– 20 ఎకరాల్లో నూతనంగా కొబ్బరి సాగు ప్రారంభం
– ఉద్యాన శాఖ జిల్లా అధికారి కిశోర్
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రస్తుతం ఉన్న కొబ్బరి సాగు జీవితకాలం పూర్తి అయినందున ప్రత్యామ్నాయంగా నూతనంగా కొబ్బరి సాగు ప్రారంభిస్తున్నామని ఉద్యాన శాఖ జిల్లా అధికారి,స్థానిక కొబ్బరి విత్తనోత్పత్తి కేంద్రం ఇంచార్జి జే.కిశోర్ తెలిపారు. ఆయన బుధవారం అశ్వారివుపేట లోని కోకోనట్ సీడ్ గార్డెన్,అచ్యుతిపురంలోని పామాయిల్ కేంద్రాలను తనిఖీ చేసారు.
అనంతరం నవతెలంగాణతో మాట్లాడుతూ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో 1990 దశకంలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లోని ఖమ్మం జిల్లా,అశ్వారావుపేట మండలంలోని నారంవారిగూడెం లో 40 ఎకరాల విస్తీర్ణం లో ఈ కొబ్బరి విత్తనోత్పత్తి కేంద్రాన్ని స్థాపించారు అని,ఇందులో నాడే మలయన్ ఎల్లో డ్వార్ప్,మలయన్ గ్రీన్ డ్వార్ఫ్,
మలయన్ ఆరెంజ్ డ్వార్ప్, గంగా బొండం, చౌఘాట్ ఆరెంజ్ డ్వార్ఫ్ లాంటి కొబ్బరి వంగడాలను సాగు ప్రారంభించారని తెలిపారు.ఈ వంగడాలను కొబ్బరి బొండాలు గాను,విత్తన తయారి కి వినియోగించాం అని,ఈ కేంద్రం నుండే దేశంలోని అనేక రాష్ట్రాలకు కొబ్బరి మొక్కలు సరఫరా చేయడం ద్వారా రూ.2 కోట్లు మేర ఉద్యాన శాఖ కు ఆదాయం లభించింది అన్నారు.ఈ కేంద్రంలో సంవత్సరం మొత్తంగా 20 మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు.
నేడు ఈ కొబ్బరి తోట వయస్సు పెరిగి జీవితకాలం ముగియడంతో ప్రత్యామ్నాయంగా మొదటిగా 20 ఎకరాల్లో నూతన సాగు కొబ్బరి సాగు ప్రారంభించాం అని అన్నారు.ప్రస్తుతం గౌతమి గంగా బొండాం వంగడం సాగు చేసినట్లు తెలిపారు.



