Thursday, November 20, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుపంచాయతీ కసరత్తు షురూ

పంచాయతీ కసరత్తు షురూ

- Advertisement -

ఏర్పాట్లు మొదలు పెట్టిన రాష్ట్ర ఎన్నికల సంఘం
ఓటర్ల సవరణ షెడ్యూల్‌ విడుదల
23న తుది ఓటర్ల జాబితా ఖరారు
డిసెంబర్‌ రెండో వారంలో నోటిఫికేషన్‌
బీసీ రిజర్వేషన్లపై పార్టీల మల్లగుల్లాలు
పార్టీల పరంగా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న బీసీ సంఘాలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కసరత్తు షురూ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఏర్పాట్లను ముమ్మరం చేసింది. డిసెంబర్‌ రెండో వారంలో ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికంటే ముందు ఓటర్ల సవరణ ప్రక్రియ షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ ప్రకటించింది. దీనికి ఈనెల 23వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. 2026 మార్చి 31వ తేదీ నాటికి ఎన్నికల నిర్వహించకుంటే గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదించిన రూ.3వేల కోట్ల నిధులు మురిగిపోతాయి. అందువల్ల ఆ నిధుల కోసమైనా, ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది.

అదే సమయంలో ఎమ్‌పీటీసీ, జెడ్‌పీటీసీ, ఎంపీపీ ఎన్నికలను బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు తీర్పు వచ్చాకే నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గ్రామపంచాయతీల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పార్టీపరంగా అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అయితే పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగవనీ, వాటిని స్వతంత్రంగా నిర్వహిస్తారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌ అభ్యంతరం తెలిపారు. పార్టీ గుర్తులు లేనిచోట్ల పార్టీల పరంగా రిజర్వేషన్లు ఎలా సాధ్యమవుతాయనేది వారి వాదన. అయితే పార్టీ గుర్తులు లేకున్నా, సహజంగా ఆయా పార్టీలు బలపరిచిన అభ్యర్థులే పంచాయతీ ఎన్నికల్లో పోటీపడటం కనిపిస్తుంది. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్‌పార్టీ ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. బీజేపీ కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించింది. బీఆర్‌ఎస్‌ ఇప్పటి వరకు దీనిపై స్పష్టత ఇవ్వలేదు. మంత్రివర్గ నిర్ణయాన్ని కొన్ని బీసీ సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి.

రిజర్వేషన్ల అంశం తేలాకే ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాయి. అయితే మంత్రివర్గ నిర్ణయంతో రాష్ట్రంలోని 31 గ్రామీణ జిల్లాల్లోని 12,733 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే తాజా మాజీ సర్పంచ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.530 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీనికోసం సర్పంచ్‌ల సంఘం జేఏసీ పలుమార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించి, ఆందోళనలు చేపట్టింది. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పుడు గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించి, కేంద్ర నిధులు వస్తే, వాటితో పాత బకాయిల చెల్లించాలని భావిస్తుంది. అయితే ఈ ప్రతిపాదనను తాజా మాజీ సర్పంచ్‌లు వ్యతిరేకిస్తున్నారు. తాము అప్పులుచేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టామనీ, తమ బకాయిలు విడుదల చేశాకే, ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్‌ చేస్తున్నారు. మళ్లీ తాము ఎన్నికల్లో పోటీచేయాలంటే ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాదిస్తున్నారు. ఈ దశలో పాత బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి! .

ఓటర్ల సవరణకు ఎస్‌ఈసీ షెడ్యూల్‌
పంచాయతీల్లో ఓటరు జాబితాల సవరణకు ఎస్‌ఈసీ షెడ్యూలు ప్రకటించింది. బుధవారం నుంచి ఈనెల 23 వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించనున్నారు. 20న ఓటర్ల జాబితాల్లో తప్పుల సవరణ కోసం దరఖాస్తులు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. 21న వాటిని పరిష్కరిస్తారు. 23న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. అదేరోజు పోలింగ్‌ కేంద్రాలనూ నిర్ణయిస్తారు. ఈమేరకు జిల్లా పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -