రాష్ట్రంలో పత్తి రైతుల కష్టాలు వర్ణనాతీతం. ఒకవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి సమస్యలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట చేతికందే సమయంలో మొంథా తుఫాను రావడంతో తీవ్రంగా నష్టపోయారు. రెండేండ్ల క్రితం తీవ్ర కరువుతో అల్లాడిన రైతులు, ఈ ఏడాది అతివృష్టి కారణంగా కుదేలయ్యారు. అధిక వర్షాల వల్ల పత్తి పంట ఎర్రగా మారింది, గులాబీరంగు పురుగు సోకి పత్తి మొగ్గ, పూత, పింద, కాయ రాలిపోయి తీవ్రనష్టం వాటిల్లింది. ఎన్ని మందులు వాడినా అదుపుగాని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో పత్తి రైతాంగానికి అండగా ఉండాల్సిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోగా వారికి ప్రతిబంధకాలు సృష్టిస్తున్నాయి. తెల్లబంగారంగా పిలవబడే పత్తి ఒక ముఖ్యమైన వాణిజ్య పంట రాష్ట్రంలో ప్రతి సాగు ప్రధానంగా ఖరీఫ్ సీజన్‌లో సాగుచేస్తారు. తెలంగాణలో సాగు చేసే పత్తి లాంగ్ స్టేపుల్ (దూది పింజ) కలిగి గట్టిగా ఉండటం వల్ల దేశీయంగా, అంతర్జాతీయంగా మంచి ధర పలుకుతుంది. దీనివల్ల పత్తి సాగుకు రైతుల మొగ్గు చూపుతు న్నారు. దీంతో తెలంగాణ గుజరాత్, మహారాష్ట్ర తర్వాత మూడో స్థానంలో ఉంది.
ఈ ఏడాది మొత్తం 45.32 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా 28.20 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. పత్తి పంటకు ఈ సంవత్సరం కేంద్రం రూ.8110 మద్దతు ధరగా నిర్ణయించింది. ఇదే మద్దతు ధర గతేడాది రూ.7521. రూ. 589 మద్దతు ధర పెంచా మని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నా, పెరిగిన పత్తి విత్తనాల ధరలు, ఎరువులు, పురుగు మందులు, కూలి రేట్లు రైతులకు అంతకన్నా భారమే ఎక్కువ. స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం కచ్చితంగా లెక్కకడితే పత్తికి మద్దతు ధర రూ.10,075 దాకా వస్తుంది. ఈ రేటు ఇస్తే గాని గిట్టుబాటు కాదు. 2024 సంవత్సరం బిటి పత్తిపై విత్తనానికి ఒక ప్యాకెట్ కు 864 ధర ఉండగా ప్రస్తుతం 37 పెంచి 901 రూపాయలుగా నిర్ణయించింది. ఇదే పత్తి ప్యాకెట్ 2018లో 690 మాత్రమే.రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ కమతాల్లో సుమారు 33.7 లేదా మూడింట ఒక వంతు పత్తి సాగు క్షేత్రాలుండగా పత్తి సాగులో చిన్న,సన్నకారు రైతులే అధికం.
రాష్ట్రంలో అక్టోబర్ 23 నుంచి సీసీఐ కొనుగోళ్లను ప్రారంభించింది. కానీ నామమాత్రంగానే పత్తి కొంటున్నది. 24 లక్షల మంది రైతులుంటే 10,759 మంది మాత్రమే కొనుగోలు కేంద్రాలకు పత్తిని తీసుకొచ్చారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఎంత వీలైతే అంత పత్తి కొనుగోళ్లలో కోత పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులే ఆరోపిస్తున్నారు. ఎందుకంటే తేమ, నాసిరకం, రంగు మారిందని, గింజ పొడవుగా లేదని ఇలాంటి పలు కారణాలతో పత్తిని నిరాకరిస్తున్నారు. సీసీఐ అధికారులు, ప్రయివేటు వ్యాపారులతో కుమ్మక్కై కేంద్రాల్లో కొర్రీలు పెట్టి రైతులు నుంచి పత్తి కొనుగోలు చేయకుండా వారిని తిరిగి పంపిస్తున్న విమర్శలు కూడా వస్తున్నాయి.
సీసీఐ తిరస్కరించిన పత్తిని ప్రయివేటు వ్యాపారులు రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, అదే పత్తి తిరిగి దొంగ ఖాతాల పేరుతో సీసీఐకి విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. అమ్మకాల్లో పారదర్శకత కోసం ప్రవేశపెట్టిన కపాస్ కిసాన్ యాప్ కూడా రైతులకు అనేక సమస్యలు తెచ్చిపెట్టింది. ఏ జిన్నింగ్ మిల్లుకి, ఏ సమయంలో తీసుకెళ్తారనే అంశాలు పొందుపరిచి స్లాట్ బుక్ చేసుకోవాలి. మూడుసార్ల కన్నా ఎక్కువ బుక్ చేస్తే వివరాలు తీసుకోవడం లేదు. రైెతులకు గ్రామ, మండల స్థాయిలో అవగాహన కల్పించి తర్వాత అమలు చేయాల్సిన అధికారులు ప్రభుత్వం గుడ్డిగా రైతులపై ప్రవేశపెట్టడంతో అది సమస్యగా మారింది. స్లాట్ బుకింగ్ చేసుకున్న రైతులు తెచ్చే పత్తి మాత్రమే కొనుగోలు చేయటం జరుగుతుందన్న రీతిలో సీసీఐ చెబు తున్నది. దీంతో రైతులు ఇవన్నీ భరించలేక ప్రయివేటు వ్యాపారులు వద్దమార్కెట్ కమిటీలో పత్తిని విక్రయించేందుకు ఆశ్రయిస్తున్నారు.
పత్తి కొనుగోలును ఎకరానికి ఏడు క్వింటాళ్లకు పరిమితం చేయడం మరో సమస్య.రాష్ట్రంలో 45.32 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా ఎకరాకు సగటున 11.74 క్వింటాల్ చొప్పున పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ ఇచ్చిన నివేదికకు అనుగుణంగా పన్నెండు క్వింటాళ్ల చొప్పున సీసీఐ కొనుగోలు ప్రారంభించింది. రెండో తారీఖున హఠాత్తుగా కొనుగోలును పరిమితం చేస్తూ ఏడు క్వింటాళ్లకు తగ్గిస్తున్నట్టు రాష్ట్ర అధికారులకు సమాచారమిచ్చింది. దీనికి కారణం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పత్తిసాగు సగటు దిగుబడిపై కేంద్ర ఆర్థిక గణాంక శాఖ డైరెక్టర్ నివేదిక ప్రకారం తెలంగాణలో ఈ సీజన్‌లో ఎకరాకు ఏడుక్వింటాళ్లు దిగుబడి వస్తుందని తెలిపింది. అందుకే ఆ మేరకు కొనుగోలుకు అనుమతించామని సీసీఐ చెబుతున్నది. కానీ సీసీఐ మద్దతు ధరకు కొనుగోలు చేసిన పత్తి 21 లక్షల మెట్రిక్ టన్నులు కాగా దాన్ని విక్రయించిన రైతులు తొమ్మిది లక్షల మంది రైతులు మాత్రమే. పత్తి సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా దక్కక తీవ్రంగా నష్టపోయిన రైతన్నను పత్తి మిల్లర్లు, దళారులు మోసం చేస్తూ దోచుకుతింటున్నారు.
తరుగు పేరుతో రూ.200 నుంచి 500 వరకు అడ్డగోలుగా తగ్గిస్తున్నారు. ఈ దోపిడీలో మిళ్లు యజమానులతో పాటు దళారులు, ట్రాన్స్‌పోర్టు డ్రైవర్లు కూడా భాగస్వాములవ్వడం బాధాకరం. ఈ త్రిముఖ దాడి (మిల్లు యాజమాన్యం, దళారులు, డ్రైవర్లు) కారణంగా చిన్న సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయం అధికారులకు పాలకవర్గానికి తెలిసినా పట్టించుకోవటం లేదు. ఓవైపు పత్తి రైతులకు మద్దతు కల్పిస్తున్నామని కేంద్రం చెబుతున్నది. రైతులు పండించిన పంటను పూర్తిగా కొనుగోలు చేసి వారికి చేయూతనందిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం కఠిన నిబంధనలు అమలు చేస్తూ రైతులను అనేక ఇబ్బం దులకు గురిచేస్తున్నది. అధిక వర్షాలతో పత్తిలో తేమ శాతం పెరిగింది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని గుర్తించకుండా ఎనిమిది శాతం లోపు ఉంటేనే మద్దతు ధర అని, ఆ తర్వాత ప్రతి పాయింట్‌కు 81 రూపాయలు కోత పెట్టడం, అలాగే 12 శాతం మించి ఉంటే కొనకపోవటం ప్రయివేటు వ్యాపారుల ప్రయోజనానికే. చాలాచోట్ల తేమ శాతం 15 నుంచి 20 దాకా ఉంటుంది. ఈ పత్తిని కొనకపోతే వారు ఏం చేస్తారు. తక్కువ ధరకు దళారులే కొనుగోలు చేస్తారు.ఇదంతా ఓ మోసం.
కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి పత్తి దిగుమతులపై ఉన్న సుంకాన్ని ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇది ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు మాత్రమే అమల్లో ఉంటుందని తొలుత కేంద్రం ప్రకటించింది. తర్వాత దీన్ని ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించింది. మన దేశం ప్రపంచంలో అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారుల్లో ఒకటి అయినప్పటికీ విదేశాల నుంచి పత్తి దిగుమతి చేయటం రైతులకు అన్యాయం చేయడమే. అమెరికా ఒత్తిడితోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది దేశీయ పత్తిరంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దిగుమతి సుంకం ఎత్తివేయడంతో టెక్స్ టైల్స్ పరిశ్రమకు దేశీపత్తితో పోల్చితే విదేశీ పత్తి తక్కువ ధరకు లభిస్తుంది. ఈ దెబ్బతో దేశీ పత్తి డిమాండ్ పడిపోయింది.
మనదేశంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకే పత్తి పంట వస్తుంది. ఇది చేతికొచ్చే సమయంలోనే సుంకం ఎత్తివేయ డంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఇదంతా చూసినప్పుడు పాలకులు వ్యవసాయరంగాన్ని బలపేతం చేస్తున్నారా? లేదంటే నిర్లక్ష్యం చేస్తున్నారా? వారు ప్రకటించే మద్దతు ధరలు, కపట ప్రేమలు ఎవరి ప్రయోజనాలను నెరవేరుస్తున్నాయి? ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ భజన వదిలి దేశానికి అన్నం పెట్టే రైతు వెన్నెముక ఇరగకుండా స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం కనీస మద్దతు ధర నిర్ణయించి సక్రమంగా అమలు చేయాలి. సబ్సిడీ గ్రాంటు,రుణాల పేరుతో ఆర్థిక సహాయం చేయాలి.నాణ్యమైన విత్తనాలందించి సాంకేతికతను పెంచే విధంగా కృషి చేయాలి. అప్పుడు మాత్రమే పత్తి రైతుల జీవితాల్లో వెలుగులు చూడగలం.
యలమంచి వంశీకృష్ణ
9908997969



