బోథ్ అసెంబ్లీ ఇంచార్జి ఆడె గజేందర్
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆదిలాబాద్ పర్యటనలో బీఆర్ఎస్ కు చేసిన డ్యామేజీని కవర్ చేసేందుకే ఆదిలాబాద్ లో కేటీఆర్ పర్యటన జరిగిందని బోథ్ అసెంబ్లీ ఇంచార్జి ఆడె గజేందర్ అన్నారు. బుధవారం కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో శ్రేణులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను వస్తున్నానని తెలిసి మార్కెట్ బంద్ పెట్టారని కేటీఆర్ కనీస అవగాహన లేకుండా మాట్లాడారని విమర్శించారు. రాష్ట్ర జిన్నింగ్ యజమానుల పిలుపు మేరకు మార్కెట్ బంద్ అయ్యింది కాని కేటీఆర్ ఇక్కడికొచ్చి ఏదో ఉద్ధరిస్తారని మార్కెట్ బంద్ కాలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల శ్రేయస్సు గాలికొదిలేసిన మీరు ఇప్పుడు రైతుల సంక్షేమమంటూ మాట్లాడటం, వారిపై లేని ప్రేమను ఒలక బోయడం విడ్డూరంగా ఉందన్నారు.
మీ హయాంలో ఖమ్మంలో మిర్చి రైతులు బోథ్ లో తెల్ల జొన్నల రైతులను ఇబ్బందులకు గురి చేయలేదా అని ప్రశ్నించారు. ఇదిగో రణమాఫీ అంటూ ఆశ చూపారే కాని ఇచ్చింది లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏక కాలంలో రెండు లక్షల రుణ మాఫీ చేసింద్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు 12వేల రూపాయల రైతు భరోసా ఇస్తుందని మీ హయాంలో బడా భూస్వాములకు మేలు చేసేలా గుట్టలకు పుట్టలకు ఇచ్చారన్నారు.తమ ప్రభుత్వం దాదాపు లక్ష కోట్లు రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన చూసి ఓర్చుకోలేక ఇక్కడికొచ్చి రైతులను రెచ్చగొట్టి పోదామనే ఆలోచన తప్ప మరోటి కాదన్నారు.మీ ప్రభుత్వ హయాంలో సబ్సిడీలు లేవని ,ఉన్నవి కాస్తా ఎత్తేసారని ఎద్దేవా చేసారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం, ప్రజల కోసం అనేక సబ్సిడీలు ఇస్తోందన్నారు.ఇచ్చిన హామీ ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి 5లక్షలు ఇస్తుందన్నారు. రైతులను మోసం చేసిన చరిత్ర మీదైతే రైతు సంక్షేమం కోసం పాటు పడే ప్రభుత్వం తమదన్నారు. కోసజూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందు కేటీఆర్ పలికిన ప్రగల్భాలకు అక్కడి ఓటర్లు గట్టిగా బుద్ధి చెప్పారన్నారు.త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలలోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేసారు.ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్న ప్రజా ప్రభుత్వం పై అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఇక బీజేపీ ఏనాడు రైతుల గురించి ఆలోచించింది లేదన్నారు.కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చెందిన స్థానిక ఎంపీ ఎమ్మెల్యే లకు రైతు గోస పట్టదన్నారు. సీసీఐ తేమ నిబంధనలపై ఎందుకు కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి పరిష్కరించడంలేదని ప్రశ్నించారు. విదేశాల నుండి పత్తి దిగుమతి చేసుకుంటున్న కేంద్రం స్థానిక రైతులకు అన్యాయం చేస్తోందన్నారు.
అందుకే ఎకరాకు 10క్వింటాళ్ల కొనుగోలు నుండి 7 కి తగ్గిందన్నారు.మన పత్తి విదేశాలకు ఎగుమతి అయ్యేలా స్థానిక బీజేపీ ప్రజాప్రతినిధులు ప్రయత్నించాలే కాని వారికి అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటున్నారని విమర్శించారు.జూబ్లీహిల్స్ లో గెలుస్తామని విర్రవీగిన పార్టీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయిందని అన్నారు.ప్రతిపక్షాలకు నిజంగా ప్రజలు, రైతులపై ప్రేముంటే అభివృద్ధికి సహకరించాలే కానీ అనవసరంగా విమర్శలు గుప్పించవద్దని హితవు పలికారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, గిమ్మ సంతోష్ రావు, లోక ప్రవీణ్ రెడ్డి, రంగినేని శాంతన్ రావు, బండారి సతీష్, రఫీఖ్, జాఫర్ అహ్మద్, డేరా కృష్ణా రెడ్డి పాల్గొన్నారు.



