే ఆలోచన మంచిందని, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హైదరాబాద్‌ సీపీ విసి.సజ్జనార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. సిపి సజ్జనార్‌ మాట్లాడుతూ.. ఏ సంస్థ అయినా అభివృద్ధి చెందాలంటే సిబ్బందికి శిక్షణ అవసరం అన్నారు. ఈ శిక్షణ నైపుణ్యం పెంచడంతోపాటు అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు దోహదం చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంపై ఒక నెల నుంచి కసరత్తు చేసి, మంచి ప్రణాళికతో ప్రారంభిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరినీ సమర్థవంతమైన, బాధ్యతాయుతమైన పోలీస్‌ అధికారిగా తీర్చిదిద్దేలా రూపొందించామని తెలిపారు. గతాన్ని తెలుసుకుని.. భవిష్యత్‌ దిశలో ముందుకు తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రవర్తన, పనితీరే పోలీస్‌ ప్రతిష్టను ఇనుమడింపజేస్తుందనే విషయాన్ని సిబ్బంది గుర్తుంచుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ సీపీ(క్రైం) ఎం.శ్రీనివాస్‌, జాయింట్‌ సీపీ(అడ్మిన్‌) పరిమళ హాన నూతన్‌, డీసీపీలు రక్షితా కృష్ణమూర్తి, కె.అపూర్వరావు, శ్వేత, స్నేహా మెహ్రా, బి.బాలస్వామి, శిక్షణా ఫ్యాకల్టీలు జి.యుగందర్‌, ఎ. మల్లేశ్‌, నళిని, అన్ని అన్ని జోన్ల డీసీపీలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -