అండర్ గ్రౌండ్ నుంచి క్రమంగా తప్పుకుంటున్న సంస్థ
లాభాల కోసం..ఓపెన్ మైనింగ్‌కే మొగ్గు
చుట్టుపక్కల ప్రాంతాలను కబళిస్తున్న వాయు, శబ్ద కాలుష్యం
మెజార్టీ గని కార్మికులకు దీర్ఘకాలిక వ్యాధులు
తవ్వకం పూర్తయిన ప్రాంతమంతా… మరుభూమే
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సింగరేణి భూ ఉపరితల గనుల తవ్వకం (ఓపెన్ కాస్ట్ మైనింగ్) ప్రకృతి విధ్వంసానికి పరాకాష్టగా మారుతోంది. లాభాల కోసం క్రమంగా భూగర్భ గను లను అటకెక్కించి.. ఓపెన్ కాస్ట్ వైపు సంస్థ పరుగులు పెడుతోంది. ఫలితంగా వాయు, శబ్ద కాలుష్యంతోపాటు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. వేలాది ఎకరాల భూమి వ్యవసాయానికి పనికిరాకుండా పోతోంది. గనులు విస్తరించిన ప్రాంతాల్లోని గ్రామాల ప్రజల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పెద్దఎత్తున సాంకేతిక యంత్రాలు వినియోగించడంతో మ్యాన్‌పవర్ క్రమంగా తగ్గుతోంది. ఒకప్పుడు లక్షకుపైగా కార్మికులకు ఉపాధి కల్పించి రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపుపొందిన సింగరేణిలో నేడు 40 వేలకు కార్మికులు తగ్గిపోయారు. అలాగే ఉపరితల గనుల తవ్వకం పూర్తయిన ప్రాంతమంతా భవిష్యత్‌లో మరుభూమిగా మారే ప్రమాదముందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.
బొగ్గు గనుల తవ్వకం, ఉత్పత్తి, సరఫరాలో కోల్ ఇండియా తర్వాత దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా సింగరేణికి గుర్తింపు ఉంది. ఒక ప్పుడు కార్మి కుల సంక్షేమానికి ప్రతీకగా పేరొందిన సింగరేణి క్రమంగా ప్రయివేట్ కార్పొరేట్ హంగులను అద్దుకుంటూ ప్రజాహితాన్ని మరుస్తున్నదనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నది. లాభాల కోసం పోటీ పడే క్రమంలో సంస్థ అడుగులు దారి తప్పుతున్నాయి. అండర్ గ్రౌండ్ బావులు మూత పడుతున్న క్రమంలో వాటి స్థానంలో ఓపెన్ కాస్ట్ బావులకు ప్రాధాన్యత ఇస్తోంది. 2004లో సింగరేణిలో 50కిపైగా భూగర్భ బావులుం డగా నేడు అవి 22కు తగ్గి పోయాయి. బావి ఏరియా, సామర్థ్యాన్ని బట్టి దాని జీవిత కాలం ఉంటుంది.
సింగరేణి సంస్థ చరిత్రలో బెల్లంపల్లి ప్రాంతంలో ఉన్న శాంతిఖని భూగర్భ బొగ్గుబావి 70 ఏండ్లకు పైగా పని చేస్తోంది. కంపెనీ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలంగా సేవలందిస్తోంది. ఉత్పత్తిని కొనసాగించడానికి, నిల్వలను సంరక్షించడానికి లాంగ్‌వాల్, బోల్టర్ మైనర్ టెక్నాలజీని వాడుతున్నారు. అయితే ఈ విధానం ఓపెన్ కాస్ట్‌తో పోలిస్తే ఖరీదై నదిగా పరిగణించబడుతున్నది. దాంతో లాంగ్‌వాల్ అయిన బావులను మూసేసి వాటి స్థానంలో ఉపరితల గనుల వైపు సంస్థ మొగ్గు చూపుతున్నది. ఈ విధానం ప్రజలతో పాటు పర్యావరణానికీ ప్రమాదమని తెలిసినా లాభాలు, మార్కెట్ పోటీని తట్టుకునేందుకు సింగరేణి ఓపెన్‌కాస్ట్ మైనింగ్ వైపు మళ్లుతోంది. సంస్థ తీరును సింగరేణిలోని ట్రేడ్ యూనియన్లు, కార్మికులు వ్యతిరేకిస్తున్నారు.
ఆరోగ్య సమస్యలు…
ఓపెన్ కాస్ట్ విధానంలో బొగ్గు తవ్వకాలు పర్యావరణానికి ప్రమాదకరంగా మారాయి. బొగ్గు బ్లాస్టింగ్ చేసినప్పుడు భూమి నుంచి భారీ లోహాలు, ఇతర విషపదార్థాలు విడుదలవుతున్నాయి. దాంతో గాలితో పాటు నీరు కూడా విషతుల్యంగా మారుతోంది. ఇది సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ సమీప గ్రామాల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపి స్తోంది. ఈ ప్రాంతాల్లో నివసించే మనుషుల జీవిత కాలం కనీసం ఐదు నుంచి పదేండ్లు తగ్గుతోందని వైద్యులు చెబుతున్నారు. శ్వాసకోశ వ్యాధులు, చర్మ, ఎముకల జబ్బులు, గుండె సంబంధిత రోగాలతో ఎక్కువగా బాధపడుతున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన పర్యావరణ, జీవశాస్త్ర విభాగాలకు చెందిన పరిశోధక బృందం 2023లో సింగరేణి కోల్‌మైన్ కార్మికుల ఆరోగ్యస్థితిపై సర్వే చేసింది. ‘ఎపిడమలాజికల్ స్టడీస్ ఆన్ హెల్త్ స్టే టస్ ఆఫ్ కోల్‌మైన్స్ వర్కర్స్’ పేరుతో మంచిర్యాల జిల్లా లో కేస్ స్టడీ చేసింది. ఈ సర్వే ప్రకారం బొగ్గు గనిలో పనిచేస్తున్న కార్మికుల్లో 141మందిలో.. (54.6శాతం) 77 మందికి వైరల్ డిసీసెస్ ఉండగా, (45.4 శాతం) 64 మందికి డీసీసెస్ లేదు. నాన్ కోల్‌మైన్ వర్కర్లలో… కేవలం (7.8శాతం) 11మంది మాత్రమే వైరల్ సమస్యలతో బాధపడుతున్నారు. (92.2శాతం) 130 మందికి ఎలాంటి వైరల్ డిసీసెస్ లేవు. ఈ పరిశోధన సింగరేణి బొగ్గుగని కార్మికుల ఆరోగ్య పరిస్థితికి అద్దం పడుతోంది.
సింగరేణి ముఖ్యమైన ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు
1) రామగుండం ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు ఓసీ 1, ఓసీ 2, ఓసీ (3 గనులు)
2). కిష్టారం ఓపెన్‌కాస్ట్ ..(1)
3) కాకతీయ ఖని ఓపెన్ కాస్ట్ (1)
4) మణుగూరు ఓపెన్ కాస్ట్ (1)
5) కోయగూడెం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు.. కోయగూడెం ఓసీ, ఓసీ 2 ( 2 గనులు)
6). జేకే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు, జేకే ఓసీపీ, జేకే 5 ఓసీపీ (రెండు గనులు)
7). ఇందారం ఖని ఓపెన్‌కాస్ట్ (1)
ఉపాధికి ప్రమాదం
సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ తో ఉపాది క్రమంగా తగ్గుతోంది. యంత్రాల వినియోగం కార్మికుల పొట్ట కొడుతోంది. ఒకప్పుడు లక్ష మందికి పైగా కార్మికులున్న చోట నేడు 40 వేలకు పడిపోయారు. దానికి తోడు పర్యావరణ విధ్వంసం, భూగర్భ జలాలు అడుగంటి పోవడం లాంటి అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. భవిష్యత్‌లో ఓపెన్ కాస్ట్ ప్రాంతం నివాసానికి కూడా పనికి రాదు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సంస్థ భూగర్భ గనులకు ప్రాధానత్య ఇవ్వాలి.
రాజిరెడ్డి, అధ్యక్షులు, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ)
ప్రజాజీవితం అస్తవ్యస్తం
సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్‌లతో ప్రజా జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. గనులు విస్తరించిన ప్రాంతం నివాస యోగ్యం కాకపోవడంతో పాటు వ్యవసాయానికి పనికిరాదు. బ్లాస్టింగ్ వల్ల వెలువడే దుమ్ము, ధూళిలో ప్రమాదకరమైన రసాయనాలు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. చుట్టు పక్కల గ్రామాల్లో వ్యవసాయ దిగుబడులు కూడా తగ్గుతాయి. ఏ రకంగా చూసినా ఉపరితల గనులు పర్యావరణంతో పాటు ప్రజల మనుగడకు ప్రమాదకరంగా మారుతున్నాయి.
దొంతి నర్సింహారెడ్డి, పర్యావరణ వేత్త
అండర్ గ్రౌండ్ గనులతో పోల్చితే ఓపెన్ కాస్ట్ గనులతో జరిగే నష్టాలు
అండర్ గ్రౌండ్
భూమి వినియోగం తక్కువ. భూ గర్భంలో గని విస్తరించిన ప్రాంతం వ్యవసాయానికి, ఇతర ప్రజావసరాలకు ఉపయోగపడుతుంది.
వర్షాకాలంతో సహా… ఏడాదిలో 365 రోజులు ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం ఉండదు.
బ్లాస్టింగ్ భూ గర్బంలో జరగడం వల్ల పర్యావరణానికి ప్రమాదం ఉండదు. చెట్ల పెంపకానికి ఎలాంటి ఆటంకం కలగదు.
ఓపెన్ కాస్ట్
గని విస్తరించిన ప్రాంతం అంతా దేనికి పనికి రాదు. వ్యవసాయం, రహదారులు ఇతర అవసరాలకు యోగ్యం కాదు.
భారీ వర్షాలు కురిస్తే గనిలో నీరు నిండి ఉత్పత్తి ఆగిపోతుంది. బొగ్గు ఉత్పత్తి లక్ష్యంపై ప్రభావం పడుతుంది. డీ వాటరింగ్ చేసిన తర్వాతే మైనింగ్ ప్రారంభమవుతుంది.
సహజ పర్యావరణ వ్యవస్థలు దెబ్బతింటాయి. అడవులు తగ్గడంతో గనులు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతున్నది.



