Thursday, November 20, 2025
E-PAPER
Homeజాతీయంట్రిబ్యునల్‌ సంస్కరణల చట్టం రాజ్యాంగ విరుద్ధం

ట్రిబ్యునల్‌ సంస్కరణల చట్టం రాజ్యాంగ విరుద్ధం

- Advertisement -

జ్యుడీషియల్‌ స్వేచ్ఛకు ఉల్లంఘనే : సుప్రీం

న్యూఢిల్లీ : ట్రిబ్యునల్‌ సంస్కరణల చట్టం, 2021ని సుప్రీం కోర్టు బుధవారం కొట్టివేసింది. రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు ప్రకటించిన ఆర్డినెన్స్‌ను ‘కొద్దిగా సవరించి పునరుత్పత్తి’ చేశారని వ్యాఖ్యానించింది. వివిధ ట్రిబ్యునళ్ళకు చెందిన సభ్యుల నియామకాలు, కాల పరిమితి, సర్వీస్‌ పరిస్థితులకు సంబంధించి నిబంధనలను కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవారు, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌లతో కూడిన బెంచ్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ట్రిబ్యునల్‌ నియామకాలకు సంబంధించి తాము గతంలో ఇచ్చిన తీర్పులను అమలు చేయలేదంటూ కేంద్రప్రభుత్వ వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత తీర్పుల సందర్భంగా కొట్టివేసిన కొన్ని నిబంధనలనే కొద్దిగా సవరించి మళ్ళీ ఇప్పుడు తీసుకువచ్చారం టూ బెంచ్‌ ఆ చట్టంతో విభేదించింది. అధికారాల విభజన, జ్యుడీషియల్‌ స్వేచ్ఛకు సంబంధించిన సూత్రాలను ఈ చట్టం ఉల్లంఘిస్తోందని కోర్టు పేర్కొంది. లోపాలను సరిచేయకుండా, కట్టుబడి వుండాల్సిన తీర్పులను కూడా చట్టబద్ధంగా ఉల్లంఘించేలా ఈ చట్టం వుందని వ్యాఖ్యానించింది.

ట్రిబ్యునల్‌ సంస్కరణల (హేతుబద్ధీకరణ, సేవా నిబంధనలు) ఆర్డినెన్స్‌, 2021 కీలకమైన ట్రిబ్యునళ్ళకు జరిగే నియామకాలు, వాటి పాలనా, పనితీరులో ప్రభుత్వం జోక్యం చేసుకునేలా వుందని సుప్రీం కోర్టు ప్రకటించింది. ఆ తీర్పు వచ్చిన రోజుల వ్యవధిలోనే ట్రిబ్యునల్‌ సంస్కరణల చట్టం రూపొందించింది. ఆ ఆర్డినెన్స్‌ను పునరుద్ధరించి నట్లుగానే వుందంటూ చట్టాన్ని సవాలు చేస్తూ మద్రాసు బార్‌ అసోసియేషన్‌, కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై విచారించిన సుప్రీం బెంచ్‌ పై తీర్పునిచ్చింది. 2021 జలైలో లేవనెత్తిన అంశాలను పరిష్కరించడానికి బదులుగా వాటినే కొద్దిగా మార్చి ఇలా తీసుకురావడం రాజ్యాంగ ఆధిక్యతను అవమానించడమే కాగలదని బెంచ్‌ వ్యాఖ్యానించింది. ఈ తీర్పు వచ్చిన నాలుగు మాసాల వ్యవధిలో జాతీయ ట్రిబ్యునల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేయాల ని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ట్రిబ్యునళ్ళ స్వేచ్ఛకు, పారదర్శకతకు, పని విధానంలో ఏకరూపతకు, ఇలా అన్నింటికీ సంబంధించి కీలకమైన వ్యవస్థాగత రక్షణలు కల్పించాల్సిన అవసరం వుందని బెంచ్‌ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -