Thursday, November 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబూటకపు ఎన్‌కౌంటర్లే

బూటకపు ఎన్‌కౌంటర్లే

- Advertisement -

హత్యాకాండల్ని ఆపాలి
మావోయిస్టుల అరెస్టులను బహిరంగంగా ప్రకటించాలి : వామపక్ష పార్టీలు


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అటవీ ఖనిజ సంపదను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టేందుకు ఆపరేషన్‌ కగార్‌ పేరుతో కేంద్రం ప్రభుత్వం చేయిస్తున్న బూటకపు ఎన్‌కౌంటర్ల హత్యాకాండను వెంటనే నిలిపేయాలని వామపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు బుధవారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పి.సూర్యం, సీపీఐ(ఎంఎల్‌)మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సీపీఐ(ఎంఎల్‌)లిబరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేశ్‌రాజా, ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి సీహెచ్‌.మురహరి, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు, సీపీఐ(ఎంఎల్‌) రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న ఒక ప్రకటన విడుదల చేశారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులతో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారనీ, వారిలో రోజుకు కొందరిని అడవుల్లోకి తీసుకెళ్లి కాల్చి చంపుతున్నారని విమర్శించారు. మంగళవారం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు హిడ్మాతో పాటు మరో ఆరుగురిని తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీప్రాంతంలో కాల్చి చంపారనీ, బుధవారం రంపచోడవరంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి తిప్పిరి తిరుపతితో పాటు మరో ఏడుగురిని కాల్చి చంపారని తెలిపారు. పట్టుకున్న వారి అరెస్టును ప్రకటించకుండా ఎన్‌కౌంటర్ల పేరుతో కాల్చి చంపడం రాజ్యాంగాన్ని, చట్టాలను అవహేళన చేయడమేనని పేర్కొన్నారు. మోడీ సర్కారు సాగిస్తున్న ఫాసిస్టు దమనకాండలో భాగమే ఈ బూటకపు ఎన్‌కౌంటర్లు అని తెలిపారు. కగార్‌ పేరుతో మావోయిస్టుతో పాటు ఆదివాసీ బిడ్డలను కాల్చి చంపడాన్ని తప్పుబట్టారు. ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టే విధానాలను మార్చుకోవాలని కేంద్రానికి సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -