Thursday, November 20, 2025
E-PAPER
Homeజాతీయంబీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌

బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌

- Advertisement -

ఎన్డీఏ శాసనసభాపక్షనేతగా ఎన్నిక..పదోసారి ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణం

పాట్నా: బీహార్‌లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తదుపరి సీఎంగా నితీశ్‌ కుమార్‌ను అధికారికంగా ఖరారు చేశారు. జేడీయూ ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతగా నితీశ్‌ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సచివాలయంలోని సంవాద్‌లో జరిగిన కార్యక్రమంలో నితీశ్‌ కుమార్‌ను శాసనసభా పక్షనేతగా విజరు చౌదరి, ఉమేష్‌ కుష్వాహా ప్రతిపాదించగా, పార్టీ నేతలు మద్దతు తెలిపారు. అనంతరం గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ వద్దకు వెళ్లిన నితీశ్‌కుమార్‌ రాజీనామా పత్రాన్ని సమర్పించగా దీనిని ఆయన ఆమోదించారు. ఈ సందర్భంగా నితీశ్‌ కుమార్‌, ఎన్డీఏ నేతలు నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ ను కోరారు. పాట్నాలోని గాంధీ మైదానంలో గురువారం మధ్యాహ్నం జరిగే కార్యక్రమంలో నితీశ్‌కుమార్‌ పదోసారి బీహార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.

మంత్రి పదవులపై మంతనాలు!
అదే విధంగా స్పీకర్‌ పదవితో సహా కీలక మంత్రి పదవుల కేటాయింపుపై చర్చలు జరగనున్నట్టు తెలుస్తోంది. స్పీకర్‌ పదవి కోసం బీజేపీ, జేడీయూ పార్టీలు గట్టిగా పట్టుబట్టినట్టు అధికార వర్గాలు తెలిపాయి. గత అసెంబ్లీలో బీజేపీకి చెందిన నందకిశోర్‌ యాదవ్‌ స్పీకర్‌గా ఉన్నారు. జేడీయూ పార్టీకి చెందిన నరేంద్ర నారాయణ్‌ యాదవ్‌ డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. అయితే ఈసారి కూడా స్పీకర్‌ పదవిని దక్కించుకోవాలని బీజేపీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, మంత్రివర్గ కూర్పుపై భాగస్వామ్య పక్షాల మధ్య ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (89), జేడీయూలకు (85) సీట్లు రావడంతో ప్రతి ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఫార్ములాకు ఎన్డీఏలోని పార్టీలు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ ఫార్ములా ప్రకారం బీజేపీకి 15 లేదా 16, జేడీయూకు 14, ఎల్‌జేపీ (రామ్‌విలాస్‌) పార్టీకి 3, ఆర్‌ఎల్‌ఎం, హెచ్‌ఏఎంలకు ఒకొక్కటి చొప్పున మంత్రిపదవులు లభించే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -